దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. సత్యనికేతన్ ప్రాంతంలో విద్యార్థులు నివసించే ఓ పేయింగ్ గెస్ట్ (పీజీ) భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో చాలామంది విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకున్నారు.

Delhi Accident : సౌత్ వెస్ట్ ఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో ఓ భవనం కుప్పకూలింది. ఇవాళ (ఆదివారం) మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే ఢిల్లీ ఫైర్ సర్వీస్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. కూలిపోయిన భవన శిథిలాల కింద చాలామంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఐదుగురిని శిథిలాల నుంచి సురక్షితంగా బయటకు తీశారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌కు సమీపంలోని సత్యనికేతన్‌లో ఉన్న ఈ భవనాన్ని విద్యార్థుల కోసం పేయింగ్ గెస్ట్ (పీజీ)గా నడుపుతున్నారు. ఆదివారం సెలవు కావడంతో చాలామంది విద్యార్థులు తమ గదుల్లోనే ఉన్నారు. ప్రమాదం జరిగినప్పుడు భవనంలో దాదాపు 50 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 12 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని, కాంక్రీట్ పెళ్లలను తొలగిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నాయి.

కొనసాగుతున్న సహాయక చర్యలు

శిథిలాల కింద చిక్కుకున్న వారిని రెస్క్యూ సిబ్బంది బయటకు తీస్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. స్థానికులు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారేమోనని గుర్తించేందుకు ఫైర్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ప్రమాద స్థలానికి చేరుకున్న స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ శర్మ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

డిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్త కూడా ఈ దుర్ఘటనపై స్పందించారు. బాధితులను రక్షించేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాలని... క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు.