- Home
- Telangana
- Telangana Assembly: బీఆర్ఎస్ vs కాంగ్రెస్.. అసెంబ్లీ దగ్గర నల్ల టీషర్టుల రచ్చ.. ! సభలో బీజేపీ ఆందోళన
Telangana Assembly: బీఆర్ఎస్ vs కాంగ్రెస్.. అసెంబ్లీ దగ్గర నల్ల టీషర్టుల రచ్చ.. ! సభలో బీజేపీ ఆందోళన
Telangana Assembly: కాంగ్రెస్ హామీల అమలుపై బీఆర్ఎస్ ధర్నాతో గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు ఉద్రిక్తత నెలకొంది. హరీశ్ రావు, కేటీఆర్ సహా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. 22A పై బీజేపీ నిరసనతో సభ 15 నిమిషాలు వాయిదా పడింది.

అసెంబ్లీ గేట్ దగ్గర హైడ్రామా
తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాల తొలిరోజే ఊహించని రేంజ్‌లో పొలిటికల్ హీట్ పెరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి, అక్కడినుంచి అసెంబ్లీ వైపు నల్ల టీషర్టులు ధరించి ర్యాలీగా బయలుదేరారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు గళమెత్తారు. దీంతో గన్ పార్క్, అసెంబ్లీ ప్రాంగణం అంతా నినాదాలతో హోరెత్తింది.
అసెంబ్లీ గేటు వద్ద తీవ్ర ఉద్రిక్తత, కంటతడి పెట్టిన సునీతా లక్ష్మారెడ్డి
నల్ల టీషర్టులతో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీ లోపలికి అనుమతించేందుకు పోలీసులు నిరాకరించారు. భద్రతా కారణాల వల్ల నల్ల దుస్తులతో సభలోకి వెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేయడంతో గేటు వద్ద సీన్ రివర్స్ అయింది. బీఆర్ఎస్ నేతలకు, పోలీసులకు మధ్య గట్టిగా వాగ్వాదం జరగడంతో తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో కొందరు నేతలు కిందపడిపోగా, పరిస్థితి మరీ సీరియస్‌గా మారడంతో అసెంబ్లీ గేటు దగ్గరే ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తీవ్ర మనస్తాపంతో కంటతడి పెట్టుకున్నారు.
🚨అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను అవమానించిన కాంగ్రెస్ సర్కార్!
బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పట్ల అవమానకరంగా ప్రవర్తించి, చీర పట్టుకుని లాగిన పోలీసులు 😡
మహిళా ఎమ్మెల్యేలు అని కూడా చూడకుండా దుర్మార్గంగా ప్రవర్తిస్తారా అంటూ కన్నీళ్లు పెట్టిన సునీతా… pic.twitter.com/aRqbm8sku5— BRS Party (@BRSparty) September 7, 2026
హరీశ్ రావు షర్ట్ విప్పి నిరసన, పబ్లిక్ గార్డెన్స్ వద్ద హైడ్రామా
పరిస్థితి చెయ్యి దాటిపోతుండటంతో మాజీ మంత్రి హరీశ్ రావు తన చొక్కా విప్పి బనియన్‌తోనే నిరసన వ్యక్తం చేశారు. అదే తీరులో పబ్లిక్ గార్డెన్స్ గుండా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. వెంటనే ఆయన్ను బలవంతంగా ఇన్నోవా వాహనంలోకి ఎక్కించి అరెస్ట్ చేశారు. హరీశ్ రావుతో పాటు ప్రశాంత్ రెడ్డి, మల్లా రెడ్డి, సంజయ్ రావు, కౌశిక్ రెడ్డి వంటి నేతలను నలుగురేసి పోలీసులు ఎత్తుకెళ్లి బస్సుల్లోకి ఎక్కించారు. కౌశిక్ రెడ్డి రోడ్డుపై బైఠాయించగా ఆయన్ను బలవంతంగా అక్కడినుంచి తరలించారు.
కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం కాంగ్రెస్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. "అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని దేవుడి సాక్షిగా చెప్పిన కాంగ్రెస్, 1000 రోజులైనా చేసిందేమీ లేదు. రాహుల్ గాంధీ చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి?" అని ప్రశ్నించారు. ప్రజల సమస్యలపై చర్చించడానికి కనీసం నెల రోజుల పాటు సభ నిర్వహించాలని కేసీఆర్ తమకు సూచించారని చెప్పారు. అనంతరం కేటీఆర్ ను కూడా పోలీసులు కారు ఎక్కకుండా అడ్డుకున్నప్పటికీ బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
సభలో 22A రచ్చ, స్పీకర్ సభ వాయిదా
ఒకవైపు బయట బీఆర్ఎస్ నేతల అరెస్టులు నడుస్తుండగానే, సభ లోపల బీజేపీ ఎమ్మెల్యేలు 22A నిబంధన, భూ దందాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. మరోవైపు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడూతూ ప్రతిపక్షాల మైకులు కట్ చేస్తున్నారని, ప్రజా సమస్యలపై మాట్లాడే హక్కు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. దీనికి స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు 22A పై తమ ప్రభుత్వం A నుంచి Z వరకు చర్చించడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అయితే బీజేపీ సభ్యుల ఆందోళన తగ్గకపోవడంతో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.

