తాజాగా ఒక మూడు రోజుల కింద సర్వే అఫ్ ఇండియా విడుదల చేసిన కొత్త భారతీయ పొలిటికల్ మ్యాప్ పై ఆంధ్రప్రదేశ రాజధాని అమరావతి ప్రత్యక్షమయింది. అమరావతిని  ఆంధ్రప్రదేశ్ రాజధానిగా పేర్కొనడం కొత్త విషయం కాకపోవచ్చు, కానీ హోమ్ శాఖ ఈ నెల మొదటివారంలో, జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 ఎత్తివేసిన తరువాత రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన అనంతరం, ఆ విభజనను అధికారికంగా ప్రకటిస్తూ, కేంద్ర హోమ్ శాఖ ఒక మ్యాప్ ను విడుదల చేసింది. అందులో అమరావతి మిస్సింగ్. 

ఆ మ్యాప్ లో ఆంధ్రప్రదేశ్ రాజధానిని పేర్కొనలేదు. దానిపైన తీవ్ర దుమారం చెలరేగింది. అధికార వైసీపీ ఏమో, చంద్రబాబు ప్రభుత్వం నోటిఫై చేయలేదు కాబట్టే అమరావతికి ఈ దుస్థితి అని ప్రకటిస్తే, ప్రతిపక్ష టీడీపీ ఏమో వైసీపీ రాజధానిని మార్చే కుట్రలో భాగంగానే ఇలా అమరావతిని గుర్తించొద్దని కేంద్రానికి చెప్పిందని వాదించారు. 

Also read: మ్యాప్‌లో అమరావతి గల్లంతు: చంద్రబాబు సరే, ఆరు నెలల జగన్ వైఖరి వల్లనే సందేహాలు

ఇదిలా ఉండగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ జీరో హౌర్ లో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తించకపోవడం కేవలం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే అవమానం కాదని, అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోడీకి కూడా అవమానమే అని అన్నాడు. గల్లా జయదేవ్ ఈ విషయం పై పార్లమెంటులో ప్రసంగించింది 21 నవంబర్ రోజున. 

వెంటనే తరువాతి రోజే ఈ వివాహాయమై కిషన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా, అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా సర్వే అఫ్ ఇండియా విడుదల చేసిన నూతన మ్యాప్ ను పోస్ట్ చేసారు. కేవలం ఒక్క రోజులోనే ఈ విషయానికి పరిష్కారం చూపెట్టగలిగామని, టీడీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మరీ తమ సత్తా ఇది అని చెప్పుకోవడం మొదలుపెట్టారు. 

ఇక్కడిదాకా బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. మొదటగా, కేంద్ర ప్రభుత్వం ఇంతకు ముందు అమరావతిని గుర్తించకుండా ఇప్పుడెందుకు గుర్తించింది? దీనికి సమాధానం కావాలంటే ఆంధ్రప్రదేశ పునర్విభజన చట్టం లో దొరుకుతుంది. ఈ పునర్విభజన చట్టం ప్రకారం, 10 సంవత్సరాలపాటు హైదరాబాద్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు ఉమ్మడి రాజధానిగా కొనసాగనుంది. చంద్రబాబు ఇక్కడి నుండి ఎన్నికలు పూర్తవగానే ఇంకా వెళ్లిపోవడం జరిగింది. ఎందుకు వెళ్లిపోయారు అనేది అప్రస్తుతం కానీ,వెళ్లిపోయారు. 

చంద్రబాబు వెళ్ళిపోయే నాటికి ఇంకా జ్యూడిషరీ విభజన కాలేదు, హై కోర్టు ఉమ్మడిగానే కొనసాగింది. ఎప్పుడైతే హై కోర్టు కూడా విభజన జరిగిందో, వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి సవరణ చేయాల్సి ఉంది. కానీ అది జరగలేదు. 

