వైఎస్ జగన్ పాలనపై 'రెడ్డి' ముద్ర: పవన్ కల్యాణ్ బాటలో చంద్రబాబు
ఏపీ సీఎం వైఎస్ జగన్ పాలనపై రెడ్డి ముద్ర వేయాలనే వ్యూహంలో భాగంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాటలో నడుస్తున్నట్లు కనిపిస్తున్నారు. చంద్రబాబు తాజా వ్యాఖ్యలు ఆ విషయాన్ని తెలియజేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కునే విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యూహాన్నే అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. వైఎస్ జగన్ పాలను రెడ్ల పాలనగా, ఆ పాలన రెడ్లకు మాత్రమే అనుకూలమైందిగా చిత్రీకరించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. వైఎస్ జగన్ పాలనపై రెడ్ల ముద్ర వేయాలనే ఎత్తుగడను ఎంచుకున్నట్లు కనిపిస్తున్నారు.
తాజాగా, గుంటూరులో జరిగిన ఓ మైనర్ బాలికపై అత్యాచార సంఘటనను ప్రస్తావిస్తూ చంద్రబాబు జగన్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మైనర్ బాలికను పరామర్శించి, టీడీపీ తరఫున ఆర్థిక సాయం అందించి ఆ వ్యాఖ్యలు చేశారు. దిశ కేసులోని నిందితులను కాల్చేసినందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ కు హ్యాట్సాఫ్ చెప్పిన జగన్ దళితులపై రెడ్లు అత్యాచారం చేస్తే స్పందించరా అని ప్రశ్నించారు.
Also Read: కాల్చేస్తే తెగ పొగిడారు, రెడ్లు రేప్ చేస్తే కదలరా: వైఎస్ జగన్ మీద చంద్రబాబు ఫైర్
మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు లక్ష్మారెడ్డి. దాన్ని ఆసరా చేసుకుని చంద్రబాబు ఆ వ్యాఖ్యలు చేశారు. దీన్ని బట్టి జగన్ పాలనపై రెడ్ల ముద్ర వేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నారు.
ఇంతకు ముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా జగన్ మీద రెడ్ల ముద్ర వేయడానికే ప్రయత్నించారు. జగన్ రెడ్డి అంటూ మాత్రమే పిలుస్తానని ఆయన చెప్పారు. జగన్ పాలన రెడ్లకు అనుకూలంగా ఉందనే ఉద్దేశంతో ఆయన వ్యాఖ్యలు చేశారు.
మిగతా కులాలను జగన్ కు వ్యతిరేకంగా మలిచే వ్యూహంలో భాగంగానే చంద్రబాబు గానీ పవన్ కల్యాణ్ గానీ ప్రయత్నిస్తున్నారని వారి వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. నిజానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు కులాల ఆధిపత్యం ఉందనే విశ్లేషణ ఉంది.
రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలు మాత్రమే అధికారాన్ని పంచుకుంటున్నాయని సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం పార్టీని కమ్మ సామాజిక వర్గానికి ప్రతినిధిగా భావిస్తే, జగన్ నాయకత్వంలోని వైసీపీని రెడ్డి సామాజిక వర్గం ప్రతినిధిగా భావిస్తున్నారు.
సామాజిక విశ్లేషకుల అభిప్రాయం చాలా వరకు నిజమే కానీ ఆ రెండు పార్టీలు కూడా ఇతర సామాజిక వర్గాలను తమ వైపు ఏ మేరకు తిప్పుకుంటారనే అంశంపై అధికారం బదాలయింపు జరుగుతుంది. రెడ్డి లేదా కమ్మ సామాజిక వర్గాల్లో ఏది ఆధికారంలోకి రావాలనే విషయంలో కాపు సామాజిక వర్గం నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని అంటారు.
పవన్ కల్యాణ్ అవునన్నా, కాదన్నా జనసేన పార్టీని కాపు సామాజిక వర్గం ప్రతినిధిగానే చూస్తున్నారు. అయితే, గత ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేయడం వల్ల వైసీపీకి కలిసి వచ్చిందనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు, జనసేన, టీడీపీ ఏకమై వైసీపీని ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నాయనే అభిప్రాయం బలపడుతూ వస్తోంది.