Nitin Nabin Net Worth : బిజెపి నూతన జాతీయాధ్యక్షుడి ఆస్తిపాస్తులు ఎన్నో తెలుసా..?
Nitin Nabin Net Worth : బిజెపి జాతీయాధ్యక్షుడిగా బిహార్ కు చెందిన నితిన్ నబిన్ ఎన్నికయ్యారు. ఇంతకూ ఆయన రాజకీయ నేపథ్యం ఏమిటి? ఏం చదువుకున్నారు..? ఆస్తిపాస్తులు ఎన్ని..? ఇలాంటి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

బిజెపి పగ్గాలు చేపట్టిన నితిన్ నబిన్
Nitin Nabin : కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిని ఎన్నుకుంది. బిహార్ కు చెందిన నితిన్ నబీన్ ను ఇటీవలే ఏకగ్రీవంగా ఎంపికచేసింది బిజెపి... ఇవాళ (జనవరి 20, మంగళవారం) ఆయన బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా వంటి కీలక నాయకుల సమక్షంలో మాజీ జాతీయాధ్యక్షుడు జెపి నడ్డా నుండి పార్టీ పగ్గాలు చేపట్టారు నితిన్. అతి చిన్న వయసులో (45 ఏళ్లు) బిజెపి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన ఘనత ఈయనకే దక్కింది.
నితిన్ నబిన్ కుటుంబ నేపథ్యం
నితిన్ నబిన్ సిన్హా 1980 సెప్టెంబర్ 1న బీహార్ రాజధాని పాట్నాలో జన్మించారు. ఆయన భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే నవీన్ కిషోర్ సిన్హా కుమారుడు. రాజకీయ వాతావరణంలో పెరిగిన నితిన్ నబిన్ చిన్న వయసులోనే రాజకీయాలను కెరీర్‌గా ఎంచుకున్నారు. రాజకీయ కుటుంబంనుండి వచ్చినా కిందిస్థాయి నుండి పొలిటికల్ కెరీర్ ప్రారంభించారు... అంచెలంచెలుగా ఎదిగారు.
భారతీయ జనతా యువమోర్చాతో రాజకీయ ఆరంగేట్రం
నితిన్ నబిన్ తన రాజకీయ ప్రస్థానాన్ని భారతీయ జనతా యువమోర్చా (BJYM)తో ప్రారంభించారు. ఈ సమయంలో ఆయన అనేక ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషించి, సంస్థను బలోపేతం చేయడానికి దోహదపడ్డారు. యువతలో ఆయనకు బలమైన పట్టు ఉంది. నితిన్ నబిన్‌కు బిజెపి రాష్ట్ర ఇన్‌చార్జి, సహ-ఇన్‌చార్జిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. సిక్కిం, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ ఇన్‌చార్జి, సహ-ఇన్‌చార్జిగా పనిచేశారు.
నితిన్ నబిన్ మొత్తం ఆస్తి ఎంత?
మైనేతా రిపోర్ట్ ప్రకారం... 2025లో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో నితిన్ నబిన్ తన మొత్తం ఆస్తిని రూ. 3,06,96,962గా ప్రకటించారు. ఆయనకు రూ. 56.66 లక్షల అప్పు కూడా ఉంది. నితిన్ నబిన్ బ్యాంకు ఖాతాల్లో మొత్తం రూ. 98,58,429 జమ ఉన్నట్లు చూపించారు. ఇది కాకుండా ఆయనకు రూ. 6,69,380 విలువైన బాండ్లు, డిబెంచర్లు, షేర్లు ఉన్నాయి. ఎల్ఐసీ, ఇతర భీమా పాలసీలలో రూ. 5,94,300 పెట్టుబడి పెట్టారు.
నితిన్ నబిన్ వాహనాలు, నగలు, భూమి
నితిన్ నబిన్‌కు ఒక స్కార్పియో, ఒక ఇన్నోవా క్రిస్టా కారు ఉన్నాయి. వాటి మొత్తం విలువ రూ.37,81,735. ఆయన వద్ద రూ.11,30,000 విలువైన ఆభరణాలు ఉన్నాయి. ఆయన పేరు మీద రూ.28,97,000 విలువైన వ్యవసాయ భూమి ఉంది. పాట్నాలోని ఎస్‌కే నగర్ ప్రాంతంలో రూ.1.18 కోట్ల విలువైన నివాస భవనం కూడా ఉంది. వార్షిక ఆదాయం రూ. 4.8 లక్షల వరకు ఉంటుందని నబిన్ పేర్కొన్నారు.
నితిన్ నబిన్ ఎంతవరకు చదువుకున్నారు..
ఎన్నికల అఫిడవిట్ ప్రకారం... నితిన్ నబిన్ 12వ తరగతి ఉత్తీర్ణులయ్యారు. 1996లో సెయింట్ మైఖేల్ హైస్కూల్ నుంచి సీబీఎస్‌ఈ బోర్డులో మెట్రిక్ పరీక్ష పాసయ్యారు. ఆ తర్వాత 1998లో న్యూఢిల్లీలోని సీఎస్‌కేఎం పబ్లిక్ స్కూల్ నుంచి 12వ తరగతి పూర్తి చేశారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఐదుసార్లు విజయం
2006 లో పాట్నా వెస్ట్ అసెంబ్లీ నుండి మొదటిసారి పోటీచేసి విజయం సాధించారు. తర్వాత బంకిపూర్ నుండి వరుస విజయాలు సాధిస్తున్నారు... 2010,2015,2020,2025 నాలుగుసార్లు... మొత్తంగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.. ఓటమన్నదె ఎరుగని నేతగా నితిన్ కు పేరుంది.
2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితిన్ నబిన్ దాదాపు 84,000 ఓట్ల భారీ తేడాతో గెలిచారు. ఈ ఎన్నికల్లో ఆయన శత్రుఘ్న సిన్హా కుమారుడు లవ్ సిన్హాను ఓడించారు. ఈ విజయంతో ఆయన రాజకీయ పలుకుబడి మరింత పెరిగింది.
2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బంకీపూర్ స్థానం నుంచి నితిన్ నబిన్ ఆర్జేడీకి చెందిన రేఖా కుమారిని 51,936 ఓట్లతో ఓడించారు. నితిన్ కు సంస్థాగత పట్టు, కార్యకర్తలతో సత్సంబంధాలు, పరిపాలనా సామర్థ్యాన్ని చూసి పార్టీ ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించింది.

