సారాంశం

 

  • సినిమా : ‘PSV గరుడవేగ
  • నటీనటులు : రాజశేఖర్, పూజాకుమార్, కిషోర్, శ్రద్ధాదాస్, నాజర్ తదితరులు
  • దర్శకుడు : ప్రవీణ్ సత్తారు
  • నిర్మాత : ఎం. కోటేశ్వర రాజు, మురళీ శ్రీనివాస్
  • సినిమాటోగ్రఫి : అంజి
  • సంగీతం : శ్రీచరణ్ పాకాల, భీమ్స్
  • ఏసియానెట్ రేటింగ్ : 3/5

 

టాలీవుడ్‌లో యాంగ్రీ యంగ్‌మెన్‌గా పేరు సొంతం చేసుకున్న డా. రాజశేఖర్ దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తర్వాత మళ్లీ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘PSV గరుడవేగ’. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రాజశేఖర్, పూజాకుమార్, కిషోర్, నాజర్, శ్రద్ధాదాస్, అదిత్ అరుణ్ ప్రధాన పాత్రలలో నటించారు. సన్నీలియోన్ స్పెషల్ ఐటెం సాంగ్‌లో నటించింది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా రాజశేఖర్‌కు తిరిగి లైఫ్ ఇచ్చిందా..

కథ:

ఎలాంటి కేసునైనా డీల్ చేయగలిగే ఆఫీసర్ శేఖర్. NIA ఆఫీసర్‌ పాత్రలో రాజశేఖర్ నటించాడు. NIA హెడ్ నాజర్ ఓ డ్రగ్స్ మాఫియా వ్యక్తి కేసును శేఖర్‌కు అప్పగిస్తాడు. ఈ కేసును తన టీంతో కలిసి పూర్తిచేసే లోపు మరో కొత్త మలుపు మొదలవుతుంది. వీటన్నిటికి నిరంజన్‌కు సంబంధం వుందని తెలిసి అతడిని పట్టుకుంటాడు శేఖర్. కానీ నిరంజన్‌కు వాళ్లందరికి ఏంటి సంబంధం? నిరంజన్‌ను వాళ్లు ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఈ కేసులో శేఖర్ ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? చివరకు ఏం జరిగింది అనేదే సినిమా కథాంశం.

నటీనటులు, సాంకేతిక నిపుణులు:

‘PSV గరుడవేగ’ సినిమాలో నటించిన ప్రధాన తారగణమంతా కూడా వారి వారి పాత్రలలో బాగా చేసారు. అయితే సినిమా నటీనటుల విషయం కాసేపు పక్కనపెడితే.. దర్శకుడు ప్రవీణ్ సత్తారు మాత్రం తాను తీసే ప్రతి సినిమాలో కూడా నాలుగైదు ప్రధాన కథల చుట్టూ సినిమా తిరిగే విధంగా డిజైన్ చేస్తాడేమో అని అనిపిస్తుంది. గతంలో ప్రవీణ్ తీసిన ‘చందమామ కథలు’, ‘గుంటూర్ టాకీస్’ సినిమాలో కూడా ప్రధాన తారాగణం చాలా ఎక్కువే. ఇపుడు ఈ ‘PSV గరుడవేగ’లో కూడా ప్రధాన తారాగణం బాగానే వుండి ఎక్కువ ఎలిమెంట్స్‌తో థియేటర్‌కు ప్రేక్షకులను రప్పించే ప్రయత్నం చేసాడు.

