మహారాష్ట్ర ఎన్నికల పుణ్యమాని జాతీయ రాజకీయాలు ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారాయి. మారడమే కాదు నూతన సమీకరణాలకు కూడా తెర తీసింది. దేశవ్యాప్తంగా రకరకాల నూతన పొలిటికల్ ఈక్వేషన్స్ బయటకొస్తున్నాయి. 

తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ నూతన రాజకీయ సమీకరణాలు పొడచూపే ఆస్కారం కూడా మనకు కనపడుతుంది. మొన్నటి వరకు అంటే...శివసేన బీజేపీ మిత్రపక్షంగా ఉన్నంతవరకు కూడా, దేశ రాజకీయ సమీకరణలది ఒక లెక్క ఆతరువాత మరో లెక్క అన్నట్టుగా పరిస్థితులు మారాయి. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గనుక తీసుకుంటే... మొన్నమొన్నటి వరకు కూడా బీజేపీకి టీడీపీ దగ్గరయింది, జనసేన కూడా అదే బాట పట్టింది కాబట్టి టీడీపీ, బీజేపీ, జనసేనలు కలిశాయని ఈ మూడు పార్టీలు కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగుతాయని అంతా భావించారు. కాకపోతే... ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే మాత్రం రాజకీయ సమీకరణాలు ఎంత వేగంగా మారతాయి మనకు అర్థమవుతుంది.  

బీజేపీకి వరుసగా మిత్రులు దూరమైపోతున్నారు. శివసేన గుడ్ బై చెప్పి మహారాష్ట్రలో వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు పార్లమెంట్ లో కాంగ్రెస్, డీఎంకేల తరువాత 22 లోక్ సభ స్థానాలతో టీఎంసీ తో కలిసి మూడవ స్థానాన్ని పంచుకుంటుంది.  

లోక్ సభలో ఏకంగా 22మంది ఎంపీలతో మూడో అతిపెద్ద పార్టీగా ఉన్న వైసీపీ, రాజ్యసభలో ఇద్దరు ఎంపీల బలంతో మాత్రమే ఉంది.  కాకపోతే వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఆంధ్రప్రదేశ్ పరిధిలోని నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. 

ఇందులో ఒక్క బెర్తు కూడా టీడీపీకి దక్కే ఆస్కారం లేదు. వైసీపీ తనకున్న 151 మంది ఎమ్మెల్యేల బలంతో నలుగురు రాజ్యసభ సభ్యులను గెలిపించుకొని ఆ సంఖ్యను 6కు పెంచుకోనుంది.  రాజ్యసభలో 6సీట్లు అంటే చిన్న విషయం కాదు. 

రాజ్యసభలో తగినంత బలం లేకపోవడం వల్ల బిల్లులు పాస్ చేయించడంలో కష్టాలు పడుతున్న బీజేపీకి వైసీపీని చేర్చుకుంటే బలం చేకూరుతుందని భావిస్తోందట. ఇది బీజేపీకి ఆశ పుట్టిస్తోంది . ఇలా రాజ్యసభలో బలాన్ని పెంచుకునేందుకు బీజేపీ టీడీపీకి చెందిన 4గురు రాజ్యసభ సభ్యులను కూడా చేర్చుకుంది. 

Also read: నాడు లేనిదే.. నేడు ఉంటుంది: జగన్ కు అంత వీజీ కాదు

ప్రస్తుత పౌరసత్వ సవరణ చట్టం వల్ల ఇంకొంతమంది మిత్రులు దూరమయ్యే ప్రమాదం కూడా ఉంది. తెరాస ఇప్పటికే ఈ బిల్లును వ్యతిరేకించింది. రానున్న కాలంలో ఈశాన్య భారతంలో ఈ ఎఫెక్ట్ మనకు కనపడనుంది. ఈ నేపథ్యంలో వైసీపీ అవసరం బీజేపీకి ఖచ్చితంగా అవసరమొచ్చేలా మనకు కనపడుతుంది. 

అందుకోసమే వైసీపీని ఎన్డీఏ లో చేర్చుకునేందుకు బీజేపీ ఆసక్తి చూపెడుతున్నట్టు సమాచారం. వైసీపీ గనుక ఎన్డీఏలో చేరితే వారికిచ్చే పదవులపై కూడా బీజేపీ అధిష్టానం ఇప్పటికే వైసీపీకి తెలియపరిచినట్టు వార్తలు వస్తున్నాయి. 

