జీవితంలో ఎంత కష్టమైనా రానీ.. ఒక్కసారి ఈ పాట వింటే మీ ఆలోచన మారడం ఖాయం
Motivational Song: కొన్నిపాటలు కేవలం మనసుకు ఉల్లాసాన్ని కలిగించడమే కాకుండా మన ఆలోచన విధానాన్ని మార్చేస్తాయి. అవమానాలు వచ్చినా వాటిని అడ్డంకులుగా కాకుండా విజయానికి మెట్లుగా భావించాలనే సందేశాన్ని చాటో ఓ పాట గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

“రాజు నువ్వే.. సైన్యం నువ్వే”.. జీవితానికి మనమే నాయకులు
“ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన.. రాజు నువ్వే బంటు నువ్వే.. మంత్రి నువ్వే సైన్యం నువ్వే” అనే పల్లవి పాటలోని ప్రధాన భావాన్ని చెబుతుంది. మన జీవితం అనే రాజ్యానికి మనమే రాజు. మన నిర్ణయాలు, మన కష్టాలు, మన ప్రయాణం అన్నింటికీ మనమే బాధ్యత వహించాలి. ఇతరులు ఏమనుకుంటున్నారు? మన గురించి ఏం మాట్లాడుతున్నారు? అనే ఆలోచనల్లోనే ఉండిపోతే ముందుకు వెళ్లలేం. మన లక్ష్యం ఏంటో తెలుసుకుని దాని కోసం మనమే పోరాడాలి. అవసరమైన ధైర్యాన్ని కూడా మనలోనే వెతుక్కోవాలి. అందుకే రాజు, మంత్రి, సైన్యం అన్నీ నువ్వే అని పాట చెబుతుంది. అలాగే “పలకా నువ్వే.. బలపం నువ్వే.. ప్రశ్న నువ్వే.. బదులు నువ్వే” అనే పదాలు కూడా చాలా లోతైన అర్థాన్ని ఇస్తాయి. జీవితంలో ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానాలను మనమే వెతుక్కోవాలి. మన భవిష్యత్తును తీర్చిదిద్దే సాధనాలు కూడా మన చేతుల్లోనే ఉన్నాయనే ఆత్మవిశ్వాసాన్ని ఈ లైన్స్ కలిగిస్తాయి.
అవమానాలు వచ్చినా ఆగొద్దు.. వాటినే బలంగా మార్చుకో
జీవితంలో ప్రతి ఒక్కరికీ విమర్శలు, అవమానాలు, అనుమానాలు ఎదురవుతాయి. అయితే వాటికి భయపడి వెనక్కి తగ్గకుండా వాటినే మన విజయానికి ఉపయోగించుకోవాలని పాట చెబుతుంది. “అవమానాలే ఆభరణాలు.. అనుమానాలే అనుకూలాలు.. సందేహాలే సందేశాలు.. ఛీత్కారాలే సత్కారాలు” అనే పంక్తులు ఇదే విషయాన్ని చెబుతాయి. మనల్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే నిరాశ చెందకుండా.. ఆ మాటలనే మనకు ప్రేరణగా మార్చుకోవాలి. ఇతరులు మనపై పెట్టుకున్న అనుమానాలు కూడా మన సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశాలుగా మారవచ్చు. మనల్ని విమర్శించిన వాళ్లకు సమాధానం మాటలతో కాకుండా మన విజయంతో చెప్పాలనే భావన ఇందులో కనిపిస్తుంది.
ముళ్ల దారిలో నడిచినా.. కలల ప్రపంచాన్ని చేరుకోవాలి
విజయానికి వెళ్లే దారి ఎప్పుడూ సులభంగా ఉండదు. ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు ఎదురవుతాయి. అయినా లక్ష్యాన్ని చేరుకోవాలనే పట్టుదల ఉంటే ఆ కష్టాలను దాటవచ్చని పాట చెబుతుంది. “అడుగేయాలి.. ముళ్ల మార్గాన్ని అన్వేషించాలి” అంటూ కష్టమైన దారిలో కూడా ముందుకు సాగాలని సూచిస్తుంది. అలసట వచ్చినా కలలను వదిలిపెట్టకూడదు. కష్టపడుతూ చివరకు మనం కోరుకున్న విజయాన్ని అందుకోవాలి.
“ఒక ఉదయం ముందర చీకట్లు.. విజయం ముందర ఇక్కట్లు రావడమన్నది మామూలు” ఈ లైన్ ఎంతో గొప్ప సందేశాన్ని చాటుతుంది. ఉదయం రావడానికి ముందు చీకటి తప్పదు. అలాగే విజయం సాధించడానికి ముందు కష్టాలు ఎదురుకావడం సహజమే. కాబట్టి సమస్యలు వచ్చాయని లక్ష్యాన్ని వదిలేయకూడదనేది ఈ పాట ఇచ్చే సందేశం.
నారు నుంచి పైరు వరకు.. ప్రతి దశలో కష్టమే విజయానికి పునాది
పాటలోని “నారు నువ్వే.. నీరు నువ్వే.. కోతా నీకే.. పైరూ నీకే” అనే పంక్తులు రైతు జీవితాన్ని ఉదాహరణగా తీసుకుని విజయ సూత్రాన్ని చెబుతాయి. విత్తనం వేసిన వెంటనే పంట చేతికి రాదు. నాట్లు వేయాలి, నీరు పెట్టాలి, పంటను కాపాడాలి. చివరకు కష్టపడిన తర్వాతే కోత వస్తుంది. మన జీవితంలో కూడా అంతే. లక్ష్యాన్ని నిర్ణయించుకోవడం మొదటి అడుగు మాత్రమే. దాన్ని సాధించడానికి నిరంతరం శ్రమించాలి. మధ్యలో ఎదురయ్యే ఇబ్బందులను తట్టుకోవాలి. అప్పుడు మాత్రమే ఫలితం దక్కుతుంది. “నింగిలోన తెల్లమేఘం.. నల్లబడితేనే జల్లులు కురిసేను.. చెట్టుపైనా పూలు మొత్తం.. రాలిపోతేనే పిందెలు కాసేను” అనే ఉదాహరణలు కూడా ఇదే విషయాన్ని చెబుతాయి. మార్పు, కష్టం, నష్టం అనిపించే పరిస్థితుల వెనుక కూడా కొత్త అవకాశాలు ఉండవచ్చని పాట గుర్తు చేస్తుంది.
ఇంతకీ పాట రాసింది ఎవరంటే.?
ఈ పాట 2001లో వచ్చిన “బడ్జెట్ పద్మనాభం” సినిమాలోనిది. ఈ చిత్రానికి ఎస్.వి. కృష్ణారెడ్డి దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్‌ప్లే, సంగీత బాధ్యతలు కూడా చేపట్టారు. ఈ సినిమాలో జగపతిబాబు, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. చిత్రాన్ని గ్రాండి నారాయణరావు (బాబ్జీ) నిర్మించారు. కథ జి. అరుణాచలం అందించగా, సంభాషణలు దివాకర్ బాబు రాశారు. “ఎవరేమి అనుకున్నా” పాటను ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ రచించారు. ఈ పాటకు సంగీతాన్ని ఎస్.వి. కృష్ణారెడ్డి అందించగా, గానగంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు.