ఇక శేఖర్ పాత్రలో యాంగ్రీ యంగ్‌మెన్ రాజశేఖర్ మరోసారి తన పవర్ చూపించాడు. రాజశేఖర్ టైం అయిపోయింది అని కామెంట్లు చేసినవాళ్లందరికీ కూడా తన నటనతో సమాధానమిచ్చాడు. లుక్స్ పరంగా కూడా చాలా బాగున్నాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్లలో రాజశేఖర్ అదరగొట్టాడు. తన పాత్ర మేరకు రాజశేఖర్ మంచి నటన కనబరిచాడు. ఇక సినిమా అంతా కూడా నిరంజన్ పాత్ర గురించే తిరుగుతుంది. నిరంజన్ పాత్రలో అదిత్ అరుణ్ బాగా చేసాడు. తన ఏజ్‌కు తగ్గట్లుగా చాలా చలాకీగా చేసాడు. ఇక రాజశేఖర్ భార్య స్వాతి పాత్రలో పూజా కుమార్ బాగా చేసింది. రాజశేఖర్-పూజాల జోడి బాగుంది. వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. హోమ్లీ లుక్‌తో చీరకట్టులో పూజా కుమార్ బాగా చేసింది. శేఖర్ టీం మేట్స్‌గా చేసిన చరణ్ దీప్, రవివర్మలు బాగా చేసారు. పోసానీ కృష్ణమురళి మరోసారి తనదైన శైలిలో నటించాడు.

జార్జ్ పాత్రలో నటించిన కిషోర్ నటన బాగుంది. నాజర్, పృధ్వీరాజ్, ఆలీ, అవసరాల శ్రీనివాస్ తదితరులు వారి వారి పాత్రల మేరకు బాగా చేసారు. ఇక స్పెషల్ ఐటెం సాంగ్‌లో నటించిన సన్నీలియోన్ ‘డియ్యో డియ్యో…’ అంటూ తన గ్లామర్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ పాటలో వున్న జోరు విజువల్స్ పరంగా అంతగా కనిపించలేదనిపించింది.

విశ్లేషణ:

ఇక సినిమా విషయానికొస్తే… సినిమా ప్రారంభం నుంచే సెకండ్ హాఫ్ ప్రారంభమైన 20నిమిషాల వరకు అసలు ఎందుకు ఈ ఆపరేషన్ జరుగుతుందో అనే విషయంపై క్లారిటీ రాదు. నిరంజన్ అనే వ్యక్తిని చంపడానికి గల కారణం సెకండ్ హాఫ్‌లో సన్నీలియోన్ పాట ముందు శేఖర్‌తో పాటు చూసే జనాలకు కూడా అప్పుడే తెలుస్తుంది. కానీ సెకండ్ హాఫ్ వరకు కూడా జనాలను తన స్క్రీన్‌ప్లే దర్శకుడు ప్రవీణ్ సత్తారు బాగానే కుర్చుండబెట్టే ప్రయత్నం చేసాడు. కథలో చాలా మలుపులు, ట్విస్టులు వున్నాయి. వాటిని సరైన విధంగా వాడుకొని ప్రేక్షకులకు ఒక థ్రిల్లింగ్ మూవీని అందజేసారు. ఈ సినిమా రాజశేఖర్‌కు మళ్లీ భారీ హిట్టును తీసుకొచ్చే చిత్రమని చెప్పుకోవచ్చు. సినిమాటోగ్రఫి అదిరిపోయింది. ముఖ్యంగా జార్జియాలో తీసిన సీన్స్ బాగున్నాయి. విజువల్స్ పరంగా సినిమాను బాగా చూపించారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. సినిమా ఎమోషన్‌ను బాగా ఎలివేట్ చేసింది. కానీ సినిమా మొత్తంగా చూస్తే కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. మరో 20నిమిషాలు ఎడిటింగ్ చేసి వుంటే సినిమా వేగం పెరిగి, మరింత అద్భుతంగా వచ్చుండేది. చివర్లో క్లైమాక్స్ కాస్త కన్విన్స్‌గానే అనిపించే విధంగా డైరెక్టర్ బాగానే ప్లాన్ చేసారు. డైలాగ్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా విజువల్స్ పరంగా బాగా చూపించారు.

చివరగా…

‘గరుడవేగ’ సినిమా యాంగ్రీ యంగ్‌మెన్‌కు మళ్లీ కం బ్యాక్ ఫిలింగా చెప్పుకోవచ్చు.