Air Pollution: వాయు కాలుష్యానికి రాష్ట్రాల సరిహద్దులు అడ్డుకావని CSTEP అధ్యయనాలు వెల్లడించాయి. ఒక రాష్ట్రంలో వెలువడే కాలుష్యం పొరుగు రాష్ట్రాల గాలినీ ప్రభావితం చేస్తున్నందున, సమష్టి చర్యలతోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేసింది.
నగరాల సమస్య కాదు.. ప్రాంతం మొత్తం ప్రభావితం
వాయు కాలుష్యానికి రాష్ట్రాలు, జిల్లాలు, నగరాల సరిహద్దులు ఉండవని సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ (CSTEP) నిర్వహించిన అధ్యయనాలు వెల్లడించాయి. ఒక ప్రాంతంలో వెలువడే కాలుష్యం గాలుల ద్వారా పొరుగు రాష్ట్రాలకు కూడా చేరుతుంది. అందువల్ల ఒక్కో నగరం లేదా రాష్ట్రం మాత్రమే కాలుష్యాన్ని నియంత్రించే ప్రయత్నం చేస్తే ఆశించిన ఫలితాలు రావని అధ్యయనం స్పష్టం చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (NCAP) ప్రధానంగా నగరాల ఆధారంగా చర్యలు తీసుకుంటోంది. అయితే కాలుష్యం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వ్యాపించే పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, మొత్తం ‘ఎయిర్‌షెడ్’ (Airshed) ఆధారంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని CSTEP పేర్కొంది. అంటే ఒకే గాలి ప్రవాహ ప్రాంతంలో ఉన్న పలు రాష్ట్రాలు, నగరాలు కలిసి కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలి. బెంగళూరులో బుధవారం జరిగిన ఇండియా క్లీన్ ఎయిర్ సమ్మిట్ (ICAS) 2026లో ఈ అధ్యయనాలను విడుదల చేశారు. ఎయిర్ వితవుట్ బార్డర్స్ స్కేలింగ్ ఎయిర్ క్వాలిటీ అక్రాస్ సిటీస్, స్టేట్స్, అండ్ రీజియన్స్ అనే అంశంతో ఈ సదస్సు జరిగింది.
దక్షిణాది రాష్ట్రాల్లో 38 నుంచి 65 శాతం కాలుష్యం స్థానికంగానే
గవర్నెన్స్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఎయిర్‌షెడ్ లెవల్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ ఇన్ సౌత్ ఇండియా పేరుతో రూపొందించిన అధ్యయనంలో దక్షిణ భారతంలోని ఐదు రాష్ట్రాల మధ్య కాలుష్యం ఎలా వ్యాపిస్తుందో పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి కాలుష్యం ఎంత మేరకు వెళ్తుందో అధ్యయనం చేశారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) గణాంకాల ప్రకారం దక్షిణ భారతంలోని అనేక ప్రధాన పట్టణ ప్రాంతాల్లో PM₁₀ స్థాయులు సిఫారసు చేసిన వార్షిక సగటు పరిమితులను మించుతున్నాయి. ఈ నేపథ్యంలో NCAP కింద దక్షిణ భారతంలోని 25 నగరాలను ‘నాన్-అటెయిన్‌మెంట్ సిటీస్’గా గుర్తించారు.
అంటే జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా గాలి నాణ్యతను సాధించలేకపోతున్న నగరాలు అన్నమాట. ఈ ఐదు రాష్ట్రాల్లో వార్షిక సగటు కాలుష్యంలో 38 శాతం నుంచి 65 శాతం వరకు స్థానికంగా రాష్ట్రాల నుంచే ఉత్పత్తి అవుతోంది. తెలంగాణలో స్థానిక కాలుష్య వాటా అత్యల్పంగా 38 శాతంగా ఉంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో 44 శాతం, కర్ణాటకలో 47 శాతం, తమిళనాడులో 61 శాతం, కేరళలో అత్యధికంగా 65 శాతంగా ఉంది. కాలుష్యం ఎటు నుంచి ఎటు వెళ్తుందనేది వాతావరణ పరిస్థితులు, గాలి దిశ, భౌగోళిక పరిస్థితులపై ఆధారపడి మారుతుందని అధ్యయనం చెబుతోంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తమకు అందుతున్నదానికంటే పొరుగు రాష్ట్రాలకు ఎక్కువ కాలుష్యాన్ని పంపుతున్నాయి. అందువల్ల ఇవి ‘నెట్ కంట్రిబ్యూటర్స్’గా ఉన్నాయి. మరోవైపు కేరళ, తెలంగాణ రాష్ట్రాలు తాము పంపే కాలుష్యం కంటే ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువ కాలుష్యాన్ని స్వీకరిస్తున్నాయి. కర్ణాటక మాత్రం దక్షిణ భారతంలో మధ్య ప్రాంతంలో ఉండటంతో కొంత కాలుష్యాన్ని స్వీకరిస్తూ, కొంత కాలుష్యాన్ని ఇతర ప్రాంతాలకు పంపుతోంది.
