Earphone Safety : రోజూ ఇయర్‌ఫోన్స్ వాడుతున్నారా? మీ చెవులను కాపాడుకునే సింపుల్ టిప్స్!
మీరు ఇయర్‌ఫోన్స్ ఎక్కువగా వాడుతున్నారా? అయితే ఎక్కువ సౌండ్ పెట్టడం, ఎక్కువసేపు వాడటం వల్ల చెవులకు కలిగే నష్టాన్ని నివారించేందుకు ఈ 5 ముఖ్యమైన టిప్స్ తెలుసుకోండి.

రోజూ ఇయర్‌ఫోన్స్ వాడుతున్నారా?
ఉదయం లేవగానే పాటలు వినడానికి, వీడియోలు చూడటానికి, ఆన్‌లైన్ మీటింగ్స్ కోసం... ఇలా ఫోన్, ఇయర్‌ఫోన్స్ మన దినచర్యలో భాగమైపోయాయి. చాలామంది రోజూ గంటల తరబడి వీటిని వాడుతున్నారు. కానీ ఎంత సౌండ్‌లో వింటున్నాం, ఎంతసేపు వాడుతున్నామనే దానిపై శ్రద్ధ పెట్టకపోతే చెవులకు నష్టం తప్పదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా ఎక్కువ సౌండ్ ను ఎక్కువసేపు వినొద్దని హెచ్చరిస్తోంది.
వాల్యూమ్‌ను 60% మించి పెంచొద్దు...
పాటలు వినేటప్పుడు సౌండ్ తక్కువగా ఉందని చాలామంది ఇయర్‌ఫోన్స్ వాల్యూమ్‌ను గరిష్ఠ స్థాయికి పెంచేస్తారు. కానీ ఇదే చెవులకు అసలు సమస్య. WHO సిఫార్సు ప్రకారం… మొబైల్, ల్యాప్‌టాప్ లేదా ఏ పరికరంలోనైనా వాల్యూమ్‌ను 60% కంటే ఎక్కువగా పెట్టకపోవడమే మంచిది. సింపుల్‌గా చెప్పాలంటే ఇయర్‌ఫోన్స్ పెట్టుకున్నప్పుడు పక్కనవాళ్లు మాట్లాడేది వినిపించకపోతే, వాల్యూమ్ ఎక్కువగా ఉన్నట్లే లెక్క. ఈ స్థాయిలో సౌండ్ పెట్టుకుని పాటలు వినడం, వీడియోలు చూడటం చేయవద్దు.
గంటల తరబడి ఇయర్‌ఫోన్స్ వాడొద్దు
వాల్యూమ్ తక్కువగా పెట్టుకున్నా గంటల తరబడి ఇయర్‌ఫోన్స్ చెవుల్లో పెట్టుకుని వాడటం మంచిది కాదు. చెవులకు కూడా విశ్రాంతి అవసరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) 'సేఫ్ లిజనింగ్' మార్గదర్శకాల ప్రకారం… ఇయర్‌ఫోన్స్ వాడే సమయాన్ని, వాల్యూమ్‌ను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం.
నాయిస్-క్యాన్సిలింగ్ ఇయర్‌ఫోన్స్ వాడొచ్చు
బస్సు, రైలు, రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఉన్నప్పుడు బయటి శబ్దం వల్ల సరిగా వినిపించదని చాలామంది వాల్యూమ్ పెంచేస్తుంటారు. దీనికి బదులుగా బయటి శబ్దాలను తగ్గించే నాయిస్-క్యాన్సిలింగ్ (Noise-cancelling) లేదా చెవికి సరిగ్గా సరిపోయే హెడ్‌ఫోన్స్ వాడటం మంచిది. దీనివల్ల ఎక్కువ వాల్యూమ్ పెట్టాల్సిన అవసరం ఉండదు.
చెవిలో లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు
ఇయర్‌ఫోన్స్ వాడిన తర్వాత చెవిలో 'గీ...'మని శబ్దం రావడం, చెవులు మూసుకుపోయినట్లు అనిపించడం, ఇతరులు మాట్లాడేది సరిగా వినలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే తేలిగ్గా తీసుకోవద్దు. ఈ లక్షణాలు పదేపదే వస్తుంటే, వెంటనే ఇయర్‌ఫోన్స్ వాడకం తగ్గించి, ENT డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. అలాగే ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే మీ ఇయర్‌ఫోన్స్‌ను ఇతరులతో పంచుకోవద్దు. WHO ప్రకారం… ఎక్కువ సౌండ్‌తో ఎక్కువసేపు ఇయర్‌ఫోన్స్ వాడితే వినికిడి శక్తి శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉంది.

