-జాన్‌సన్ చోరగుడి

పాత్రలు మారాయిగానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ఆంతరంగిక బృందం ఇప్పుడు దావోస్ లో జరుగుతున్న ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరం’ వద్ద బిజీ బిజీగా ఉండాలి. కానీ అందుకు పూర్తిగా భిన్నమైన దృశ్యం 2020 మొదట్లో చూస్తున్నాం . గత ఐదేళ్లుగా స్విట్జర్లాండ్ లో ఇది జరగడం మనకు తెలిసిందే. కానీ మొదటినుంచి తెలియంది, ఏదోవొక రోజు ఇప్పుడు అందరం చూస్తున్నట్టు ఇలా కాళ్ళు నేల మీద అన్చవల్సి వస్తుందని. ఆ కుంగుబాటు కూడా రాజధాని పేరుతో, పరిమితమైన రెండు మండలాల్లోని పాతిక గ్రామాల కోసం! ఎక్కణ్ణించి ఎక్కడికి? ‘యాటిట్యూడ్ ఈజ్ ఎవ్విరితింగ్’ - దృక్పధమే సమస్తము... అనేది చాలా పురాతనమైన నానుడి. ‘నువ్వు ఏది విత్తుతావో దాన్నే కోస్తావు’ అనేది బైబిల్ సూక్తి. పాలకులకు ‘స్టేట్స్ మెన్’ లక్షణాలు తగ్గిపోవడం స్వాతంత్ర్యం వచ్చిన మొదటి దశాబ్దం నాటికే మనవద్ద మొదలైంది. అయితే, అస్సలు ఏ మాత్రం సరుకు లేనివాళ్ళు కూడా ‘దేవుళ్ళు’ అన్నట్టుగా; మనమే వాళ్ళ తలల వెనుక ఊదా రంగు కాంతి వలయాల చక్రాలు పెట్టడంమాత్రం, (బహుశా) ఆర్ధిక సంస్కరణల తర్వాతి కాలంలో మొదలయింది. అందుకు, వాళ్ళు కూడా మనల్ని అభ్యంతర పెట్టరు కనుక, మనమూ యధేచ్చగా అదే పనిలో ఉంటాము. అందుకు మన కారణాలు మనకుంటాయి.

 

( దావోస్‌లో ఏపీ పెవిలియన్‌లో నాటి సీఎం చంద్రబాబు )

లాలూప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా పనిచేస్తున్న రోజుల్లో 2006 ఆగస్టులో ‘మేనేజ్మెంట్ స్కిల్స్’ గురించి ఐ.ఐ.ఎమ్.ల్లో ప్రసంగాలు చేయడం ఇటువంటిదే. వెతికితే ఇటువంటి నమూనాలు మనకు కనిపిస్తాయి. అయితే ‘రియాల్టీ’ అందుకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. హైదరాబాద్ నుంచి బై రోడ్ నాలుగున్నర గంటలు ప్రయాణం చేసి జగ్గయ్యపేట చేరితేగాని, నువ్వు సి.ఎం. అయిన ‘ఆంధ్రప్రదేశ్’ సరిహద్దులు మొదలుకావు అనే స్పృహ; గడచిన ఐదేళ్ళు ఇక్కడ అధికారంలో ఉన్నవారికి అర్ధం కాకపోవడం, వాటిలో వొకటి! ప్రధానంగా అది ‘యాటిట్యూడ్’ సమస్య.

ఐదేళ్ళ తర్వాత ఇప్పుడు ఏమైంది? దావోస్ లో పక్క రాష్ట్రం మంత్రి కె.టి.ఆర్. పొటోలు పత్రికల్లో కనిపిస్తుంటే, మనం మందడం గ్రామస్థులతో ఉన్న పొటోలకు పరిమితం కావలిసివచ్చింది. జీవితాల్లో ఇటువంటి అధివాస్తవికతకు వైరుధ్యానికి కారణమయ్యే వాటి మూలాలు రాజకీయాల్లో ఉండేవారికి అట్టే తెలియవుగాని, ఏపార్టీ లేకుండా బయట ఉండి చూసేవారికి; ఇవన్నీ రొటీన్ కు భిన్నంగా ఉంటూ చాలా స్పష్టంగా దగ్గరగా కనిపిస్తాయి. వొక విహంగ వీక్షణంగా దీన్ని చూస్తునప్పుడు, ఇప్పుడు వీళ్ళు చట్టసభల్లో ఉన్నంత మాత్రాన అంతా వీరితోనే అంతా అయిపోతుందనేమీ కాదని; ఇంతకు ముందు అక్కడ మంత్రులు స్పీకర్లు ఎమెల్యేలు ఎమెల్సీలుగా ఉన్నవాళ్ళు, ఇప్పుడు ఇళ్ళల్లో కూర్చుని టి.వి.లు చూస్తూ ఉంటారని, ముందుగా మనం గుర్తుచేసుకోవాలి. అప్పుడు, మన కాళ్ళకు నేల తగులుతుంది.

