Milk at Night: రాత్రి పడుకునే ముందు పాలు తాగితే నిజంగా నిద్ర బాగా పడుతుందా?
Milk at Night: రాత్రి భోజనం తర్వాత ఒక గ్లాసు వేడి పాలు తాగి పడుకుంటే హాయిగా నిద్ర పడుతుందని చాలామంది చెబుతుంటారు. అందుకే నిద్ర సరిగ్గా పట్టని సమయంలో కూడా కొందరు పాలు తాగుతారు. కానీ నిజంగా పాలు తాగడం వల్ల నిద్ర బాగా పడుతుందో లేదో ఇక్కడ తెలుసుకుందాం.

రాత్రి పాలు తాగితే ఏమవుతుంది?
రాత్రి భోజనం చేసిన తర్వాత ఒక గ్లాసు పాలు తాగడం చాలామందికి అలవాటు. ముఖ్యంగా నిద్రపోయే ముందు వేడి పాలు తాగితే హాయిగా నిద్ర పడుతుందని పెద్దలు చెబుతుంటారు. అయితే రాత్రిపూట పాలు తాగితే నిజంగానే నిద్ర బాగా పడుతుందా? పాలు నిద్రకు ఎలా సహాయపడతాయి? వంటి డౌట్స్ చాలామందికి ఉంటాయి. మరి దీని గురించి ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం.
పాలల్లో ఉండే ఆమ్లం..
పాలలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. మన శరీరం దీన్ని ఉపయోగించి నిద్రతో సంబంధం ఉన్న కొన్ని రసాయనాలను తయారు చేస్తుంది. అందుకే పాలు నిద్రకు కొంతవరకు ఉపయోగపడవచ్చు. అయితే పాలు తాగిన వెంటనే నిద్ర వస్తుందని మాత్రం చెప్పలేం. ప్రతి ఒక్కరి శరీరం ఒక్కో విధంగా స్పందిస్తుంది.
అలవాట్లు కూడా ముఖ్యం
నిపుణుల ప్రకారం రాత్రిపూట వెచ్చని పాలు తాగడం వల్ల మనసుకు కొంత ప్రశాంతత కలగవచ్చు. ముఖ్యంగా ప్రతిరోజూ ఒకే సమయంలో పాలు తాగి పడుకునే అలవాటు ఉంటే, అది నిద్రకు ముందు ఒక రొటీన్‌గా మారుతుంది. రాత్రి భోజనం తర్వాత మొబైల్ పక్కన పెట్టి, లైట్లు ఆపేసి, వెచ్చని పాలు తాగి పడుకోవడం వల్ల శరీరం నిద్రకు సిద్ధమయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ పాలు మాత్రమే కాకుండా నిద్రకు ముందు పాటించే ప్రశాంతమైన అలవాట్లు కూడా ముఖ్యమే.
ఈ సమస్యలు వచ్చే అవకాశం
అయితే అందరికీ రాత్రిపూట పాలు పడకపోవచ్చు. కొంతమందికి పాలు తాగిన తర్వాత గ్యాస్, కడుపు ఉబ్బరం లేదా కడుపులో అసౌకర్యం కలగవచ్చు. ముఖ్యంగా పాలలో ఉండే లాక్టోస్‌ను జీర్ణం చేసుకోవడంలో ఇబ్బంది ఉన్నవారికి ఈ సమస్య ఎక్కువగా ఉండొచ్చు. అలాంటి వారు రాత్రిపూట పాలు తాగిన తర్వాత నిద్ర బదులుగా అసౌకర్యంతో ఇబ్బంది పడే అవకాశం ఉంది.
ఎక్కువ మొత్తంలో పాలు తాగితే..
పాలు తాగే పరిమాణం కూడా ముఖ్యం. నిద్రపోయే ముందు ఎక్కువ మొత్తంలో పాలు తాగితే కొంతమందికి కడుపు భారంగా అనిపించవచ్చు. మరికొందరికి రాత్రి మధ్యలో మూత్ర విసర్జన కోసం లేవాల్సి రావచ్చు. దీనివల్ల నిద్రకు అంతరాయం కలగవచ్చు. అందుకే మీకు సరిపోయే మోతాదులో పాలు తీసుకోవడం మంచిది. అలాగే పాలలో ఎక్కువ చక్కెర కలిపి తాగడం మంచిదికాదు.
నిద్ర బాగా రావాలంటే పాలు మాత్రమే కాకుండా మరికొన్ని విషయాలను కూడా పాటించాలి. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, ఒకే సమయానికి నిద్రలేవడం ముఖ్యం. పడుకునే ముందు ఎక్కువసేపు మొబైల్ ఫోన్ చూడకపోవడం మంచిది. అలాగే రాత్రి సమయంలో టీ, కాఫీ ఎక్కువగా తాగకూడదు. రాత్రి భోజనాన్ని కూడా తేలికగా తీసుకోవడం మంచిది. పడుకునే ముందు ఒత్తిడి, ఆందోళన తగ్గించుకోవడానికి ప్రశాంతంగా ఉండటం కూడా నిద్రకు సహాయపడుతుంది.

