Asianet News TeluguAsianet News Telugu

మీ పర్యాటక దాహాన్ని తీర్చే కొత్త ప్రదేశాలు (వీడియో)

ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్బంగా దేశంలో ఇప్పటివరకూ ఎవ్వరూ కనిపెట్టని కొన్ని కొత్త ప్రదేశాలను మీకు పరిచయం చేస్తున్నాం. మీ నెక్స్ట్ ట్రిప్ కి కొత్త అనుభవాన్ని అందిస్తాయి.

ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్బంగా దేశంలో ఇప్పటివరకూ ఎవ్వరూ కనిపెట్టని కొన్ని కొత్త ప్రదేశాలను మీకు పరిచయం చేస్తున్నాం. మీ నెక్స్ట్ ట్రిప్ కి కొత్త అనుభవాన్ని అందిస్తాయి.
1. మేఘమలై, మధురై - వీటినే హౌవే మౌంటెన్స్ (high wavy mountains) అని కూడా పిలుస్తారు. చుట్టూ పచ్చటి ప్రకృతి, వివిధ రకాల జంతుజాలంతో ఆహ్లాదకరంగా ఉండే ప్రదేశం ఇది. అరుదైన, విభిన్న రకాల జంతుజాతులనివాసం ఈ మేఘమలై చిక్కటి అడవి ప్రదేశం. ఎగిరే ఉడతలు, స్లొత్ బియర్స్, బూడిద రంగు అడవికోళ్లు, అడవిపందులు, మచ్చల జింకలు ఈ అడవిలో విరివిగా కనిపిస్తాయి. రకరకాల రంగుల సీతాకోకచిలుకలు, ఎన్నో రకాల పురుగులు ఈ అడవిలో అడుగడుగునా కనిపిస్తాయి. మేఘమలైకి వెళ్లడానికి విమానం, రైలు మార్గాలున్నాయి. మేఘమలైకి 118 కిలోమీటర్ల దూరంలో మధురై ఎయిర్ పోర్ట్ ఉంటుంది. మేఘమలైకి అతి దగ్గరి రైల్వే స్టేషన్ కూడా మధురై రైల్వే స్టేషనే. తమిళనాడులోని అన్ని పట్టణాలు, నగరాలనుండి మేఘమలైకి రోడ్డు మార్గం కూడా ఉంది. మేఘమలైకి దగ్గర్లో అంటే 49కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణం తెని.

2. జిరో, అరుణాచల్ ప్రదేశ్ - శాంతికాముకుల స్వర్గధామం జిరో. అరుణాచల్ ప్రదేశ్ లోని పురాతన, వింతైన పట్టణం జిరో. అప థని అనే గిరిజన తెగల పుట్టిల్లు. కనువిందు చేసే పైన్ చెట్లతో, పచ్చటి వరి పొలాలకు ప్రసిద్ధి. సాహసయాత్రికులకూ అనువైన ప్రదేశం ఇది. ట్రెక్కింగ్ ప్రియులకు అనువైన ప్రదేశం జిరో, సంతృప్తినిచ్చే ట్రెక్కింగ్ అనుభవంకానీ, అడవిలో క్యాంప్ చేయాలన్నా, వివిధరకాల అడవిజంతువులను దగ్గరగా చూడాలన్నా మీ ట్రెక్కింగ్ కోరిక ఏదైనా మిమ్మల్ని నిరాశపరచని ప్రదేశం జిరో. అతి దగ్గరి విమానాశ్రయం తేజ్ పూర్ ఎయిర్ పోర్ట్.

3. పటన్, గుజరాత్ - చారిత్రక ప్రాధాన్యమున్న ప్రదేశం పటన్. గతంలో ఆర్కియాలజిస్టుల పరిశోధనకు బాగా ఉపయోగపడిన ప్రదేశం. ఇక్కడి పురాతన దేవాలయాలే కాదు, దర్గాలు, జైనదేవాలయాలు కూడా ప్రసిద్ధమైనవే. సోలంకి సామ్రాజ్య కులదేవత దేవాలయం మార్గమధ్యలో కనిపిస్తుంది. వెయ్యేళ్ల పురాతన ఈ దేవాలయంలో కాళీమాతే సామ్రాజ్య రక్షణ చేస్తుందని చెబుతారు. మష్రూ వీవర్స్, పటోలా చీరలకు ప్రసిద్ధి పటన్. అహ్మాదాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి పటన్ కు చేరుకోవచ్చు. 

4. కాంగోజోడి, నహన్ -  హిమాలయ పర్వతా పాదాలదగ్గరుండే ప్రాంతం కాంగోజోడి. నగరజీవితపు హడావుడికి, కాలుష్యానికి దూరంగా ఉండే ప్రాంతం. ఒక కొత్త అనుభవాన్ని కోరుకునే వారికి, ప్రకృతి ప్రేమికులకు, సాహాసయాత్రికులకు నచ్చే ప్రదేశం కాంగోజోడి. ఢిల్లీనుండి 280 కిలోమీటర్ల దూరంలో ఉంది. బరోగ్, సోలన్ రైల్వేస్టేషన్లు కాంగోజోడి దగ్గర్లో ఉండే రవాణామార్గాలు.

5.మరవంథే, కర్నాటక - వర్జిన్ బీచ్ టౌన్ గా ప్రసిద్ధి. ఇక్కడి తెల్లరంగు ఇసుక బీచులు అనేక ఏళ్లనుండి మీ కోసమే ఎదురుచూస్తున్న ఫీలింగ్ ని కలిగిస్తాయి. ఈ బీచుల్లో నీటిలో ఆస్వాదించడానికి అనుకూలమైన సమయం సెప్టెంబర్ నుండి మార్చి మధ్యకాలం. ఈ పట్టణానికి ఆనుకుని కుడివైపు అరేబియా సముద్రం, ఎడమవైపు సుపర్ణికా నది ఉన్నాయి. ఈ బీచ్ కుండపురాకి దగ్గర్లో ఉంటుంది. ఉడిపి నుండి 50 కిలోమీటర్లు, బెంగళూరు నుండి 450 కిలోమీటర్ల దూరంలో ఉంది.