కరోనా వైరస్.... ఈ పేరు చెబితే ఇప్పుడు ప్రపంచం వణికిపోతుంది. ప్రపంచ దేశాలన్నీ దాదాపుగా ఆ వైరస్ బారిన పడ్డాయి. ఆ వైరస్ సోకని దేశం దాదాపుగా లేదంటే అతిశయోక్తి కాదు. ఈ మహమ్మారి ఇప్పుడు భారత దేశంపై కూడా పంజా విసురుతోంది. 

భారత దేశంపై ఈ వైరస్ దండెత్తుతున్న వేళ భారతదేశమంతా ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు కంకణం కట్టుకుంది. దేశమంతా దాదాపుగా లాక్ డౌన్ లో ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ లాక్ డౌన్ కొనసాగడంతోపాటుగా రాత్రి కర్ఫ్యూ కొనసాగుతోంది. 

ఈ కరోనా వైరస్ విలయతాండవం చేయడం మొదలుపెట్టినప్పటి నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిరోజు ప్రెస్ మీట్ నిర్వహిస్తూ ప్రజలకు తానున్నాననే ఆత్మవిశ్వాసం కల్పిస్తున్నారు. వైరస్ ని రాష్ట్రం నుండి తరిమి కొట్టేందుకు తాను ముందుంటానని అన్నారు. అన్నట్టుగానే ప్రజల్లో కాన్ఫిడెన్స్ నింపుతున్నారు కేసీఆర్. 

Also Read:వినకపోతే 24 గంటల కర్ఫ్యూ, అదీ కాకపోతే కనిపిస్తే కాల్చివేత: కేసీఆర్

తాజాగా ఈరోజు మాట్లాడుతూ కేసీఆర్ ప్రజాప్రతినిధులందరిని ఫీల్డ్ మీదకు రావాలని కోరారు. అందరూ కూడా ప్రజల మధ్యకు వచ్చి తమ గురుతర బాధ్యతను  నిర్వర్తించాలని వారికి కర్తవ్య బోధ చేసారు. కార్పొరేటర్ల నుండి మొదలుకొని మంత్రులు, ఎమ్మెల్యేల వరకు అందరిని రోడ్ల మీదికి రావాలని ప్రజల మద్యలో ఉండాలని హుకుం జారీ చేసారు. 

వీరితోపాటుగా నూతనంగా చేసిన పంచాయితీరాజ్, మునిసిపల్ చట్టాల్లో స్టాండింగ్ కమిటీ మెంబర్లను కూడా రోడ్లపైకి వచ్చి ప్రజలకు సహాయకులుగా ఉండాలని కోరారు. దాదాపుగా 10 లక్షల మంది ఇలా స్టాండింగ్ కమిటీల రూపంలో అందుబాటులో ఉన్నారు. 

కేసీఆర్ ఇంతమందిని బయటకు రమ్మని ఎందుకు చెప్పినట్టు అనేది ఇక్కడ అందరికి వస్తున్న చిన్న సందేహం. దీనివల్ల ప్రతి ఏరియాలో ప్రజలతో పోలీసులకు, ప్రభుత్వ సిబ్బందికి సమాచార మార్పిడి, సంబంధాలు చాలా తేలికవుతాయి. 

ఒక్కొక్క ఏరియాకు ఒక నోడల్ సెంటర్ ని ఏర్పాటు చేసుకోవడం వల్ల చాలా తేలికగా కింద నుండి పైకి అయినా... పై నుండి కిందికయినా సమాచారం త్వరితగతిన చేరవేసే వీలవుతుంది. ఉదాహరణకు ఒక గ్రామం ఉందనుకోండి అక్కడ సర్పంచ్, వార్డ్ మేంబర్లతోపాటుగా స్టాండింగ్ కమిటీ మెంబర్లు వీరందరికి తోడుగా గ్రామంలో పనిచేసే ప్రభుత్వోద్యోగులు. 

Also Read:సర్వైవ్ లెన్స్ స్టేట్ గా తెలంగాణ: తాజాగా మరో మూడు కరోనా కేసులు

రెవిన్యూ అసిస్టెంట్ నుండి మొదలుకొని పోలీసుల వరకు ఇంతమంది సిబ్బంది ఒక్కసారిగా గ్రామంలో కలియ తిరిగి పూర్తి సమాచారాన్ని సేకరించడం అత్యంత తేలికవుతుంది. ఇలా వారు ప్రభుత్వ సమాచారాన్ని ప్రజలకైనా, ప్రజల నుండి ఏదైనా సమాచారాన్ని ప్రభుత్వానికైనా చేరవేయడం అత్యంత తేలికవుతుంది. 

ఇంతమంది పనిచేస్తున్నప్పుడు ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులతో ప్రజలకు సత్సంబంధాలు ఉండడం వల్ల, వారికి ప్రభుత్వ యంత్రాంగంతో సంబంధాలు ఉండడం వల్ల జరుపతలపెట్టిన కార్యక్రమం విజయవంతమవుతుంది. అప్పుడు జన్ భాగిధారి అని మనం ఏదైతే ప్రజలను భాగస్వాములను చేయాలి అని భావిస్తామో అది వీలవుతుంది.