Telangana: దళితుల పట్ల బీఆర్‌ఎస్‌ నాయకుల వైఖరి మరోసారి బహిర్గతమైందని శక్తి, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి అన్నారు. బుధవారం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ పార్టీపై ధ్వ‌జ‌మెత్తారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.

కేసీఆర్‌ ఫాంహౌస్‌ వద్ద దళితులు నిరసన తెలిపిన అనంతరం ఆ ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుద్ధీకరణ చేయడం అత్యంత బాధాకరం అని అన్నారు. దళితులు అక్కడికి వెళ్లి డప్పులు కొడుతూ నిరసన తెలిపిన సమయంలో వారిపై దాడులు చేయడం, అనంతరం శుద్ధీకరణ చేయడం దళితుల పట్ల ఉన్న వివక్షను స్పష్టం చేస్తోందన్నారు.

తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన సమయంలో దళితులు డప్పులు కొడితే సంతోషించిన కేసీఆర్‌.. ఇప్పుడు అదే దళితులు తమ ఆత్మగౌరవం కోసం నిరసన తెలుపుతుంటే శుద్ధీకరణ చేయించడం ఏమిటని ప్రశ్నించారు. దళితులు నిరసన తెలిపిన ప్రదేశాన్ని శుద్ధి చేయడం ద్వారా బీఆర్‌ఎస్‌ నాయకుల మనస్తత్వం ఏమిటో ప్రజలకు అర్థమైందన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమన్నారు.

కేసీఆర్ కు దళితులంటే చిన్న చూపు

కేసీఆర్‌కు మొదటి నుంచీ దళితులను చిన్నచూపు చూడటం అలవాటేనని మంత్రి అన్నారు. ఒక దళితుడు ముఖ్యమంత్రి అయితాడు అని చెప్పి ఆ రోజులలో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చార‌న్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని అప్పట్లో హామీ ఇచ్చిన కేసీఆర్‌.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ మాటను నిలబెట్టుకోలేదన్నారు.

దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్‌.. ఆ హామీని అమలు చేయలేదని మంత్రి అన్నారు. అప్పట్లో దళితులకు ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచి మరింత మందికి ప్రయోజనం కల్పించాలని తాను కోరినా కేసీఆర్‌ అంగీకరించలేదన్నారు.

దళితులు పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు పెట్టుబడి సబ్సిడీ ఇవ్వాలని తాను అప్పట్లో గట్టిగా కోరినా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని మంత్రి అన్నారు. దళితులకు కాంట్రాక్టులు కల్పించాలని, చిన్న కాంట్రాక్టర్లకు అవకాశం ఇవ్వాలని కోరినా అమలు చేయలేదని చెప్పారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టర్‌ మేఘా కృష్ణారెడ్డి లాంటి వారికి వేల కోట్ల రూపాయల విలువైన పనులు అప్పగించారని అన్నారు. రైతు బంధు పథకం విషయంలో కౌలు రైతులకు కూడా ప్రయోజనం కల్పించాలని తాను కోరినప్పుడు కేసీఆర్‌ తనపై ఆగ్రహం వ్యక్తం చేశారని మంత్రి గుర్తు చేశారు.

చిన్న పార్టీగా ఉన్న బీఆర్‌ఎస్‌‌కు రూ.1,000 కోట్ల మేర విరాళాలు ఎలా వచ్చాయో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఆ పార్టీ నాయకులపై ఉందని మంత్రి అన్నారు. పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్‌ తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఎంతవరకు అమలు చేసిందో ముందుగా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లే అయిందని, ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉందని.. ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.

అధికారం కోల్పోయినప్పటికీ బీఆర్‌ఎస్‌ నాయకుల్లో అహంకారం తగ్గలేదని మంత్రి అన్నారు. అసెంబ్లీలో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని పలువురు సభ్యులు సూచించినప్పటికీ ఆ దిశగా వెళ్లకుండా శుద్ధీకరణ వంటి చర్యలకు పాల్పడటం బీఆర్ఎస్ నేతల మనస్తత్వాన్ని తెలియజేస్తోందన్నారు. తప్పు జరిగితే క్షమాపణ చెప్పడం పెద్ద విషయం కాదని సభ్యులు సూచించినా ఆ మార్గాన్ని వదిలి వివక్షకు తావిచ్చే చర్యలకు పాల్పడ్డారని అన్నారు.

అసెంబ్లీ ప్రాంగణంలో మహిళా ఎమ్మెల్యేల విషయంలో జరిగిన ఘటనపైనా సమగ్ర దర్యాప్తు జరపాలని మంత్రి కోరారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలను పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, బాధ్యులు ఎవరైనా సరే గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. ఘటన సమయంలో అక్కడ బీఆర్‌ఎస్‌ నాయకులే ఉన్నారని, అందువల్ల పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను తేల్చాల్సిన అవసరం ఉందన్నారు.