నాడు లేనిదే.. నేడు ఉంటుంది: జగన్ కు అంత వీజీ కాదు
పాదయాత్రలో జగన్ చెప్పినట్టుగా స్కూల్ రూపురేఖలు మార్చడం అంత సులువైన పనికాదు. ఈరోజు మీ బడి ఫొటోలు తీసి పెట్టుకోండి రెండేళ్ల తర్వాత మళ్లీ ఇదే రోజున ఫొటో తీసుకోండి మార్పును చూస్తారు అని చెప్పిన జగన్.
చరిత్ర ఎప్పటికీ చరిత్రే. పునరావృతం అవుతుంది... లిఖించబడుతుంది తప్ప, చరిత్రను చెరిపివేయలేం. చరిత్ర లిఖించాలన్నా తిరగరాయాలన్నాధైర్యసాహసాలు కావాలి. అలాంటి సాహసోపేత నిర్ణయం వైపుగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ ముందడుగు వేస్తున్నారని చెప్పక తప్పదు. మనబడి నాడు-నేడు అని ఒక చారిత్రక అధ్యాయం లిఖించబోతున్నారు. మీ బడి రూపురేఖలు మారుస్తానని ప్రమాణ స్వీకారం రోజున చెప్పిన జగన్.. బాలల దినోత్సవం రోజున అందుకు శ్రీకారం చుడుతున్నారు.
అంత వీజీ కాదు..
పాదయాత్రలో జగన్ చెప్పినట్టుగా స్కూల్ రూపురేఖలు మార్చడం అంత సులువైన పనికాదు. ఈరోజు మీ బడి ఫొటోలు తీసి పెట్టుకోండి రెండేళ్ల తర్వాత మళ్లీ ఇదే రోజున ఫొటో తీసుకోండి మార్పును చూస్తారు అని చెప్పిన జగన్.. ఆవైపుగా మార్పుకు పూనుకుంటున్నారు. రెండేళ్లలో స్కూల్ ని మారుస్తామంటే రంగులేస్తామని జగన్ ఉద్దేశ్యం కాదు.
బడికి మౌలిక సదుపాయాలు కల్పించడం, హాజరు శాతాన్ని పెంచడం, వంద శాతం ఉత్తీర్ణత సాధించడం, ప్రైవేటు బడులకు దీటుగా చదువులు చెప్పడం, పిల్లల్లేక బోసిపోయిన బడుల బయట అడ్మిషన్ల కోసం క్యూలు కట్టేలా చేయడం... ఇవన్నీ జగన్ ముందున్న లక్ష్యాలు. ఇప్పుడున్న కార్పొరేట్ స్కూళ్ల నడుమ ఇదంతా చేయడం చెప్పినంత ఈజీ కాదని జగన్ కి కూడా తెలుసు. అయినా ముందడుగు వేశారంటే ఆయనో ప్రణాళికతో ఉన్నారనేది సుస్పష్టం.
Also Read: తెలుగు భాషపై పవన్ కల్యాణ్ మాట: అసలు విషయం ఇదీ.
ఆర్థిక భారం అని తెలిసినా పల్లెల్లో కూడా తల్లిదండ్రులు తమ పిల్లల్ని కాన్వెంట్‌లకే పంపిస్తున్నారు. వాళ్లని ఉన్నట్టుండి గవర్నమెంట్ స్కూల్‌కి పంపమంటే నవ్వుతారు. మనబడిలోనూ ఫ్యాన్లు, బెంచీలు, మినరల్ వాటర్, మధ్యాహ్న భోజనం ఉందంటే ఎగాదిగా చూస్తారు. ఇదంతా జగన్‌కి తెలియనిదేమీ కాదు.
అయితే ఏం చేయాలి..
