- Home
- Telangana
- Weather Update: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 4 రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్
Weather Update: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 4 రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్
Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. క్రమంలోనే వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఏపీ, తెలంగాణలో రాబోయే 4 రోజులు దంచికొట్టనున్న వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వానలు స్టార్ట్ అయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల వల్ల రాబోయే నాలుగు రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. గురువారం మోస్తరు వానలతో స్టార్ట్ అయి, శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు దంచికొట్టనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఐఎండీ పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం
వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం, బంగ్లాదేశ్‌కు ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో గురువారం ఒక అల్పపీడనం ఏర్పడనుంది. ఇది తర్వాత మరింత బలపడి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు పయనించే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఉపరితల ఆవర్తనం, రుతుపవనాల కదలికలు తీవ్రరూపం దాల్చడం వల్ల రెండు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో పాటు రాగల మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి.
తెలంగాణలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణలో గత వారం రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. సూర్యాపేటలో అత్యధికంగా 38 డిగ్రీలు నమోదు కాగా, ఖమ్మం, నల్గొండ, వరంగల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 37 డిగ్రీల మార్కును దాటేసింది. గాలిలో తేమ 100 శాతానికి చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
అయితే శుక్రవారం నుంచి ఈ పరిస్థితి పూర్తిగా మారనుంది. తెలంగాణలోని ఉత్తర, తూర్పు, మధ్య జిల్లాల్లో వర్ష ప్రభావం చాలా తీవ్రంగా ఉండనుంది.
ఎల్లో అలర్ట్ ఉన్న జిల్లాలు: ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం.
ఇతర ప్రాంతాలు: ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో వాతావరణం ఎలా ఉండబోతోంది?
హైదరాబాద్ నగరంతో పాటు దాని పరిసర ప్రాంతాలైన రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరిలలో వాతావరణం కూల్ కానుంది. ఆకాశం రోజంతా పాక్షికంగా లేదా పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో నగరంలోని పలు డివిజన్లలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 28°C నుంచి 30°C మధ్య, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 22°C నుంచి 24°C వరకు నమోదు కావచ్చు. గాలిలో తేమ శాతం 70 నుంచి 85 శాతానికి పైగా ఉండనుంది.
ఆంధ్రప్రదేశ్‌కు హెచ్చరికలు: మత్స్యకారులు, రైతులకు కీలక సూచనలు
ఆంధ్రప్రదేశ్‌లోనూ అల్పపీడన ప్రభావం స్పష్టంగా కనిపించనుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో మేఘావృత వాతావరణంతో పాటు బలమైన ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కాకినాడ, తూర్పుగోదావరి, తిరుపతి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వానలు పడే సూచనలు ఉన్నాయి.
మత్స్యకారులకు అలర్ట్: సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారే అవకాశం ఉండటంతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. అందువల్ల మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు స్పష్టం చేశారు.
రైతులు, ప్రజలకు జాగ్రత్తలు: పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు వర్షం పడే సమయంలో చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాలు లేదా ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఆశ్రయం పొందవద్దు. సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ కోరింది. మెట్ట పంటలు, ఉద్యానవన పంటలను కాపాడుకోవడానికి రైతులు ముందస్తు చర్యలు తీసుకోవడం మంచిది.
ఈ అల్పపీడనం పశ్చిమంగా పయనించి దక్షిణ ఛత్తీస్‌గఢ్ వైపు వస్తే కోస్తాంధ్రకు మరింత ఎక్కువ వర్షాలు పడే అవకాశముందని నిపుణుల అంచనా.

