ఆల్కహాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Alcohol And Medicines: ఆల్కహాల్ తీసుకున్న తర్వాత ట్యాబ్లెట్ వేసుకునే అలవాటు కొందరికి ఉంటుంది. అయితే ఇలా చేయడం ఎంత వరకు మంచిది.? ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఆల్కహాల్, మందులు కలిస్తే శరీరంలో ఏం జరుగుతుంది?
ఆల్కహాల్, చాలా రకాల మందులు శరీరంలో ప్రధానంగా కాలేయం ద్వారా ప్రాసెస్ అవుతాయి. ఒకేసారి ఆల్కహాల్, మందులు తీసుకున్నప్పుడు కాలేయంపై అదనపు భారం పడుతుంది. కొన్ని సందర్భాల్లో మందు శరీరంలో ఎక్కువసేపు ఉండటం లేదా దాని ప్రభావం ఎక్కువ కావడం జరగొచ్చు. మరికొన్ని మందుల ప్రభావం తగ్గే అవకాశం కూడా ఉంటుంది. దీంతో వికారం, వాంతులు, తల తిరగడం, మగత, స్పృహ కోల్పోవడం వంటి సమస్యలు రావచ్చు. కొన్ని మందులతో కలిపి ఆల్కహాల్ తీసుకున్నప్పుడు గుండెకు సంబంధించిన సమస్యలు, అంతర్గత రక్తస్రావం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి తీవ్రమైన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.
పెయిన్‌కిల్లర్స్‌తో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?
తలనొప్పి, ఒళ్లు నొప్పులు లేదా జ్వరం వచ్చినప్పుడు చాలామంది పెయిన్‌కిల్లర్స్ తీసుకుంటారు. అయితే ఆల్కహాల్ సేవించిన తర్వాత వీటిని సొంతంగా తీసుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా పారాసెటమాల్ వంటి మందులను ఎక్కువ మోతాదులో లేదా తరచుగా తీసుకోవడం, దానికి తోడు ఆల్కహాల్ సేవించడం వల్ల కాలేయంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది.
అదే సమయంలో ఆక్సీకోడోన్ వంటి బలమైన నొప్పి నివారణ మందులను ఆల్కహాల్ తో కలిపి తీసుకుంటే తీవ్రమైన మగత, శ్వాస నెమ్మదించడం, ఓవర్‌డోస్ వంటి ప్రమాదాలు పెరగవచ్చు. అందుకే ఆల్కహాల్ తాగిన వెంటనే ఏ పెయిన్‌కిల్లర్ తీసుకోవాలన్నా ముందుగా వైద్యుడు లేదా ఫార్మసిస్ట్ సలహా తీసుకోవడం మంచిది.
బీపీ, షుగర్ మందులు వాడేవారు మరింత జాగ్రత్త
ఇప్పటికే బ్లడ్ ప్రెజర్ లేదా డయాబెటిస్‌కు మందులు వాడుతున్న వారు ఆల్కహాల్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఆల్కహాల్ రక్తపోటును తగ్గించవచ్చు. మందులతో కలిసినప్పుడు బీపీ మరింత పడిపోయి తల తిరగడం, బలహీనత, స్పృహ తప్పడం వంటి సమస్యలు రావచ్చు. అలాగే డయాబెటిస్‌కు ఉపయోగించే కొన్ని మందులతో ఆల్కహాల్ కలిస్తే రక్తంలో చక్కెర స్థాయిలు చాలా తక్కువకు పడిపోయే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా వయసు పైబడినవారిలో ఇది తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు. అందుకే రెగ్యులర్‌గా మందులు తీసుకునే వారు ఆల్కహాల్ సేవించే ముందు తమ వైద్యుడి సలహా తీసుకోవడం అవసరం.
ఆల్కహాల్ తాగిన తర్వాత మందులు తీసుకోవాలంటే ఏం చేయాలి?
ఆల్కహాల్ తాగిన తర్వాత తలనొప్పి లేదా ఇతర సమస్యలు వస్తే వెంటనే సొంతంగా మందులు వేసుకోవడం కంటే వైద్యుడిని లేదా ఫార్మసిస్ట్‌ను సంప్రదించడం సురక్షితం. ముఖ్యంగా ఇప్పటికే ఏదైనా అనారోగ్యానికి మందులు వాడుతున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆల్కహాల్ విషయంలో కూడా పరిమితి పాటించడం ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. అధికంగా ఆల్కహాల్ సేవించడం కాలేయానికి హాని కలిగించవచ్చు.
గమనిక: పైన తెలిపిన విషయాలను కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

