Weather Update: 3 రోజులు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్
Weather Update: హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూల్ న్యూస్ చెప్పింది. కర్ణాటక ద్రోణి ప్రభావంతో సెప్టెంబర్ 19 నుంచి 3 రోజుల పాటు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

వచ్చే 3 రోజులు తుపాను వానలు
కర్ణాటక నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం మారిపోయింది. ఈ ద్రోణి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు విస్తరించడం వల్ల రానున్న రోజుల్లో వాతావరణంలో పెను మార్పులు రాబోతున్నాయి. గడిచిన కొద్ది రోజులుగా సరైన వర్షాలు లేవు. అయితే, ప్రస్తుతం ఏర్పడిన వాతావరణ మార్పులతో రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
సెప్టెంబర్ 19 నుంచి మూడు రోజులు భారీ వర్షాలు
ఈ నెల 19 నుంచి వరుసగా మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. సెప్టెంబర్ 19న ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో జోరుగా వానలు పడతాయని అంచనా వేస్తూ, ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ఇక 20, 21 తేదీల్లో కూడా అనేక ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని ఐఎండీ తెలిపింది. బుధ, గురువారాల్లో మాత్రం తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయి.
లోటు వర్షపాతం దెబ్బ
సెప్టెంబరు మొదటి రెండు వారాల్లో తెలంగాణ వ్యాప్తంగా కేవలం 61 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. సాధారణంగా ఈ సమయంలో 86 మి.మీ వర్షం పడాల్సి ఉండగా, 28 శాతం లోటు ఏర్పడింది. గతేడాది ఇదే సమయంలో ఏకంగా 117 మి.మీ వర్షపాతం రికార్డవడం గమనార్హం.
జూన్ 1 నుంచి ఇప్పటివరకు తెలంగాణలో సాధారణ వర్షపాతం 659 మి.మీ ఉండాలి కానీ, ప్రస్తుతం 535 మి.మీ మాత్రమే కురిసింది. దీంతో ఈ సీజన్‌లో ఇప్పటివరకూ 19 శాతం లోటు నమోదైంది. నెలల వారీగా చూస్తే:
• జూన్: 11.74% లోటు
• జూలై: 1.36% లోటు
• ఆగస్టు: 37.67% లోటు
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అత్యధికంగా వర్షపాతం లోటు ఉంది. జోగులాంబ జిల్లాలో 45.42%, హనుమకొండలో 41.91%, వనపర్తిలో 40.70%, నాగర్‌కర్నూల్‌లో 38.67%, నారాయణపేటలో 37.42% లోటు నమోదైంది. అయితే, గడిచిన 24 గంటల్లో హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో అత్యధికంగా 9.2 సెం.మీ, జనగాం జిల్లా నర్మెట్టలో 8.5 సెం.మీ వర్షపాతం రికార్డయ్యాయి.
హైదరాబాద్ వాతావరణ పరిస్థితి ఎలా ఉంది?
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. ఉదయం నుంచి చల్లటి గాలులు వీస్తూ, సాయంత్రం లేదా రాత్రి వేళల్లో అకస్మాత్తుగా వర్షం పడే ఛాన్స్ ఉంది. గచ్చిబౌలి, మాదాపూర్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, బంజారాహిల్స్, ఎల్బీనగర్, ఉప్పల్ ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడవచ్చు. హైదరాబాద్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రత 30 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కావచ్చు.
ఏపీ వాతావరణం, మత్స్యకారులకు అలర్ట్
ఉపరితల ఆవర్తనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో ఏపీలోనూ రాగల 24 గంటల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లిలతో పాటు రాయలసీమలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయి. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని, పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున రైతులు పొలాల్లో పనిచేసేటప్పుడు చెట్ల కింద నిలబడవద్దని అధికారులు సూచించారు.