ఈ రోజు సభలో ఉన్నవారికి, రేపు డ్రాయింగ్ రూమ్ లో కూర్చుని టి.వి. చూసే ‘టర్న్’ రావొచ్చు. అదేమీ పెద్ద విశేషం కాదు. అయితే ఈ ఐదు...పది...పదిహేను...ఏళ్ళ మధ్య కాలంలో జరుగుతున్నది ఏమిటి... ఏ దశ నుంచి మనం ఏ దశకు చేరాం అనేది ఇక్కడ కీలకం. వాటిని బయట నుండి చూసేవారికి ‘రికార్డ్’ చేసేంత స్థాయిలో, పూర్తిగా భిన్న పరిణామాలుగా అవి కనిపిస్తూ ఉంటాయి. రెండు ప్రభుత్వాల మధ్య లేదా రెండు కాలాల మధ్య జరిగే ఇటువంటి ప్రాధామ్యాల ‘షిఫ్ట్’ ల్లో దేశీయంగా గానీ, లేదా మన ఆసియా రీజియన్ లో గానీ, లేక అంతర్జాతీయంగా జరిగే పలు (ఊహించని) ఇతర పరిణామాల ప్రభావం గానీ వీటికి అదనం. ఇటీవల ఎక్కువసార్లు అవి మనల్ని పెనం మీది నుంచి పొయ్యిలోకి నెట్టడం తెలిసిందే. అర్దికమాద్యం రూపంలో 2008లో నాటి ముఖ్యమంత్రి డా. రాజశేఖర రెడ్డికి ఎదురైంది అదే. అందుకే 2009 ఎన్నికల తర్వాత ఆయన ‘రచ్చబండ’ పేరుతో (పాస్ ఏంటి...పస్ట్ క్లాస్ ఎందుకు రాలేదు అంటూ...) జిల్లాలకు ‘ఇన్వెంటరీ’ కి బయలుదేరారు.

 

( 2009లో రచ్చబండకు బయల్దేరేముందు హెలికాఫ్టర్‌లో సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి)

చూడగలిగితే, ఇప్పటి ‘లిటిల్ ఏ.పి.’ వర్తమాన పరిణామాల్లో కనిపిస్తున్న- ‘ప్రతీకాత్మకత’ (సింబాలిజం) మనం కనుక ఆకళింపు చేసుకోగలిగితే అదొక ఆసక్తికరమైన అంశం. ఎన్నికలు అనంతరం ప్రభుత్వం మారాక జరిగిన మొదటి కలక్టర్ల సమావేశం ముగిసిన వెంటనే, అది జరిగిన ఆ సమావేశమందిరం (ప్రజా వేదిక) కూల్చివేయడంతో కొత్త ప్రభుత్వ ‘ప్రతీకాత్మక’ వ్యక్తీకరణ మొదలయింది. అంతకు ముందురోజు అందులో కూర్చున్న ఐ.ఏ.ఎస్. , ఐ.పి.ఎస్ లకు భవిష్యత్తు గురించి వొక నిశబ్ద సందేశాన్ని; జగన్ ప్రభుత్వం మొదటి నెలలోనే వారికి అందించింది. అది చూసి ఆతర్వాత కొందరు అమాయకంగా అడిగారు, మరి మిగతావి ఎప్పుడు కూల్చేది? అని. అది ’కామా’ కాదు, ‘ఫుల్ స్టాప్’. అయిపోయింది, ఇంకేముంది కూల్చడానికి? గమనిస్తే, భవిష్యత్తు సూచికి అదొక తొలివ్యక్తీకరణ. నిజానికి అలా అడిగేవాళ్లకు రావాల్సిన సందేహం కూల్చడం సరే, మరి నువ్వు కట్టబోయేది ఏమిటి? అని...దానికి జవాబు ఇంకా మనం వెతకాల్సి ఉంది.

