Gold Investment : ఈరోజు తులం బంగారం కొంటే 2050 నాటికి ఎంత డబ్బు వస్తుంది? లాభం ఎంత?
గత కొన్నేళ్లలోనే బంగారం ధర విపరీతంగా పెరిగింది… భవిష్యత్ లో మరింత పెరుగుతుందనే అంచనాాలున్నాయి. మరి ఇప్పుడు లక్ష రూపాయలతో బంగారం కొంటే 2050 నాటికి దాని విలువ ఎంత ఉంటుంది? చాలామంది ఇన్వెస్టర్లలో ఇదే ప్రశ్న. దీనికి సమాధానం చూద్దాం.

2050 బంగారం ధర ఎంతుడొచ్చు?
భారతీయుల పెట్టుబడి అలవాట్లలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. దీన్ని కేవలం ఆభరణంగానే కాకుండా విలువను కాపాడే ఆస్తిగా కూడా చూస్తారు. ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, రూపాయి విలువలో మార్పులు వంటివి బంగారం ధరను ప్రభావితం చేస్తాయి. ఇటీవల బంగారం ధర విపరీతంగా పెరుగుతోంది… అప్పుడప్పుడు కొంత తగ్గుతోంది కూడా. ఇవాళ (సెప్టెంబర్ 7, సోమవారం) MCXలో 10 గ్రాముల బంగారం సుమారు రూ.1.52 లక్షల వద్ద ట్రేడ్ అయింది.
ఇప్పుడు 2050 నాటికి బంగారం లెక్కలు చూద్దాం. 2026 నుంచి 2050 వరకు సుమారు 24 ఏళ్లు ఉన్నాయని అనుకుందాం. ఏటా 10% చక్రవడ్డీ చొప్పున వృద్ధి వస్తే, ప్రస్తుతం సుమారు రూ.1.53 లక్షలు ఉన్న 10 గ్రాముల బంగారం విలువ 2050 నాటికి రూ.15.1 లక్షలకు చేరుతుంది. అదే 11% వృద్ధి రేటుతో రూ.18.7 లక్షలు, 12% వృద్ధితో రూ.23.2 లక్షలు కావచ్చు. ఇవి కచ్చితమైన ధరల లక్ష్యాలు కాదు. కేవలం నిర్దిష్ట CAGR కొనసాగితే వచ్చే గణిత అంచనాలు మాత్రమే.
లక్ష పెట్టుబడి పెడితే 2050 నాటికి ఎంత వస్తుంది?
ఇదే లెక్కను రూ.1 లక్ష పెట్టుబడికి వర్తింపజేస్తే ఫలితాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఏటా 10% చక్రవడ్డీ వృద్ధితో 24 ఏళ్ల తర్వాత మీ లక్ష రూపాయలు సుమారు రూ.9.85 లక్షలు అవుతుంది. అదే 11% వృద్ధితో రూ.12.24 లక్షలు, 12% వృద్ధితో రూ.15.18 లక్షలకు పెరగవచ్చు. అంటే దీర్ఘకాలంలో చక్రవడ్డీ రేటులో చిన్న తేడా కూడా చివరి మొత్తంలో పెద్ద మార్పును సృష్టిస్తుంది.
బంగారంపై పెట్టుబడి అంచనా మాాత్రమే..
అయితే ఇక్కడో ముఖ్యమైన విషయం మర్చిపోకూడదు. 2050లో బంగారం ధర రూ.15 లక్షలు లేదా రూ.20 లక్షలు అవుతుందని కచ్చితంగా చెప్పలేం. బంగారం ధర ఎప్పుడూ ఒకే స్ట్రెయిట్ లైన్‌లో పెరగదు. కొన్నిసార్లు భారీగా పెరగొచ్చు, మరికొన్నిసార్లు దారుణంగా పడిపోవచ్చు. అమెరికా వడ్డీ రేట్లు, డాలర్ విలువ, సెంట్రల్ బ్యాంకుల బంగారం కొనుగోళ్లు, ద్రవ్యోల్బణం, ప్రపంచ రాజకీయ పరిస్థితులు ధరపై ప్రభావం చూపుతూనే ఉంటాయి. ఇటీవలి మార్కెట్లలో కూడా అమెరికా వడ్డీ రేట్ల అంచనాలు బంగారంపై ఒత్తిడి పెంచాయి.
భవిష్యత్తులో బంగారం ధర..
దీర్ఘకాలిక పెట్టుబడుల్లో బంగారం ఒక మంచి ఆస్తిగా ఉంటుంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అధ్యయనం ప్రకారం, బంగారం చారిత్రకంగా మంచి రాబడిని అందించింది. ద్రవ్యోల్బణం నుంచి రక్షణ కల్పించడంలో, పెట్టుబడుల వైవిధ్యంలో (డైవర్సిఫికేషన్) కూడా ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే నగలు కొనేటప్పుడు తరుగు, జీఎస్టీ వంటి అదనపు ఖర్చులు ఉంటాయి. కాబట్టి "బంగారం ధర పెరుగుదల = ఇన్వెస్టర్‌కు అంతే లాభం" అని లెక్కేయలేం. అందుకే రూ.1 లక్ష మొత్తాన్ని బంగారంలోనే పెట్టే బదులు, వ్యక్తిగత లక్ష్యాలు, సమయం, రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం ముఖ్యం.

