Instant Idli: ఈ ఇడ్లీలను పిల్లలు ఇష్టంగా తింటారు.. చాలా హెల్తీ, చేయడం కూడా ఈజీ!
Instant Idli: ఉదయం పూట త్వరగా, హెల్తీగా ఉండే బ్రేక్ ఫాస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ సాఫ్ట్, టేస్టీ ఇన్‌స్టంట్ ఇడ్లీలు ట్రై చేయండి. వీటిని పిల్లలు ఇష్టంగా తింటారు. మరి ఇన్ స్టంట్ ఇడ్లీలు ఎలా చేయాలి? కావాల్సిన పదార్థాలేంటో ఇక్కడ చూద్దాం.

ఇన్ స్టంట్ ఇడ్లీల రెసిపీ
ఇడ్లీలను చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఇష్టంగా తింటారు. అయితే రోజూ ఒకే రకం ఇడ్లీలు తినాలంటే కాస్త బోర్ గానే అనిపిస్తుంది. అలాంటి వాళ్ల కోసమే ఈ ఇన్ స్టంట్ ఇడ్లీలు. సగ్గుబియ్యం, రవ్వ, పెరుగుతో, చాలా తక్కువ ఆయిల్ తో, తక్కువ టైంలో రుచికరమైన, మెత్తటి ఇడ్లీలు తయారు చేసుకోవచ్చు . మరి ఈ ఇడ్లీల కోసం ఇంకా ఏ పదార్థాలు కావాలి? తయారీ విధానం ఏంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
సగ్గుబియ్యం – 1 కప్పు
రవ్వ– 1 కప్పు
పెరుగు – 1 కప్పు
నీళ్లు – సరిపడా
ఉప్పు – రుచికి తగినంతా
తురిమిన కొబ్బరి – 1 టేబుల్ స్పూన్
నూనె – 1 టేబుల్ స్పూన్
ఆవాలు – పావు స్పూన్
మినపప్పు – పావు స్పూన్
జీలకర్ర – 1/2 స్పూన్
అల్లం – చిన్న ముక్క
పచ్చిమిర్చి – 1-2
కరివేపాకు – కొద్దిగా
జీడిపప్పు- కొద్దిగా
తయారీ విధానం
ముందుగా సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు పోసి 2-3 గంటలు నానబెట్టాలి. బాగా నానిన తర్వాత నీటిని పూర్తిగా వంపేయాలి. మరొక గిన్నెలో రవ్వను తీసుకొని నానబెట్టిన సగ్గుబియ్యం కలపాలి. దీనికి పెరుగు, తగినంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత అవసరమైనన్ని నీళ్లు పోసి మెత్తగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కనీసం 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
పోపు చేసే విధానం
ఆ తర్వాత ఒక చిన్న కడాయిలో నూనె వేసి ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసి పోపు పెట్టాలి. అవి చిటపటలాడాక, తరిగిన అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, జీడిపప్పు వేసి వేయించాలి. ఆ మిశ్రమాన్ని నానబెట్టిన ఇడ్లీ పిండిలో వేసి, దానితో పాటు 1 టేబుల్ స్పూన్ తురిమిన కొబ్బరి కూడా వేసి బాగా కలుపుకోవాలి.
ఆవిరిపై ఉడికించడం
ఇప్పుడు ఇడ్లీ పాత్రలో తగినన్ని నీళ్లు పోసి ఇడ్లీ ప్లేట్లలో పిండిని వేయాలి. ప్లేట్లను పాత్రలో పెట్టి 10-20 నిమిషాలు ఆవిరిపై ఉడికించాలి. ఉడికిన తర్వాత ఒక స్పూన్‌తో ఇడ్లీలను నెమ్మదిగా తీసి ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం, రవ్వ ఇడ్లీని పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ లేదా కారప్పొడితో తింటే రుచి అదిరిపోతుంది. మరి లేటేందుకు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు కచ్చితంగా నచ్చుతుంది.

