Water In Dreams: కలలో నీళ్లు లేదా సముద్రం కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా?
Water In Dreams Meaning: కలలు రావడం సహజం. అయితే, కలలో స్వచ్ఛమైన నీరు, నది లేదా సముద్రం కనిపిస్తే శుభమా? మురికి నీరు వస్తే అశుభమా? స్వప్న శాస్త్రం చెబుతున్న ఆసక్తికర విషయాలు మీకోసం.

కలలో నీళ్లు లేదా సముద్రం కనిపిస్తే శుభమా? అశుభమా?
రాత్రి పడుకున్నాక మనకి రకరకాల కలలు వస్తుంటాయి. కొన్ని కలలు నిద్ర లేచాక మర్చిపోతాం, కానీ కొన్ని మాత్రం మనసులోనే ఉండిపోతాయి. ముఖ్యంగా కలలో నీళ్లు, చెరువులు, నదులు లేదా విశాలమైన సముద్రం కనిపిస్తే "అయ్యో! దీనికి అర్థం ఏంటి? నాకేమైనా మంచి జరుగుతుందా? లేదా ఏదైనా ఆపద వస్తుందా?" అని ఆలోచించడం చాలా కామన్. హిందూ సంప్రదాయాలు, స్వప్న శాస్త్రం ప్రకారం మన కలలో కనిపించే నీటికి మన జీవితంతో, ముఖ్యంగా మన మానసిక స్థితితో చాలా దగ్గరి సంబంధం ఉంది. నీరు అనేది మన భావోద్వేగాలు, అంతరదృష్టి, లక్ష్మీదేవి అనుగ్రహానికి ప్రతీకగా పరిగణిస్తారు.
కలలో కనిపిచే నీటి స్వచ్ఛత, దాని స్థితిని బట్టి అది శుభమా లేదా అశుభమా అనేది ఆధారపడి ఉంటుంది. అసలు స్వప్న శాస్త్రం ప్రకారం ఏ రకమైన నీరు కనిపిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు వివరంగా చూద్దాం.
ప్రశాంతమైన, స్వచ్ఛమైన నీరు: గుడ్ న్యూస్ వినబోతున్నారు
కలలో స్వచ్ఛమైన, పారదర్శకమైన నీటిని చూస్తే అది చాలా మంచి సంకేతం. మీ మనస్సు త్వరలోనే ప్రశాంతంగా మారబోతోందని, మిమ్మల్ని వేధించిన మానసిక ఒత్తిడుల నుండి రిలీఫ్ లభిస్తుందని అర్థం. ఇది ఆయురారోగ్యాలకు, సంతోషానికి సూచిక.
• ధన యోగం: డబ్బు ఇబ్బందులతో బాధపడుతున్న వారికి కలలో ప్రశాంతమైన నీరు లేదా నదిలో నీళ్లు ప్రవహిస్తున్నట్లు కనిపిస్తే త్వరలోనే ధనలాభం కలుగుతుంది.
• కార్యసిద్ధి: నదులు, చెరువులు లేదా కొలనులు కలలో కనిపిస్తే అనుకున్న పనులు సులభంగా నెరవేరి దేహసౌఖ్యం లభిస్తుంది.
• వర్షం, తాగే నీరు: కలలో మంచి నీరు తాగడం లేదా వర్షంలో తడవడం కనిపిస్తే శుభవార్తలు వింటారు. నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి.
సముద్రం కనిపిస్తే జీవితంలో ఊహించని మార్పులు
కలలో విశాలమైన సముద్రం కనిపించడం ఒక శక్తివంతమైన సంకేతం. ఇది జీవితంలో రాబోయే పెద్ద మార్పులకు లేదా కొత్త అవకాశాలకు ప్రతీక.