 

( ఉండవల్లి కరకట్టపై ప్రజావేదిక కూల్చివేత దృశ్యం )

ఇప్పటికైతే కట్టబోతున్నది ‘నమ్మకం’ అనిపిస్తున్నది. ప్రభుత్వం ఏర్పడ్డ మూడవ నెలలో ఆగస్టులో కేంద్ర విదేశీ వ్యవహరాల మంత్రిత్వశాఖ విజయవాడలో సుమారు 35 దేశాల రాయబార కార్యాలయాల ప్రతినిధులతో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై ‘డిప్లమాట్ అవుట్ రీచ్ సమ్మిట్’ జరిపింది. వెతుకులాట దావోస్ లోనూ విశాఖ సి.ఐ.ఐ. సమ్మిట్ లోనూ కాదు, ఈ ప్రభుత్వం ఇక్కడే తన కాళ్ళు నేలకు ఆనించే ప్రయత్నం మొదలుపెట్టింది. ఇందుకు సంబంధించిన వార్తలు మునుపటిలా ఇప్పుడు బయటకు రావడం లేదుగానీ, ఏదో ఒక దేశ ప్రతినిధి బృందం రాష్ట్రానికి వచ్చి ముఖ్యమంత్రిని కలుస్తూనే ఉన్నాయి. జనవరి 22న శాసన మండలి రగడ జరుగుతున్న రోజు కూడా, నెథర్లాండ్ బృందం సి.ఎం. జగన్ మోహనరెడ్డిని కలిసింది. ఇటువంటి చర్చలు అన్నీ ఒక కొలిక్కి వచ్చాక, ఇక ముందు అవి ఆచరణలో వార్తలు కావొచ్చు. అయినా రాష్ట్ర విభజన తర్వాత 2014 జూన్ లో తొలిప్రభుత్వం ఏర్పడ్డాక, మొదలయిన ప్రయాణంలో జరిగిన ‘బై పాస్’లను సరిచేయడం మీద ఈ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆవరసలో ఇప్పటికే ‘రివర్స్ టెండరింగ్’ వంటివి కొన్ని సత్ఫలితాలు ఇచ్చాయి.

( విజయవాడలో భారత విదేశాంగ శాఖ నిర్వహించిన పెట్టుబడుల సదస్సు ప్రారంభిస్తున్న సీఎం జగన్)

వీటిలో కీలకమైంది భారత ప్రభుత్వం నియమించిన, నిర్లక్ష్యానికి గురైన శివరామ కృష్ణన్ కమిటీ నివేదికను వెలుగులోకి తీసుకొచ్చి దాన్ని అమల్లోకి తీసుకురావడం. ఇన్నాళ్ళు దాన్ని విస్మరించి రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసిన చర్యలకు ఎటువంటి చట్టపరమైన హేతుబద్దత లేకపోవడంతో నూతన ప్రభుత్వానికి ఇటువంటి పునసమీక్ష ఇప్పుడు సాధ్యమయింది. మళ్ళీ ఇక్కడా మనకు ‘దేవుడు - పెట్టుడు కిరీటం’ సమస్యే! అనుభవజ్ఞుడు ఆయనకు అన్నీ తెలుసుకదా... ఆయన తప్పు ఎందుకు చేస్తాడు.... చేసింది మళ్ళీ ఇప్పుడు మార్చడం ఎందుకు... ఇలా అయితే ప్రతి ఐదేళ్లకు మారుస్తారా...కక్ష తీర్చుకుంటున్నాడు ... ఇవన్నీ; జరుగుతున్న సంస్కరణల ప్రక్రియను వేర్వేరు స్థాయిల్లో అర్ధం చేసుకుంటున్న వర్గాల్లో వినిపిస్తున్న భిన్నమైన స్పందనలు. మరి వీరికి నిజం చెప్పేది ఎవరు? విషయం – ‘మూడు రాజధానులు’ వద్ద ఆగింది సరే, కానీ అందులో భారత ప్రభుత్వమూ లేదు, హోంశాఖ గానీ అందులోని కేంద్ర-రాష్ట్ర సంబంధాల విభాగం అది నియమించిన కమీషను ఏవీ లేవు.