గత పర్యాయం అన్నాడీఎంకే కి ఇచ్చినట్టు ఈ సరి వైసీపీకి డిప్యూటీ స్పీకర్ పదవిని ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ డిప్యూటీ స్పీకర్ పదవితోపాటు మరో కాబినెట్ బెర్తును కూడా ఆఫర్ చేసిందట బీజేపీ. 

ఇక ఈ పోస్టులకు సెలెక్షన్లు కూడా జరిగిపోయాయనే టాక్ వైసీపీ వర్గాల్లో వినిపిస్తుంది. అమలాపురం నుంచి గెలిచిన దళిత ఎంపీ చింతా అనురాధను లోక్ సభ డిప్యూటీ స్పీకర్ గా చేస్తారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. 

ఇక కేబినెట్ బెర్తు కోసం అందరూ ఊహించినట్టే, వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డిని మోడీ కేబినెట్ లో మంత్రిని చేయవచ్చని అంటున్నారు.

జగన్ ఎన్డీఏలో చేరుతారా...?

ఇక జగన్ మోహన్ రెడ్డికి ఎన్డీఏలో చేరడానికి ప్రధానమైన అడ్డంకి ఏదైనా ఉందంటే అది ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా ఎవరు ప్రకటిస్తే వారికి మద్దతిస్తానని జగన్ ఇప్పటికే స్పష్టం చేసారు. మరి కేంద్రం జగన్ పెట్టిన ఈ డిమాండ్ కు గనుక తలొగ్గితే... మిగిలిన అన్ని రాష్ట్రాలు కూడా ఇదే తరహా అజెండాని పైకెత్తుకుని ప్రమాదం లేకపోలేదు. 

కాకపోతే ఏదో హామీలాగ ఇచ్చి, దానికి సంబంధించిన విధి విధానాలు ప్రకటించకుండా కాలయాపన చేసి టెక్నికల్ కారణాలను కూడా బీజేపీ చూపెట్టవచ్చు. కాకపోతే ఇలా ప్రకటన వచ్చిన వెంటనే బీహార్, ఒరిస్సా లాంటి రాష్ట్రాలు వెంటనే పెద్ద ఎత్తున ఉద్యమాలు లేవనెత్తుతాయి. 

ఈ పరిస్థితుల్లో బీజేపీ ఆ సాహసం చేస్తుందేమో చూడాలి. ఒకవేళ ఏపీ కి గనుక ప్రత్యేక హోదా ఇస్తే ఈ రాష్ట్రాలకన్నా ముందుగా గళమెత్తేది తెరాస ప్రభుత్వమే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే... పరిశ్రమలకు అక్కడ పన్ను మినహాయింపులు ఉంటాయి కాబట్టి అక్కడికి తరలి వెళ్లే ఆస్కారం ఉంటుంది. 

ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం మిన్నకుండి కూర్చోదు. అందునా బీజేపీతో నేరుగా తలపడడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఈ అందివచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోదు. 

Also read: వైఎస్ జగన్ పాలనపై 'రెడ్డి' ముద్ర: పవన్ కల్యాణ్ బాటలో చంద్రబాబు

బీజేపీ గనుక ఈ ప్రకటన చేయకుండా వైసీపీ ఎన్డీఏలో చేరితే... ఆంధ్రప్రదేశ్ లోని ప్రతిపక్షాలకు నూతన అస్త్రాన్ని జగన్ స్వయంగా అందించినట్టవుతుంది. కాబట్టి జగన్ ఇప్పుడు ఇస్తున్నట్టే బయటనుంచి బీజేపీకి అవసరమైన మద్దతు ఇవ్వాలని భావిస్తున్నాడు.

దానితోపాటు తనపై ఉన్న కేసులకు కూడా ఒక శాశ్వత పరిష్కారం దొరకాలంటే బీజేపీతో సఖ్యతగా ఉండడం మంచిదనే భావనలో జగన్ ఉన్నట్టు మనకు కనపడుతుంది. 

కాకపోతే సిద్ధాంతపరంగా అత్యంత సన్నిహితమైన శివసేన పార్టీయే ఎన్డీఏ నుంచి బయటకు వెళ్ళిపోయినా తరుణంలో వైసీపీ బయట నుంచి మద్దతు ఇస్తున్నప్పటికీ దానిని కన్ఫర్మ్ చేయాలంటే వైసీపీని భాగస్వామిగా చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. 

ఇన్ని ఈక్వేషన్స్ నేపథ్యంలో జగన్ బీజేపీ ఒత్తిడికి తలొగ్గి ఎన్డీఏలో చేరతారా లేదా తనకు అత్యంత లాభదాయకమైన బయటనుంచి మద్దతు ఇచ్చే పద్ధతినే కొనసాగిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.