- Home
- Feature
- Success Story : టాయిలెట్లు కడిగిన చోటే టాప్ ఆఫీసర్ గా జాబ్.. ఈమెది కదా అసలుసిసలైన సక్సెస్
Success Story : టాయిలెట్లు కడిగిన చోటే టాప్ ఆఫీసర్ గా జాబ్.. ఈమెది కదా అసలుసిసలైన సక్సెస్
స్వీపర్ గా పనిచేసిన బ్యాంకులోనే టాప్ లెవెల్ ఆఫీసర్ గా ఉద్యోగం సాధించి ఎందరో మహిళలకు స్పూర్తిగా నిలిచారు ప్రతీక్షా తొండ్వాల్కర్. ఆమె సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందాం.

ఈమెది మామూలు సక్సెస్ కాదు..
కొన్ని కథలు వింటుంటే మనకు తెలియకుండానే స్ఫూర్తి వస్తుంది. కష్టపడితే ఏదైనా సాధించవచ్చని అనిపిస్తుంది. అలాంటి ఓ నిజమైన కథే ఇది. ఒకప్పుడు తాను పనిచేసే బ్యాంకులో టాయిలెట్లు, ఆఫీస్ రూములు శుభ్రం చేసిన ఓ మహిళ... పట్టుదలతో చదివి ఇవాళ అదే బ్యాంకులో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (AGM) అయ్యారు. ఆమె పేరు ప్రతీక్షా తొండ్వాల్కర్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ఆమె ప్రయాణం ఎందరికో ఆదర్శం.
17 ఏళ్లకే పెళ్లి, 20 ఏళ్లకే కష్టాలు
ప్రతీక్షా కథ కష్టాలతోనే మొదలైంది. పేదరికం వల్ల 17 ఏళ్లకే పదో తరగతితో చదువు ఆపేసి పెళ్లి చేసుకున్నారు. ఆమె భర్త సదాశివ్ కడు, ముంబైలోని SBI బ్రాంచ్‌లో బుక్‌బైండర్‌గా పనిచేసేవారు. కానీ విధి వక్రీకరించి పెళ్లయిన మూడేళ్లకే అతడు ప్రమాదవశాత్తు చనిపోయాడు... దీంతో ప్రతీక్షకు 20 ఏళ్ల వయసులోనే కష్టాలు మొదలయ్యాయి. అప్పటికే ఈమెకే ఓ కొడుకు... చిన్న వయసులోనే కొడుకును పెంచాల్సిన బాధ్యత ఆమెపై పడింది.
చదువు లేకపోవడంతో మంచి ఉద్యోగం దొరకడం కష్టమైంది. దీంతో తన భర్త పనిచేసిన SBI బ్రాంచ్‌లోనే స్వీపర్‌గా చేరారు. ఆఫీస్ గదులు, టాయిలెట్లు శుభ్రం చేసేవారు. ఈ పనికి గానూ ఆమెకు నెలకు కేవలం 60-65 రూపాయల జీతం మాత్రమే వచ్చేది. ఆ కొద్ది డబ్బుతోనే ఇంటిని, తన కొడుకును చూసుకునేవారు.
స్వీపర్ గా పనిచేసిన బ్యాంకులోనే ఏజిఎం జాబ్
కష్టాలు చుట్టుముట్టినా ప్రతీక్షా వెనకడుగు వేయలేదు. ఆపిన చదువును మళ్లీ కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ముంబైలోని విఖ్రోలీలో ఉన్న ఓ నైట్ కాలేజీలో చేరి 12వ తరగతి పూర్తి చేశారు. ఆ తర్వాత సైకాలజీలో డిగ్రీ కూడా సాధించారు. ఆమె కష్టాన్ని, పట్టుదలను గమనించిన బ్యాంకు అధికారులు ఆమెను క్లర్క్‌గా ప్రమోట్ చేశారు. 1993లో ప్రమోద్ తొండ్వాల్కర్‌ను రెండో వివాహం చేసుకున్నారు. భర్త ప్రోత్సాహంతో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమయ్యారు. కష్టపడి చదివి ఎస్బిఐలో ట్రైనీ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు.
అక్కడి నుంచి ప్రతీక్ష వెనుదిరిగి చూసుకోలేదు. తన పనితీరు, అంకితభావంతో ఒక్కో మెట్టూ ఎక్కుతూ CGM, ఆ తర్వాత అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (AGM) అనే ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ఒకప్పుడు తను శుభ్రం చేసిన క్యాబిన్లలోనే అధికారిగా కూర్చున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా, పట్టుదల ఉంటే అనుకున్నది సాధించవచ్చని ప్రతీక్షా జీవితం నిరూపిస్తోంది.