 

( జనవరి 22న సీఎం జగన్‌ను కలిసిన నెదర్లాండ్ బృందం)

లక్ష్యం విస్త్రుత ప్రజాప్రయోజనం కనుక అయితే, అందుకు ‘ప్రొసీజర్’ ను సడలించి ప్రభుత్వాలు తీసుకునే ‘బై-పాస్’ విషయంలో ఎవరికీ పెద్దగా అభ్యంతరం ఉండనక్కరలేదు. కానీ వొక రాజ్యాంగ పరిధిలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం; ఆయా రంగ నిపుణులతో నియమించిన కమిటీ నివేదికలోని సూర్తి, వెలుగు చూడలేని నిస్సహాయ స్థితికి చేరి ఈ రాష్ట్రం ఇంకా పిండ దశలో ఉన్నప్పుడే, అది - భ్రూణహత్య చేయబడింది. అటువంటి వొక తీవ్ర నిర్లక్ష్యానికి చేపట్టవలసిన చికిత్స; ఇప్పుడు జగన్ మోహనరెడ్డి ప్రభుత్వం రాజధాని విషయంలో చేస్తున్నది. మనం నిర్దేశించుకున్న రాజ్యాంగ పరిధిలోని యూనియన్-ఫెడరల్ చట్రంలో ఇంకా పురిటి దశలో ఉన్న రాష్ట్ర ‘స్థాపన’ ను(ఇన్-స్టాలేషన్) ఇమడ్చడం అనే కసరత్తు ఇప్పుడు ఏ.పి.లో జరుగుతున్నది. అయితే, ‘అకడమిక్స్’ కు మన రాజకీయ పార్టీలు ఏనాడో పాతరేసాయి కనుక, జాతీయ పార్టీలు కూడా ప్రాంతీయ పార్టీలకు ఏ మాత్రం తగ్గకుండా, వొక స్థాయికి మించి మన అవగాహన ఎదగనివ్వకుండా అన్నీ వొకే తాను గుడ్డలుగా మిగిలాయి. ఇటువంటప్పుడు వొకసారి డిల్లీ ‘సెంట్రల్ సెక్రటేరియట్’ ను కనుక మనం గుర్తు చేసుకుంటే, వీళ్ళలో ఎవరు ఉన్నా లేకపోయినా, శాస్వితం అవి కదా అనే ఎరుకతో కొంతైనా ఊరట కలుగుతుంది. 

మన వద్ద సగం నిర్మాణం పూర్తి అయ్యాక, చేయగలిగింది పెద్దగా ఉండకపోవచ్చు. కానీ ఇంకా కాయితాల మీదనే వొక ‘సాఫ్ట్ వేర్’ దశలో ఉన్నదానికి అనువైన ‘హార్డ్ వేర్’ సమకూర్చుకోవడం తేలిక. ఈ మాట అంటున్నది సిమెంట్ కాంక్రీట్ తో కట్టే భవనాలు గురించి కాదు. ఇలా అంటున్నప్పుడు మళ్ళీ ఇక్కడ ‘యాటిట్యూడ్’ కీలకమై మన ముందుకు వస్తున్నది. పార్టీలు పోటీలో నెగ్గి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఉండే ‘గేమ్ రూల్స్’ అందరికీ వొక్కటే కావొచ్చు. కానీ గెలిచిన పార్టీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టాక, దాని ప్రాధాన్యతలు మాత్రమే ప్రభుత్వ ప్రాధాన్యతలై అమలుకోసం అవి అధికార యంత్రాంగం ముందుకు వస్తాయి. అప్పుడు అదే అధికారులు మారిన ప్రభుత్వ ‘ఎజెండా’ను మళ్ళీ నియమ నిబంధనల మేరకు వాటిని అమలు చేస్తారు.

