- Home
- Technology
- ఇంత తక్కువ ధరలో ఇలాంటి ఫోన్ ఏంటి భయ్యా.. మోడల్, ఫీచర్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే
ఇంత తక్కువ ధరలో ఇలాంటి ఫోన్ ఏంటి భయ్యా.. మోడల్, ఫీచర్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే
Lava Virat Curve 5G: దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా తాజాగా లావా విరాట్ కర్వ్ పేరుతో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణగా 3D కర్వ్డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేతో పాటు వెనుక భాగంలో చిన్న డిస్‌ప్లే ఇచ్చారు.

లావా విరాట్ కర్వ్ ధర ఎంత.?
లావా విరాట్ కర్వ్ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో విడుదల చేశారు. దీని ధర రూ.23,999గా నిర్ణయించారు. అయితే ఆఫర్లతో ఈ ఫోన్‌ను రూ. 20 వేలకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ను సెప్టెంబర్ 28న సాయంత్రం 7 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను మూడు రంగుల్లో అందిస్తున్నారు. హెరిటేజ్ ఇండిగో, మక్రానా ఐవోరీ, ఎల్లోరా స్లేట్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి. తక్కువ ధరలో కర్వ్డ్ డిస్‌ప్లేను కోరుకునే యూజర్లను లక్ష్యంగా చేసుకుని లావా ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది.
120Hz కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే
లావా విరాట్ కర్వ్‌లో 6.67 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ 3D కర్వ్డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. ఇది 2400 × 1080 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో వస్తుంది. స్క్రీన్‌కు 120Hz రిఫ్రెష్ రేట్, గరిష్ఠంగా 1,100 నిట్స్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. కర్వ్డ్ డిజైన్ కారణంగా వీడియోలు చూడటం, సోషల్ మీడియా స్క్రోల్ చేయడం వంటి పనుల్లో స్క్రీన్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
అయితే ఈ ఫోన్‌లో అందరి దృష్టిని ఆకర్షించే మరో ప్రత్యేక ఫీచర్ వెనుక భాగంలో ఉన్న మినీ డిస్‌ప్లే. కెమెరాల కింద చిన్న పిల్ ఆకారంలో ఈ స్క్రీన్‌ను ఇచ్చారు. ఇందులో టైమ్, నోటిఫికేషన్లు, బ్యాటరీ స్థాయి, వాల్యూమ్, ఎమోజీలు, కస్టమ్ మెసేజ్‌లు వంటి వివరాలను చూడొచ్చు. ఫోన్‌ను పూర్తిగా చేతిలోకి తీసుకోకుండానే కొన్ని సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది.
కెమెరా విషయానికొస్తే..
లావా విరాట్ కర్వ్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7100 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. రోజువారీ పనులు, సోషల్ మీడియా, వీడియోలు, సాధారణ గేమింగ్ వంటి అవసరాలకు సరిపడే పనితీరు అందించేలా ఈ ప్రాసెసర్‌ను తీసుకొచ్చారు. దీనికి అదనంగా 6GB వర్చువల్ RAM సపోర్ట్ కూడా ఉంది. కెమెరాల విషయానికి వస్తే వెనుక భాగంలో 50MP Sony IMX752 ప్రైమరీ కెమెరా ఉంది. ఈ కెమెరాతో 2K రిజల్యూషన్‌లో 30fps వరకు వీడియో రికార్డింగ్ చేయవచ్చు. అలాగే 10x డిజిటల్ జూమ్ సపోర్ట్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 13MP కెమెరా ఇచ్చారు.
భారీ బ్యాటరీ
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6,000mAh బ్యాటరీ ఉంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అయితే బాక్స్‌లో కంపెనీ 33W ఛార్జర్‌ను అందిస్తోంది. లావా ప్రకారం ఈ ఫోన్ 55 గంటల వరకు టాక్‌టైమ్, 11 గంటల వరకు నిరంతర యూట్యూబ్ ప్లేబ్యాక్, 720 గంటల వరకు స్టాండ్‌బై టైమ్ అందిస్తుంది. సాఫ్ట్‌వేర్ పరంగా ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16తో వస్తోంది. రెండు OS అప్‌గ్రేడ్‌లు, మూడేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని కంపెనీ తెలిపింది. భద్రత, మన్నిక కోసం MIL-STD 810H మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉన్నాయి. వీటితో పాటు ఐఆర్ బ్లాస్టర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, డ్యూయల్ మైక్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
లావా విరాట్ కర్వ్‌లో ప్రత్యేకత ఇదే
రూ.23,999 ధరలో లావా విరాట్ కర్వ్ ప్రధానంగా కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, వెనుక మినీ డిస్‌ప్లే, 6,000mAh బ్యాటరీతో ప్రత్యేకంగా కనిపిస్తోంది. ముఖ్యంగా వెనుక చిన్న స్క్రీన్ ఈ ఫోన్‌కు ఇతర ఫోన్లతో పోలిస్తే భిన్నమైన రూపాన్ని ఇస్తుంది. మరోవైపు పెద్ద బ్యాటరీ, కెమెరా పనితీరు లేదా ఎక్కువ కాలం సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ కోరుకునే వారు ఈ ధరలో అందుబాటులో ఉన్న ఇతర మోడళ్లను కూడా పరిశీలించవచ్చు. మొత్తంగా చూస్తే కర్వ్డ్ డిస్‌ప్లేతో పాటు కొత్త తరహా డిజైన్‌ను కోరుకునే వారికి లావా విరాట్ కర్వ్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.

