Anant Ambani: చెరువులోనే బతుకుతున్న బాలుడు.. ముంబైకి తీసుకెళ్లిన అనంత్ అంబానీ
Anant Ambani: పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ బాలుడు అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. గత అయిదేళ్లుగా చెరువులోనే జీవిస్తున్నాడు. సోషల్ మీడియాలో అతని వీడియో వైరల్ అవ్వడంతో, అనంత్ అంబానీ అతనికి చికిత్స చేయించేందుకు ముంబై తీసుకెళ్లారు.

చెరువుతోనే జీవిస్తున్న టీనేజర్
పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా చెందిన ఇక్బాల్ అనే టీనేజర్ గత కొంతకాలంగా అత్యంత అరుదైన వ్యాధితో నరకయాతన అనుభవిస్తున్నాడు. నీటిలోంచి బయటకు అడుగుపెట్టగానే అతని శరీరమంతా భరించలేనంత తీవ్రమైన మంట పుడుతోంది. ఆ మంట నుంచి ఉపశమనం పొందడం కోసం ఆ బాలుడు రేయింబవళ్లు స్థానికంగా ఉండే చెరువుల్లోనే ఉంటున్నాడు. నీటిపైనే తేలుతూ జీవిస్తున్నాడు. చివరికి ఆహారం తినడం కూడా చెరువులోనే. అంతేకాదు తనను ఏదో అతీంద్రియ శక్తి ఆవహించడం వల్లే ఇలా జరుగుతోందని బాలుడు నమ్ముతున్నాడు. గతంలో కుటుంబ సభ్యులు ఆసుపత్రులకు తీసుకెళ్లినా వ్యాధి నయం కాలేదు. దీర్ఘకాలిక చికిత్స చేయించే ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఆ పేద కుటుంబం నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది.
అనంత్ అంబానీ సాయం
సోషల్ మీడియాలో ఇతని వీడియో వైరల్ అయింది. దాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ స్పందించారు. ఆయన మానవతా దృక్పథంతో స్పందించారు. ఆ టీనేజర్ దీనస్థితిని తెలుసుకుని అతడికి అత్యాధునిక వైద్యం అందించాలని ఆదేశించారు. అనంత్ అంబానీ ఆదేశాల మేరకు రిలయన్స్ బృందం రంగంలోకి దిగి, బాలుడిని ప్రత్యేక విమానం ద్వారా ముంబైకి తరలించింది. ప్రస్తుతం ఇక్బాల్‌ను ముంబైలోని ప్రముఖ 'సర్ హెచ్.ఎన్. రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్'లో చేర్పించారు. అక్కడ దేశంలోని అగ్రశ్రేణి వైద్య నిపుణుల పర్యవేక్షణలో ప్రత్యేక వైద్య పరీక్షలు, చికిత్సను ఉచితంగా అందిస్తున్నారు. బాలుడికి సరైన కారణాన్ని గుర్తించి వ్యాధిని పూర్తిగా నయం చేసేందుకు వైద్యులు కృషి చేస్తున్నారు.
ప్రాణానికే ముప్పు
గంటల తరబడి నీటిలోనే ఉండటం వల్ల బాలుడి ప్రాణాలకే ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడిందని వైద్యలు చెబుతున్నారు. శరీర చర్మం తెల్లగా మారి, మెత్తబడి ముడతలు పడటం , చర్మం పగుళ్లు ఇచ్చి తీవ్రమైన ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బాలుడి పరిస్థితిని వీడియో చూసిన ఎంతో మంది బాధపడుతున్నారు.