అయితే, 2014లో జరిగింది మునుపటి ఎలక్షన్ల మాదిరిగా కాదు. అది - విభజన తర్వాత చేయవలసిన పరిపాలన. గతంలో మనకున్న పరిపాలనా అనుభవం ఎటువంటిది అయినప్పటికీ, మారిన ‘మ్యాప్’ ను ముందు పెట్టుకునే కదా... వొక కొత్త రాష్ట్రంలో తొలిసారి గద్దె ఎక్కిన ప్రభుత్వం అడుగులు వేయవలిసింది. మరి ఆ దిశలో ఇక్కడ జరిగింది ఏమిటి? గడచిన ఐదేళ్ళ పరిపాలనలో ఎంత శూన్యం ఏర్పడకపోతే (స్పేస్) ఆ ఖాళీ జాగాలోకే ఈ కొత్త ప్రభుత్వం ఇప్పుడు ఇంత దూకుడుగా ముప్పేటలా విస్తరిస్తున్నది? అది కదా ఇప్పుడు ఇక్కడ ఉత్పన్నమవుతున్న కీలకమైన ప్రశ్న. ప్రభుత్వాల్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఏముంది, ప్రజలు-ప్రాంతం కదా మన ప్రాధాన్యత.

( ప్రతిపాదిత అమరావతి రాజధాని నమూనా చిత్రం)

నిజమే ‘యాటిట్యూడ్’ కీలకమే. అయినా వొక ప్రశ్నకు నేరుగా జవాబు కావాలి. అస్సలు ఈ సరి కొత్త ‘మ్యాప్’ రాష్ట్రానికి మీరు చెబుతున్న ప్రిస్క్రిప్షన్ ఏమిటి? మీరది - ‘వర్టికల్’ నమూనా అనుకుంటున్నారా, లేక ‘హారిజాంటల్’ నమూనానా? అది కదా రేపు కట్టబోయే భవనాలతోనూ బడ్జెట్ తోనూ సంబంధం లేకుండా మొదటినుంచి మనకు ఉండాల్సిన స్పష్టత. కేరళలోని కొచ్చి మరుడ టవర్స్ కూల్చివేత చూసాక, సుప్రీం కోర్టు గానీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గానీ రేపు మన ఈ ‘వర్టికల్’ నమూనాను మినహాయిస్తుందా? ఈ ప్రశ్నఉత్పన్నమయ్యాక, మరొకసారి ఇక్కడ ‘ప్రతీక’ తో చెప్పడం తప్పడం లేదు.

( నిబంధనలు అతిక్రమించి నిర్మించడంతో కేరళ కొచ్చిలో కోర్టు ఉత్తర్వులతో కూల్చివేసిన టవర్స్)

మాది ‘వర్టికల్’ నమూనా అనుకున్నప్పుడు అక్కడ ‘టవర్స్’ వస్తాయి, అప్పుడు సమస్తము వొకచోట కేంద్రీకృతం ఆవుతుంది. అదే ‘హారిజాంటల్’ నమూనా అనుకున్నప్పుడు ‘టవర్స్’ స్థానంలో చిన్నచిన్న భవనాలు రాష్ట్రమంతటా నలువైపులా విస్తరిస్తాయి. అప్పుడు అవి – నాలుగు ప్రాంతీయ మండళ్ళు అవుతాయి, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం వొక జిల్లా అయ్యి పదమూడు రేపు పాతిక అవుతాయి. అప్పుడు మునుపటి ‘ఎన్టీఅర్ మండలాన్ని’ మూడున్నర దశాబ్దాలు తర్వాత, ఈ ‘ఆన్ లైన్’ రోజుల్లో గ్రామ సచివాలయాలు పేరుతో ఆకాశంలో నుంచి దించి గ్రామ స్థాయిలో నేలబారుగా చేస్తున్నది.