• సముద్రం దాటడం: కలలో విస్తారమైన సముద్రాన్ని ప్రశాంతంగా ఉన్నప్పుడు చూడటం లేదా సముద్రం/నదులను దాటుతున్నట్లు కల రావడం అత్యంత శుభప్రదం. జీవితంలో ఎదురయ్యే పెద్ద పెద్ద సవాళ్లను కూడా మీరు సులభంగా అధిగమిస్తారని, వ్యాపారం లేదా ఉద్యోగంలో ఊహించని ఎత్తుకు ఎదుగుతారని ఇది సూచిస్తుంది.
• సముద్ర తీరం: సముద్ర తీరంలో ప్రశాంతంగా కూర్చున్నట్లు లేదా నిలబడినట్లు కనిపిస్తే మీ జీవితంలో సానుకూల మార్పులు రాబోతున్నాయని అర్థం.
మురికి నీరు, వరదలు: ఈ హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకండి
అన్ని వేళలా నీరు మంచి ఫలితాలనే ఇవ్వదు. నీటి రంగు, దాని తీవ్రతను బట్టి అశుభ సంకేతాలు కూడా ఉంటాయి.
• మురికి నీరు: కలలో మురికి లేదా కలుషితమైన నీరు కనిపిస్తే అనారోగ్య సమస్యలు రావచ్చు. కుటుంబంలో కలహాలు, ఆందోళనలు లేదా తీవ్రమైన ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉందని స్వప్న శాస్త్రం హెచ్చరిస్తోంది.
• వరదలు, పొంగిపొర్లే నీరు: వరద నీరు కనిపిస్తే జీవితంలో కష్టాలు రాబోతున్నాయని అర్థం. ఉప్పొంగుతున్న నీరు మీలో ఉన్న భయం, భావోద్వేగ అస్థిరతను సూచిస్తుంది.
ఉగ్రరూపంలో ఉన్న సముద్రం, సునామీతో మానసిక గందరగోళం
కలలో సముద్రం శాంతంగా కాకుండా ఉగ్రరూపంలో కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలి.
• రాకాసి అలలు, సునామీ: సముద్రంలో పెద్ద పెద్ద రాకాసి అలలు ఎగసిపడటం లేదా సునామీ రావడం కనిపిస్తే మీ భావోద్వేగాలపై మీకు నియంత్రణ తప్పుతోందని అర్థం. జీవితంలో తీవ్రమైన గందరగోళం లేదా ఆర్థిక నష్టాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.
• అలల మధ్య చిక్కుకోవడం: సముద్రపు ఒడ్డున ఉండి విపరీతమైన అలల మధ్య ఉన్నట్లు కనిపిస్తే రాబోయే రోజుల్లో సవాళ్లు, కష్టాలు ఎదురవుతాయని పండితులు చెబుతున్నారు.
నీటిలో ఈత కొట్టడం లేదా మునిగిపోవడం
• ఈత కొట్టడం: స్వచ్ఛమైన నీటిలో హాయిగా ఈత కొడుతున్నట్లు కల వస్తే, మీరు మీ లక్ష్యాల వైపు విజయవంతంగా సాగుతున్నారని అర్థం.
• మునిగిపోవడం: ఒకవేళ నీటిలో మునిగిపోతున్నట్లు లేదా ఈదడానికి ప్రయత్నిస్తూ ఇబ్బంది పడుతున్నట్లు కల వస్తే, విపరీతమైన మానసిక ఒత్తిడి, అప్పుల బాధలు లేదా ఎదుటివారి వల్ల మోసపోయే అవకాశం ఉందని అర్థం.
స్వప్న శాస్త్రం ప్రకారం కలలో నీటి ప్రశాంతత లక్ష్మీ కటాక్షానికి, ప్రగతికి సంకేతమైతే.. అశాంతంగా ఉన్న నీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పే ఒక హెచ్చరిక. అయితే, ఇవన్నీ నమ్మకాలపై ఆధారపడిన విషయాలు మాత్రమే. వీటిని శాస్త్రీయంగా నిరూపించలేదు. మన రోజువారీ ఆలోచనలు, భయాలు, జ్ఞాపకాలు కూడా కలల రూపంలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎలాంటి కల వచ్చినా భయపడకుండా జాగ్రత్తగా ముందడుగు వేయడం మంచిది.