ఇళ్ల నుంచి, పరిశ్రమల నుంచి, బహిరంగ దహనం నుంచి కాలుష్యం
దక్షిణ భారతంలోని ఐదు రాష్ట్రాల్లో స్థానిక కాలుష్యానికి ప్రధాన కారణాలుగా గృహ వినియోగం, పరిశ్రమలు, బహిరంగంగా వ్యర్థాలను కాల్చడం నిలుస్తున్నాయి. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలే PM₂.₅ కాలుష్యానికి గృహ వినియోగం, ఇంధన రంగం, పరిశ్రమలు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఢిల్లీ పరిసర ప్రాంతాల మాదిరిగా దక్షిణ భారతంలో ఒకే పెద్ద కాలుష్య హాట్‌స్పాట్ లేదని అధ్యయనం చెబుతోంది. అందువల్ల ఒకే నగరంపై దృష్టి పెట్టకుండా మొత్తం దక్షిణ భారత ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకుని కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
ఇందుకోసం వాయు నాణ్యత నిర్వహణకు ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని CSTEP సూచించింది. దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో పనిచేస్తున్న కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) తరహాలో దక్షిణాది రాష్ట్రాల కోసం కూడా ఒక సంస్థ ఉండాలని ప్రతిపాదించింది. ఐదు రాష్ట్రాలు దశలవారీగా కలిసి పనిచేసేలా ఒక ఉమ్మడి వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. ఇందులో కాలుష్యానికి సంబంధించిన ఉమ్మడి డేటా, పర్యవేక్షణ వ్యవస్థ, నిధుల కేటాయింపు వంటి అంశాలను సమన్వయం చేయాలి.
ఒకే ఇంధన విధానం.. ఎలక్ట్రిక్ వాహనాలపై ఉమ్మడి లక్ష్యాలు
దక్షిణ భారతంలోని ఐదు రాష్ట్రాలు ఇప్పటివరకు ఉమ్మడిగా ఆమోదించిన ఇంధన విధానం (Approved Fuel Framework)ను ప్రకటించలేదని అధ్యయనం పేర్కొంది. అన్ని రాష్ట్రాలు ఒకే విధమైన శుభ్రమైన ఇంధనాల జాబితాను రూపొందించి అమలు చేయాలని సూచించింది. అదే విధంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ఐదు రాష్ట్రాలు ఉమ్మడి లక్ష్యాలను నిర్దేశించుకోవాలని తెలిపింది. పాత వాహనాలను దశలవారీగా తొలగించేందుకు కూడా ఒకే విధమైన విధానాన్ని రూపొందించాలి.
ఈ చర్యలకు అవసరమైన నిధులను ఇప్పటికే ఉన్న NCAP నిధులు, రాష్ట్రాల వాయు నాణ్యత కార్యాచరణ ప్రణాళికల ద్వారా ఉపయోగించుకోవచ్చని CSTEP సూచించింది. ఇదే సమయంలో CSTEP మరో అధ్యయనాన్ని కూడా విడుదల చేసింది. బియాండ్ స్టేట్ బౌండరీస్ క్వాలిఫైయింగ్ ఇంటర్‌స్టేట్ ఎయిర్ పొల్యుషన్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ సెక్టోరల్ సొల్యుషన్స్ ఇన్ ది ఇండో గాంగెటిక్ ప్లేన్ పేరుతో రూపొందించిన ఈ రిపోర్ట్ ఇండో-గంగా మైదానంలో కాలుష్యానికి ప్రధాన కారణాలు, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ప్రాంతీయ స్థాయిలో వాటిని ఎలా నియంత్రించవచ్చో విశ్లేషించింది.
రాష్ట్రాలు విడివిడిగా కాకుండా కలిసి పనిచేయాలి
జాతీయ రాజధాని ప్రాంతం (NCR)లో PM₂.₅ కాలుష్యంలో కేవలం 28 శాతం మాత్రమే స్థానిక వనరుల నుంచి వస్తున్నట్లు అధ్యయనం గుర్తించింది. ఇందులో ప్రధానంగా గృహ కార్యకలాపాలు, పరిశ్రమలు, వ్యవసాయం, రవాణా రంగాలు ఉన్నాయి. మిగిలిన కాలుష్యంలో దాదాపు మూడో వంతు ఇండో-గంగా మైదానంలోని ఇతర రాష్ట్రాల నుంచి, మరో మూడో వంతు పొరుగు దేశాల నుంచి వస్తున్నట్లు అధ్యయనం పేర్కొంది. ఒక్కో రాష్ట్రం లేదా ఒక్కో రంగం మాత్రమే కాలుష్యాన్ని తగ్గించే చర్యలు చేపడితే ఫలితాలు పరిమితంగానే ఉంటాయని CSTEP తెలిపింది. గృహ, పరిశ్రమలు, ఇంధన రంగం, రవాణా, వ్యవసాయ వ్యర్థాల దహనం వంటి అన్ని రంగాల్లో ఒకేసారి కాలుష్యాన్ని తగ్గిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని పేర్కొంది.
అందుకే దేశవ్యాప్తంగా నగర స్థాయి వివరాలతో కూడిన హై-రిజల్యూషన్ జాతీయ ఉద్గారాల డేటాబేస్‌ను ఎప్పటికప్పుడు నవీకరించాలని సిఫారసు చేసింది. పంట వ్యర్థాల నిర్వహణను పర్యవేక్షించడంతో పాటు ఉపగ్రహాల ద్వారా అగ్ని ప్రమాదాలను రియల్‌టైమ్‌లో గుర్తించే వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించింది.
అలాగే ఇండో-గంగా మైదానం మొత్తానికి ఒకే విధమైన శుభ్రమైన ఇంధనాల జాబితాను అమలు చేయాలని, మధ్యస్థాయి పరిశ్రమలను కూడా నిరంతర ఉద్గారాల పర్యవేక్షణ వ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలని సిఫారసు చేసింది. మొత్తంగా చూస్తే వాయు కాలుష్యం ఒక నగరానికి లేదా రాష్ట్రానికి మాత్రమే సంబంధించిన సమస్య కాదని, ఇది ప్రాంతీయ సమస్య అని CSTEP అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. గాలి సరిహద్దులను పట్టించుకోకుండా ప్రయాణిస్తున్నప్పుడు, కాలుష్య నియంత్రణ కూడా రాష్ట్రాల సరిహద్దులను దాటి సమన్వయంతో సాగాల్సిన అవసరం ఉంది.


