తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎన్. రామచందర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూరాల ప్రాజెక్ట్ సందర్శనకు పయనమైన ఆయనను జడ్చర్ల వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు… దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
Telangana Politics : మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల దగ్గర ఇవాళ (సెప్టెంబర్ 22, మంగళవారం) హైడ్రామా నడిచింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్న రైతులను కలిసేందుకు జూరాల ప్రాజెక్టు వద్దకు వెళ్తున్న తెలంగాణ బీజేపీ చీఫ్ ఎన్. రామచందర్ రావును పోలీసులు మార్గమధ్యలో అడ్డుకున్నారు. ఆయనతో పాటు పలువురు బిజెపి నాయకులను కూడా పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
రామచందర్ రావు అరెస్ట్ నేపథ్యంలో జడ్చర్లలో కాస్సేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ నాయకుడిని అరెస్టు చేయడంతో బీజేపీ శ్రేణులు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు… పోలీస్ వాహనాన్ని అడ్డుకున్నారు. అయితే భారీగా మొహరించిన పోలీసులు బిజెపి కార్యకర్తలను నిలువరించి రామచందర్ రావును అక్కడినుండి తరలించారు.

రైతులను కాంగ్రెస్ మోసం చేస్తోంది : తెెలంగాణ బిజెపి చీఫ్
అరెస్టుకు ముందు రామచందర్ రావు మీడియాతో మాట్లాడారు. జూరాల ప్రాజెక్టులో సరిపడా నీళ్లున్నా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వదలడం లేదని మండిపడ్డారు. "జూరాల ప్రాజెక్టు కింద సాగు చేస్తున్న రైతులు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. ప్రాజెక్టులో నీళ్లున్నా రైతులకు ఇవ్వడం లేదు. రైతులకు సపోర్ట్ గా బీజేపీ జూరాల ప్రాజెక్టును సందర్శించి, నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. కానీ పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చారు, ప్రాజెక్టు దగ్గరకు వెళ్లనివ్వడం లేదు. రాజకీయ పార్టీలను కనీసం రైతులను కూడా కలవనివ్వకపోవడం దారుణం. మమ్మల్ని అరెస్ట్ చేసినా మా కార్యక్రమాన్ని ఆపేది లేదు" అని ఆయన స్పష్టం చేశారు.
అరెస్టులు అక్రమం
పోలీసుల తీరును రామచందర్ రావు తప్పుబట్టారు. ఇదొక అక్రమ అరెస్ట్ అని, ప్రభుత్వ తీరు నియంతృత్వాన్ని తలపిస్తోందని విమర్శించారు. "బీజేపీ నేతల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం రైతులకు సాయం చేసే ఆలోచనలో లేదు. వీళ్లు రైతు వ్యతిరేకులు. తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులు కనిపిస్తున్నాయి" అని ఆయన అన్నారు.
పార్టీ నాయకత్వంతో పాటు అరెస్టయిన మరో బీజేపీ నేత గువ్వల బాలరాజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. "ఇది పూర్తిగా చట్టవిరుద్ధం. రైతులను ఆదుకోవాల్సిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని గాలికొదిలేసింది. కచ్చితంగా రైతులే వీళ్లకు బుద్ధి చెబుతారు" అని బాలరాజు అన్నారు.
"సాగుకు నీళ్లిచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మా అధ్యక్షుడు రామచందర్ రావు జూరాల ప్రాజెక్టును సందర్శించి రైతులను పరామర్శించడానికి వస్తే.. కాంగ్రెస్ పార్టీ కావాలనే మా బీజేపీ క్యాడర్ ను, నాయకత్వాన్ని అరెస్ట్ చేయిస్తోంది. రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కచ్చితంగా గుణపాఠం చెబుతాం. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీని ప్రశాంతంగా నిద్రపోనివ్వం" అని బాలరాజు హెచ్చరించారు.


