ఇడుపులపాయకు ఇచ్ఛాపురానికి అనుబంధమేంటి..?!

గత కొన్నేళ్లుగా మాత్రం  ఇడుపులపాయకు, ఇచ్చాపురానికి మధ్య అవినాభావ సంబంధం ఏర్పడింది.. వైఎస్‌ కుటుంబంతో ప్రత్యేక బంధం పెనవేసుకుంది.. నాటి రాజశేఖర్‌రెడ్డి నుంచి నేటి షర్మిల వరకు అందరితో అనుబంధం ఏర్పరచుకుంది

what is the relation between idupulapaya and ichchapuram ksp

ఇడుపులపాయ.. రాయలసీమలోని కడప జిల్లాలో మారుమూల ఉన్న ఓ ప్రాంతం..
ఇచ్ఛాపురం.. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళంలో ఉన్న మరో వెనుకబడిన ప్రాంతం...

ఈ రెండింటి మధ్య ఉన్న అనుబంధం ఒక్కటే.. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రాంతాలే కావడం.. అయితే, ఇది ఒకప్పటి మాట.. గత కొన్నేళ్లుగా మాత్రం ఈ రెండింటికీ మధ్య అవినాభావ సంబంధం ఏర్పడింది.. వైఎస్‌ కుటుంబంతో ప్రత్యేక బంధం పెనవేసుకుంది.. నాటి రాజశేఖర్‌రెడ్డి నుంచి నేటి షర్మిల వరకు అందరితో అనుబంధం ఏర్పరచుకుంది.. పులివెందులకు చెందిన వైఎస్‌ఆర్‌ కుటుంబానికి ఇడుపులపాయలోనే వ్యవసాయభూములు ఉన్నాయి.

ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే ఇడుపులపాయలోనే ఏళ్ల తరబడి పంటల సాగు చేస్తోంది వైఎస్‌ కుటుంబం.. రాజశేఖర్‌రెడ్డి సజీవంగా ఉన్నప్పుడు ఇంట్లో కంటే ఎక్కువ సమయం ఇడుపులపాయలోనే గడిపే వారంటే అతిశయోక్తి కాదు. చివరకు వైఎస్‌ మరణానంతరం ఆయన భౌతిక కాయాన్ని కూడా ఇడుపులపాయలోనే సమాధి చేశారు. అలాంటి ఇడుపులపాయతో అనుబంధం కలిగి ఉన్న వైఎస్‌ఆర్‌ కుటుంబం రాజకీయాల పుణ్యమా అని ఇచ్ఛాపురంతోనూ కాలక్రమేణా అనుబంధం ఏర్పరచుకుంది.

ఏప్రిల్ 9, 2003.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల చరిత్రలో ఒక ముఖ్యమైన తేదీగా గుర్తించబడింది. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రంలోని కరువు సంబంధిత సమస్యలను ఎత్తిచూపడానికి 60 రోజుల పాటు... 1,500 కిలోమీటర్ల పాదయాత్రను ప్రారంభించారు. రైతుల పట్ల తెలుగుదేశం పార్టీ నిరాసక్తతను ప్రధాన ఎజెండాగా చేసుకుని సాగించిన ఆ పాదయాత్ర 20 ఏళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ప్రారంభమైంది.

రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, పశ్చిమ, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల మీదుగా 11 జిల్లాల్లో కొనసాగి శ్రీకాకుళంలోని ఇచ్ఛాపురం వద్ద ముగిసింది. ఆ పాదయాత్రలో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పెద్ద సంఖ్యలో బహిరంగ సభలలో ప్రసంగించారు. వివిధ వ్యక్తులను కలుసుకున్నారు. వారి సమస్యలను తెలుసుకున్నారు.

అనంతరం, 2017లో డాక్టర్ వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రను ప్రారంభించారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు చేరువయ్యేందుకు జగన్‌ ఈ వారసత్వాన్ని కొనసాగించారు. నవంబర్ 6, 2017న వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఆయన స్వస్థలం ఇడుపులపాయలో పాదయాత్ర ప్రారంభించారు. తన తండ్రి సమాధి వద్ద నివాళులర్పించిన తర్వాత వైఎస్‌ జగన్‌ తన యాత్రను ప్రారంభించారు.

ప్రజా సంకల్ప యాత్ర 13 జిల్లాలు, 135 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2516 గ్రామాల మీదుగా... 341 రోజుల పాటు 3648 కిలోమీటర్ల మేర సాగింది. చివరకు జనవరి 9, 2019న శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో ఆ పాదయాత్ర ముగిసింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు వైఎస్‌ఆర్‌ మీద ఎలా విశ్వాసం ఉంచారో అలాగే జగన్‌పై కూడా విశ్వాసం ఉంచారు. నాడు వైఎస్‌ను అఖండ మెజారిటీతో గెలిపించినట్లుగానే.. జగన్‌ను కూడా చరిత్రాత్మక విజయంతో ఆశీర్వదించారు.

ఇక, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, జగన్‌ బాటలోనే... ప్రస్తుతం షర్మిల కూడా నడిచారు. అయితే, వారికి కాస్త భిన్నంగా ఆమె ప్రయత్నం చేయడం ఆసక్తికరంగా మారింది. తండ్రి, తనయుడు.. ఇద్దరూ ఇచ్ఛాపురానికి పాదయాత్ర చేస్తే... షర్మిల మాత్రం ఇచ్ఛాపురం నుంచి తన కాంగ్రెస్‌ పార్టీ పర్యటనలు ప్రారంభించడం విశేషం. కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న తరవాత ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం షర్మిల మొదటిసారిగా శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం తన పర్యటనలు ప్రారంభించారు. అలా కాంగ్రెస్‌ పార్టీ శేణుల్లో కదలిక తెచ్చారు. స్తబ్దుగా ఉన్న ఆ పార్టీ నాయకులు, శ్రేణుల్లో జోష్‌ నింపారు. కుటుంబ సెంటిమెంట్‌గా ఉన్న ఇచ్ఛాపురం కథను కొనసాగించారు.

టీడీపీ అధినేత చంద్రబాబు 'వస్తున్నా.. మీకోసం, నారా లోకేష్‌ 'యువగళం' పాదయాత్రలు కూడా ఉత్తరాంధ్రలోనే ముగిసినప్పటికీ.. అవన్నీ విశాఖపట్టణం పరిసర ప్రాంతాలకే పరిమితమయ్యాయి.. ఇచ్ఛాపురం వరకు చేరలేదు. దీంతో వైఎస్‌ఆర్‌ కుటుంబానికి, ఇచ్ఛాపురానికి అవినాభావ సంబంధం ఏర్పడినట్లయింది. ఇడుపులపాయతో దశాబ్దాల అనుబంధం ఉన్న వైఎస్‌ఆర్‌ కుటుంబానికి.. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇచ్ఛాపురంతోనూ అవినాభావ సంబంధం ఏర్పడినట్లయింది.. ఎన్నికలు సమీపించిన ఈ సమయంలో ఈ ఇచ్ఛాపురం సెంటిమెంట్‌ ఏపీ వైసీపీ, కాంగ్రెస్‌, రాజకీయవర్గాల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios