Andhra pradesh: పేదలకు పట్టాభిషేకం.. 28,445 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ
Andhra pradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించిన ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమంలో 28,445 కుటుంబాలకు ఆస్తి హక్కు పత్రాలను అందజేశారు.

399 ఎకరాల భూముల క్రమబద్ధీకరణ..
విశాఖపట్నంలోని పలు ప్రాంతాల్లో చాలాకాలంగా నివాసం ఉంటున్న పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలపై హక్కులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 11 మండలాల పరిధిలోని 399 ఎకరాల భూములను క్రమబద్ధీకరించింది. మొత్తం 19,33,853 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న నివాస భూములకు సంబంధించి లబ్ధిదారులకు హక్కులు కల్పించింది.
సుమారు రూ.8,874 కోట్ల మార్కెట్ విలువ కలిగిన ఈ భూములపై 28,445 కుటుంబాలకు యాజమాన్య హక్కులు లభించాయి. అభ్యంతరాలు లేని భూముల్లో నివసిస్తున్న వారికి పట్టాలు అందించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. విశాఖపట్నంలో ఇంత పెద్ద మొత్తంలో భూములను క్రమబద్ధీకరించి, పూర్తి హక్కులతో పట్టాలు అందించడం ఇదే తొలిసారి అని ఆయన పేర్కొన్నారు.
ఇళ్లపై హక్కులు లభించడంతో లబ్ధిదారులు తమ నివాసాలను భవిష్యత్తులో ఆర్థిక అవసరాలకు కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. పట్టాలు పొందిన వారు తమ ఆస్తులపై బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవచ్చని సీఎం తెలిపారు.
ఆరు నియోజకవర్గాల్లో 28,445 కుటుంబాలకు ప్రయోజనం
విశాఖపట్నంలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టారు. లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా సభా ప్రాంగణంలో నియోజకవర్గాలు, మండలాలు, వార్డుల వారీగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి పత్రాల పంపిణీ ప్రక్రియను నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా లబ్ధిదారుల విషయానికొస్తే.. విశాఖ తూర్పులో 6,555 కుటుంబాలు, విశాఖ పశ్చిమలో 5,093 కుటుంబాలు, విశాఖ ఉత్తరంలో 2,601 కుటుంబాలు, పెందుర్తిలో 2,851 కుటుంబాలు, గాజువాకలో 6,134 కుటుంబాలు, భీమిలిలో 5,211 కుటుంబాలకు లబ్ధి జరిగింది.
మండలాల వారీగా చూస్తే విశాఖపట్నం రూరల్‌లో అత్యధికంగా 9,261 కుటుంబాలకు ప్రయోజనం చేకూరింది. మిగిలిన ప్రాంతాల్లో ములగాడలో 4,213, గాజువాకలో 4,353, గోపాలపట్నంలో 3,253, పెందుర్తిలో 2,722, పెదగంట్యాడలో 1,910 కుటుంబాలకు హక్కులు లభించాయి. అలాగే మహారాణిపేటలో 1,235, సీతమ్మధారలో 668, భీమిలిలో 464, ఆనందపురంలో 349, పద్మనాభం మండలంలో 17 కుటుంబాలకు ఇళ్ల స్థలాల పట్టాలు అందించారు.
దశాబ్దాల నిరీక్షణకు ముగింపు.. లబ్ధిదారుల్లో ఆనందం
ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముందు నుంచే విశాఖలోని పలు కాలనీల్లో సందడి నెలకొంది. కూటమి పార్టీలకు చెందిన నాయకులు లబ్ధిదారులను కార్యక్రమానికి ఆహ్వానించారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు స్థానికంగా ప్రజలను కలిసి పట్టాల పంపిణీ గురించి వివరించారు. దాదాపు 35 నుంచి 40 ఏళ్లుగా తాము నివాసం ఉంటున్న ఇళ్లపై ఇప్పుడు శాశ్వత హక్కులు లభించడంతో పలువురు లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు తమ నివాసాలపై హక్కుల విషయంలో నెలకొన్న అనిశ్చితి తొలగిందని తెలిపారు. పట్టాలు రావడంతో తమ ఆస్తులకు విలువ పెరిగిందని, భవిష్యత్తుపై భరోసా ఏర్పడిందని ఆనందం వ్యక్తం చేశారు.
పేదలకు శాశ్వత చిరునామా.. విశాఖ అభివృద్ధిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. పేదలకు సొంత ఇల్లు ఉండాలన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. లబ్ధిదారుల ముఖాల్లో ఆనందం చూడటం తనకు సంతోషాన్ని కలిగించిందని, ఈ కార్యక్రమంతో తన జీవితం ధన్యమైందని పేర్కొన్నారు. 11 మండలాలకు చెందిన 28,445 కుటుంబాలకు హక్కులు కల్పించామని, దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న సమస్యలకు పరిష్కారం చూపే దిశగా ముందుకెళ్తున్నామని తెలిపారు. ఇంకా 35 కాలనీల్లో సుమారు 10 వేల మంది పట్టాల కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. సింహాచలం దేవస్థానానికి చెందిన పంచగ్రామాల్లో 12,149 మందికి పట్టాలు ఇవ్వాల్సి ఉందని వెల్లడించారు. మిగిలిన అర్హులైన వారికి కూడా త్వరగా పట్టాలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పేదలకు శాశ్వత చిరునామా కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖపట్నం భవిష్యత్తు అభివృద్ధిపై కూడా ఆయన మాట్లాడారు. నగరం త్వరలో విశ్వనగరంగా ఎదుగుతుందని, అల్లూరి విమానాశ్రయం రాకతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని తెలిపారు. విశాఖను పర్యాటక, లాజిస్టిక్స్ రంగాలకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. పోలవరం ఎడమ కాలువను త్వరలో విశాఖకు తీసుకురానున్నట్లు వెల్లడించారు. నగర అభివృద్ధితో పాటు పేద కుటుంబాలకు ఆస్తి హక్కులు కల్పించడం ద్వారా వారి జీవన భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం వివరించారు.

