PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్‌స్థాన్ పర్యటనలో భాగంగా షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపే దిశగా కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
రెండు దేశాల్లో ప్రధాని మోదీ పర్యటన
ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 1, 2026 వరకు ప్రధాని మోదీ ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్‌స్థాన్‌లో పర్యటించనున్నారు. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవ్‌కత్ మిర్జియోయెవ్ ఆహ్వానం మేరకు తొలుత తాష్కెంట్‌కు వెళ్లనున్న మోదీ, అనంతరం కిర్గిజ్‌స్థాన్ రాజధాని బిష్కెక్‌కు చేరుకుంటారు. ఈ పర్యటన ద్వారా మధ్య ఆసియా దేశాలతో భారత వ్యూహాత్మక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరగనుంది.
తాష్కెంట్‌లో వాణిజ్యం, రక్షణపై చర్చలు
ఆగస్టు 29, 30 తేదీల్లో తాష్కెంట్‌లో జరిగే సమావేశాల్లో భారత్-ఉజ్బెకిస్తాన్ సంబంధాలపై ప్రధానంగా చర్చించనున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ కనెక్టివిటీ, రక్షణ, ఇంధనం వంటి రంగాల్లో సహకారాన్ని పెంచే అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. రెండు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న సాంస్కృతిక, చారిత్రక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపైనా దృష్టి పెట్టనున్నారు.
శాస్త్రి మెమోరియల్, గాంధీ సెంటర్ సందర్శన
తాష్కెంట్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్‌లోని శాస్త్రి మెమోరియల్, మహాత్మా గాంధీ సెంటర్‌ను ప్రధాని మోదీ సందర్శించనున్నారు. భారత్-ఉజ్బెకిస్తాన్ మధ్య ఉన్న చారిత్రక అనుబంధానికి ఈ ప్రదేశాలు ప్రతీకలుగా ఉన్నాయి. ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఈ పర్యటనకు ప్రాధాన్యం ఉంది.
బిష్కెక్‌లో SCO శిఖరాగ్ర సమావేశం
ఉజ్బెకిస్తాన్ పర్యటన ముగిసిన తర్వాత మోదీ బిష్కెక్‌లో జరిగే 26వ SCO శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారు. కిర్గిజ్‌స్థాన్ అధ్యక్షుడు సద్యార్ జపరోవ్ ఆహ్వానం మేరకు ఈ సమావేశంలో పాల్గొంటారు. SCO ఏర్పాటై 25 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ సదస్సుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. 2017లో సంస్థలో చేరిన భారత్ అప్పటి నుంచి పలు ప్రాంతీయ అంశాలపై చురుకైన పాత్ర పోషిస్తోంది.
ఉగ్రవాదంపై కఠిన వైఖరి
SCO పై ఉగ్రవాదం, వేర్పాటువాదం, అతివాదానికి వ్యతిరేకంగా సభ్య దేశాల సహకారాన్ని పెంచాలని భారత్ కోరుతోంది. ఈ ముప్పులను ఎదుర్కొనే విషయంలో ఎలాంటి మద్ధతు, ప్రోత్సాహానికి తావు లేకుండా సమిష్ఠిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని మోదీ ప్రస్తావించనున్నారు. అదే సమయంలో ప్రాంతీయ కనెక్టివిటీ, ఆర్థిక అవకాశాలు, వాణిజ్య సంబంధాల విస్తరణపైనా భారత్ తన దృష్టిని కొనసాగించనుంది. మొత్తంగా మోదీ పర్యటనలో భద్రతా సహకారంతో పాటు మధ్య ఆసియాతో ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాల విస్తరణకు ప్రాధాన్యం కనిపిస్తోంది. SCOలో భారత్ పాత్రను మరింత బలోపేతం చేసుకోవడంతో పాటు ప్రాంతీయ స్థిరత్వానికి సంబంధించిన అంశాలపై ఇతర సభ్య దేశాలతో కలిసి పనిచేయడం ఈ పర్యటనలో కీలకంగా ఉండనుంది.