‘ఆన్ లైన్’ అన్నప్పుడు రాష్ట్ర చరిత్రలో చెంద్రబాబు ‘ఎరా’ ప్రస్తావన తప్పదు. అంతేకాదు, ఆయన వ్యక్తిత్వంలోని వైరుధ్యాల వడపోతకు అది కీలకం. ఆర్ధిక సంస్కరణలు దేశం లో 1991 లో మొదలయితే, వెనువెంటనే 1995లోనే ఏ.పి. ముఖ్యమంత్రిగా చెంద్రబాబు వాటి అమలును దక్షణాదిలో మొదలుపెట్టారు. అది ప్రధాని పీ.వి. చొరవ అయినప్పటికీ కూడా, దిగ్విజయ సింగ్ వంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు వాటి అమలు ఆచితూచి అమలు చేస్తున్న రోజుల్లో, బాబు - ‘కం వాట్ మే...’ తరహాలో ముందుకు వెళ్లారు. హైదరాబాద్ లో ‘సెంటర్ ఫర్ గుడ్ గవర్నెస్’ ఈ రోజు వొక సంస్థ రూపం తీసుకోవడం వెనుక ఉన్నది బాబే. అయితే, ‘టెక్నాలజీ’ని మనదైన వొక పొలిటికల్ ఫిలాసఫీ కార్యాచరణ కోసం వొక ‘టూల్’ గా వాడుకోవడం వేరు. ఇదిమిద్దంగా అస్సలు ఎటువంటి ‘పొలిటికల్ ఫిలాసఫీ’ లేకుండా, కేవలం దాన్ని వొక ‘ఫ్యాన్సీ’గా అంగీకరించడం వేరు. బాబుది రెండవ కేటగిరి. అందుకే చివరికి అది -  ఆయన విషయంలో ‘మెయిన్ డిష్’ మీద షోకు కోసం చేసే ‘గార్నిష్’ చందమైంది. చెంద్రబాబు తర్వాత వచ్చిన రాజశేఖరరెడ్డి దీన్ని ముందుగానే పసికట్టి, ఆయన వాన చుక్కల మధ్యనుంచి తడవకుండా తన రధాన్ని నడిపారు.

అయితే పదేళ్ళ విరామం తర్వాత మళ్ళీ వచ్చిన చెంద్రబాబు జాగీరు ఈసారి జగ్గయ్యపేట ఇవతల మొదలయింది. హైదరాబాద్ లో మునుపు నువ్వు ఏమిచేసావు అనేది ఇప్పుడు ఇక్కడ విషయం కాదు. ఇక్కడ ఏమిచేస్తావు అనేది చెప్పాలి. కానీ ఆయన ‘ఎజెండా’ వేరుగా ఉంది. ‘మ్యాప్’ చిన్నది కావడం సరే అది ఎటూ వుంది, గడచిన పదేళ్ళ విరామంలో ‘రాజ్యం’ ప్రమేయం లేకుండానే ‘టెక్నాలజీ’ దానితో పాటు అనివార్యంగా ఉండే భిన్న పరిణామాలు సూక్ష్మ స్థాయిలో జనంలోకి చేరాయి. ఇక్కడ వొక మెలిక ఉంది. 

 

 

‘డిజిటలైజేషన్’ సైన్స్ అర్ధం వద్ద కనుక మనం ఆగిపోతే, దాని ‘హ్యుమానిటీస్’ అర్ధం మనకు జీవితకాలంలో బోధపడదు. బాబు విషయంలో జరిగింది అదే. జనం బయటకు మాట్లాడకపోవచ్చు గానీ, అవసరమా అనవసరమా అనేదాంతో పనిలేకుండా, ప్రతిదీ వాళ్లకు చేరుతున్నది. దాన్ని ఆపడం ఇప్పుడు ఎవరివల్లా అయ్యేదికాదు. ఇలా పులిస్వారీగా మారిన ‘టెక్నాలజీ’ ఇప్పుడు చెంద్రబాబు సమస్య. గడచిన ఐదేళ్ళలో కనీసం నాలుగు కొత్త జిల్లాలు చేస్తాను, అనకపోవడం ఆయనకున్న తాత్విక సమస్య. ఆయనకు ఏదీ చేయిజారి పోకూడదు. కానీ ఇప్పుడు పొసగని లెక్క అది. ‘టెక్నాలజీ’ - ‘ఫిలాసఫీ’ల వైరుధ్యాల మధ్య ఆయనిప్పుడు మందడం గ్రామానికి పరిమితం కావాల్సివచ్చింది. సంస్కరణలకు పాతికేళ్ళు గడిచేసరికి, యువకుడైన జగన్ మోహనరెడ్డి ఇప్పుడు ఆయనకు కొత్త ‘వెర్షన్’ అయ్యారు.