చంద్రబాబు హయాంలోనూ జరగలేదు, ఆ తరువాత జగన్ హయాంలోనూ ఈ సవరణ జరగలేదు. ఈఆలస్యాల వల్ల ఉమ్మడిగానే కొనసాగింది. ఈ నెల మొదట్లో ఇలా విడుదల చేసిన మ్యాప్ లో అమరావతిని పేర్కొనకపోవడం తప్పే కాకపోతే అఫీషియల్ గా ఎక్కడా అమరావతిని నోటిఫై చేయకపోబట్టి అలా జరిగింది. 

ఇప్పుడు అసలు విషయానికి వద్దాము. మరి ఇప్పుడెలా గుర్తించారు అమరావతిని. చంద్రబాబు ఎమన్నా ప్రతిపక్ష నాయకుడిగా నోటిఫై చేశారా, లేదా జగన్ మోహన్ రెడ్డి ఎమన్నా చట్టం చేశారా? ఎలా ఇప్పుడు ఉన్నపళంగా ఇలా గుర్తించారు అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. 

చంద్రబాబు పైన నెపం తోసేసిన వైసీపీ వారంతా ఇప్పుడు ఆ విషయం గురించి మాట్లాడడం లేదు. చంద్రబాబు ఏకంగా మరుసటి రోజే అమిత్ షా, నరేంద్రమోడీలకు ధన్యవాదాలు తెలుపుతూ, ఒక లేఖ కూడా రాశారు. ఈ అన్నిటిని గనుక పరిశీలిస్తే రెండు విషయాలకు ఆస్కారం ఉంది. 

మొదటగా, తమకు తెలియగానే బీజేపీ సత్వరం స్పందించి ఆంధ్రప్రదేశ్ కు దక్కాల్సిన గౌరవాన్ని దక్కించింది అనే వాదన. ఆంధ్రప్రదేశ్ లో పాగా వేయాలని విపరీతంగా ప్రయత్నం చేస్తున్న బీజేపీ ఇలాంటి చర్యల వల్ల ప్రజలకు చేరువవ్వాలని చూస్తుంది. 

Also read: ఏపీ రాజధానిగా అమరావతి గుర్తింపు: కొత్త మ్యాప్ విడుదల చేసిన కేంద్రం

ఇక రెండో అంశం, టీడీపీతో సాన్నిహిత్యం. టీడీపీ ఎంపీ అడగగానే స్పందించడం, దానికి ఏకంగా కేంద్ర మంత్రి ఒక్కరోజులోనే తప్పును సవరించడం చక చక జరిగిపోయాయి. అంతే కాకుండా, మరుసటి రోజు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా లకు ధన్యవాదాలు తెలుపుతూ లేఖరాయడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. 

బీజేపీకి టీడీపీ దగ్గరవుతోందా అనే అంశాన్ని పరిశీలిస్తే ఆవునేమో అనే సందేహం మాత్రం కలుగక మానదు. తాజాగా పార్లమెంటరీ  కేంద్రంలోని సలహా సంప్రదింపుల కమిటీల్లో ఐదుగురు టీడీపీ ఎంపీలకు చోటు లభించడం విశేషం. సాదా సీదా పదవులైనా సరే గత ఎన్నికల్లో అంతలా దుమ్మెత్తిపోసిన టీడీపీ పార్టీకి బీజేపీ సర్కారు ఇలా పదవులు కట్టబెట్టడం ఇరు పార్టీల మధ్య గ్యాప్ తీరిపోయిందా అనే అనుమానాలను మాత్రం కలిగించక మానదు. 

మొత్తానికి ఇలా చూసుకుంటే మాత్రం టీడీపీకి ఒకింత దగ్గరవుతున్నట్టు కనపడుతున్నప్పటికీ, కేంద్రం జగన్ మోహన్ రెడ్డిని కూడా మరీ అంత దూరం పెట్టినట్టుగా కూడా లేదు. మొత్తంగా గనుక చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పట్టు కోసం చేస్తున్న ప్రయత్నాలను ఇరు పార్టీలు తమకు అనుకూలంగా వాడుకుంటున్నట్టు మాత్రం అర్థమవుతుంది.