Motivational Story: నిజమైన బలవంతుడు ఎవరు..? మీ ఆలోచనను మార్చే కథ ఇది..!
Motivational Story: మనలో చాలా మంది తమలోని అసలైన సామర్థ్యాన్ని, బలాన్ని గుర్తించకుండా ఇతరులను చూసి తమను తాము తక్కువ చేసుకుంటూ ఉంటారు. ఎదుటి వ్యక్తే గొప్పవాడని, తమలో ఆ టాలెంట్ లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ, నిజమైన బలవంతుడు ఎవరు?

బలవంతుడు వేటలో చిన్న పాము పిల్ల..
ఒక చిన్న పాము పిల్లల తన కుటుంబంతో కలిసి.. చెట్టు కింద పుట్టలో నివసిస్తూ ఉంటుంది. ఆ చిన్న పాము బుర్రలో ఎప్పటి నుంచో ఓ ప్రశ్న ఉంది. ఈ ప్రపంచంలో అత్యంత బలవంతుడు ఎవరు అనే అనుమానం ఉంది. ఇదే ప్రశ్నను వెళ్లి వాళ్ల అమ్మని అడిగింది. "అమ్మా! ఈ విశాల ప్రపంచంలో అత్యంత బలవంతుడు ఎవరు?" అని అమాయకంగా అడిగింది.
దానికి ఆ తల్లి పాము నవ్వి.. "ఇంకెవరురా.. మీ నాన్నే! నీకు నమ్మకం లేకపోతే, నాన్న వేటకు వెళ్లేటప్పుడు వెనకే వెళ్లి చూడు.. నీకే అర్థమవుతుంది" అని చెప్పింది. తల్లి మాటలు నిజమో కాదో తెలుసుకోవడానికి, తర్వాతి రోజు ఆ చిన్న పాము తన తండ్రికి తెలియకుండా ఆయన వెంటే బయలుదేరింది.
తల్లి చెప్పిందే నిజమైందా?
కానీ, దారిలో ఒక ముంగిసను చూడగానే తండ్రి పాము భయపడి పక్కకు తప్పుకోవడం ఆ చిన్న పాము చూసింది. "ఓహో.. నాన్న కంటే ఈ ముంగిసే చాలా బలమైనది అన్నమాట" అని అనుకుంటూ, ఆ రోజు నుండి ముంగిసను అనుసరించడం మొదలుపెట్టింది. కొద్దిరోజుల తర్వాత, ఆ ముంగిస ఒక కుక్కను చూసి భయంతో పరుగులు తీసింది. దాంతో పాము పిల్ల ఆలోచన మారింది. "అబ్బే.. ముంగిస కంటే ఈ కుక్కే అత్యంత బలమైనది" అని ఫిక్స్ అయి, కుక్క వెనకాలే వెళ్లడం ప్రారంభించింది. ఒక రోజు ఒక చిన్న పిల్లాడు రాయి పట్టుకుని ఆ కుక్కను భయపెట్టి తరిమేశాడు. "అమ్మో! ఈ చిన్న పిల్లాడే అసలైన ధైర్యవంతుడు, బలవంతుడు" అని పాము పిల్ల ఆ పిల్లాడినే గమనించడం మొదలుపెట్టింది. అయితే, ఒక రోజు ఆ పిల్లాడి దగ్గరకు వాళ్ల నాన్న వచ్చి.. "స్కూల్ టైమ్ అవుతుంటే ఇక్కడేం చేస్తున్నావ్?" అని గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి పిల్లాడు భయంతో వణికిపోయాడు.
ఇదంతా చూస్తున్న పాము పిల్ల.. "చివరకు దొరికాడు! ఈ ప్రపంచంలో అందరికంటే అత్యంత బలవంతుడు ఈ ఆయనే! ఇకపై ఈయన వెంటే ఉండాలి" అని అనుకుంటూ ఆ వ్యక్తి ముందుకు వెళ్లి నిలబడింది. తీరా చూస్తే.. ఆ వ్యక్తి పాము పిల్లను చూడగానే భయంతో గజగజా వణికిపోతూ కేకలు వేసి వెనక్కి పరిగెత్తాడు. ఆ దృశ్యం చూసి ఆ చిన్న పాము ఆశ్చర్యపోయింది. "ఏంటి? వీళ్లందరి కంటే చివరకు నేనే బలవంతుడినా?" అని తీవ్రంగా ఆలోచనలో పడింది.
ఈ కథ వెనక అర్థం ఏంటి?
మన బలం మనకే తెలియదు: లోకంలో ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక భయం ఉంటుంది. బయట చూసే ప్రతిబింబాలను చూసి ఇతరులను గొప్పగా, మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోకండి. ఆ చిన్న పాము అందరినీ చూసి గొప్పది అనుకుంది కానీ, తనలో ఉన్న శక్తిని గ్రహించలేకపోయింది. మనం కూడా మనలోని ప్రతిభను, శక్తిని గుర్తించనంత వరకు ఇతరులను చూసి భయపడుతూనే ఉంటాం.
ఎవరి ప్రత్యేకత వారిదే: ఈ ప్రపంచంలో ఎవరూ సంపూర్ణంగా బలవంతులు కారు, అలా అని బలహీనులు కారు. మీలోని ఆత్మవిశ్వాసాన్ని నిద్రలేపితే.. మీరే అత్యంత బలవంతులు.