నాడు- నేడు కార్యక్రమం అనేది ఒక ప్రణాళిక. ఒక్కరోజులో జరిగే మార్పు ఎంతమాత్రం కాదు. ఇదొక పరిణామక్రమం. అధికారులు, నాయకులు సమన్వయంతో శ్రద్ధాశక్తులతో పనిచేస్తే తప్ప జగన్ ఆశ నెరవేరదు. జగన్ కోరుకున్నట్టు సర్కారు బడులు కళకళలాడాలంటే ఒక తపస్సు చేయాలి. అలాంటి యజ్ఞమే ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా చేయబోతున్నాడు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కష్టాలు, అవసరాలు నెరవేర్చడం ద్వారా సర్కారు బడులను బలోపేతం చేయాలన్నది సీఎం వైఎస్ జగన్ సంకల్పం. ఆ సంకల్పాన్ని సిద్ధింపజేసుకోడంలో భాగమే అమ్మ ఒడి, సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం.
Also Read: పవన్ పై వైఎస్ జగన్ ముగ్గురు భార్యల వ్యాఖ్యలు: మిగతా అంతా.
ఎలాగో చూద్దాం..
అమ్మ ఒడి పథకం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులను చదవుల వైపు మళ్లించాడు. ఆర్థిక భారంతో పిల్లల్ని చదువులకు దూరంగా ఉంచే తల్లిదండ్రులు తమ పిల్లల్ని కూడా ఉన్నత చదువులు చదివించాలనే కలలు కనేలా చేయగలిగాడు. ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టడం ద్వారా ఖర్చులకోర్చి దూరాభారం ఉన్న కాన్వెంట్‌లకి పిల్లల్ని పంపే తల్లిదండ్రులు కూడా ఇంగ్లిష్ మీడియం మనూరి బడిలోనే ఉందిగా.. అంత ఖర్చు పెట్టి అంత దూరం ఇరుకు బడిలో మన పిల్లల్ని ఎందుకు చదివించాలని అని ఆలోచించడం మొదలు పెడుతారు. వారంతా తమ పిల్లల్ని సర్కారు బడులకు పంపడం మొదలు పెడుతారు. దీని ద్వారా గవర్నమెంట్ స్కూళ్లను విద్యార్థులతో కళకళలాడేలా చేయాలన్నమొదటి ప్రయత్నం దాదాపు నెరవేరినట్టే.
ఇప్పుడు ఏం చేయబోతున్నారు..
బడులన్నీ పిల్లలతో కళకళలాడుతాయి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆయా పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఇంగ్లిష్ మీడియం అంటే భయపడకుండా టీచర్లు విద్యాబోధన చేయాలి. ఇప్పుడు వైఎస్ జగన్ అదే చేయబోతున్నారు. అన్ని బడులను తీర్చిదిద్దుతున్నారు. టీచర్లకు ప్రత్యేకంగా ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు బెరుకు లేకుండా ఇంగ్లిష్‌లో బోధించేలా తర్ఫీదు ఇస్తున్నారు. బడుల్లో ఉండే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్ల రిక్రూట్‌మెంట్ చేయబోతున్నారు.
Also Read: బడుల్లో ఇంగ్లీష్ మీడియం: వైఎస్ జగన్ నిర్ణయంలోని ఆంతర్యం ఇదే...
రెండేళ్లలో మార్పు సాధ్యమా
ఆలోచనల్లో మార్పు వచ్చినప్పుడు ఆచరణలో మార్పు తీసుకురావడం చాలా సులువు. అదే ఇక్కడ జగన్ పాయింట్ కూడా. రెండేళ్లలో ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్టుగా చేయడానికి అంశాల వారీగా చర్యలు తీసుకున్నారు. బడిలో విద్యార్థుల సంఖ్య పెరిగితే పోటీ అదే పెరుగుతుంది. టీచర్లలో నిబద్ధత, జవాబుదారీతనం పెంచడం ద్వారా మార్పు ఖచ్చితంగా సాధ్యమే..
సర్కారు బడులను మార్చాలన్న సంకల్పం నాడు నాయకుల్లో లేదు.. అదే నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌లో ఉంది.