భారత ప్రభుత్వం విడుదల చేసిన కొత్త భారత చిత్రపటం నుంచి అమరావతి మాయమైంది. దీంతో అధికార వైఎస్సార్ కాంగ్రెసు, ప్రతిపక్ష తెలుగుదేశం మధ్య వివాదం రాజుకుంటోంది. కొత్త ఇండియన్ మ్యాప్ ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసింది. అందులో కొత్త కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూ కాశ్మీర్, లడక్ లను చేర్చారు.

అన్ని రాష్ట్రాల రాజధానుల పేర్లను కూడా చిత్రపటంలో చేర్చారు. అయితే, ఆంధ్రప్రదేశ్ రాజధాని మాత్రం కనిపించడం లేదు. అమరావతిని అందులో చేర్చలేదు. 

Also read: రాజధానిపై జగన్ సంచలన నిర్ణయం: అమరావతిపై నీలినీడలు

ఈ విషయంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. అధికారపక్షమేమో ప్రతిపక్షంపైన విమర్శలు గుప్పిస్తుంటే ప్రతిపక్షమేమో అధికారపక్షం రాజధానిని తరలించాలనే దుర్భుద్ధితోనే ఇలా చేశారని ఆరోపిస్తుంది. 

ఈ నేపథ్యంలో అసలు ఇలా ఆంధ్రప్రదేశ్ రాజధానిని చూపెట్టకపోవడానికి వాస్తవ కారణాలు తెలియకున్నా, కోన్ని ఊహాజనిత అంచనాలను మాత్రం వేయవచ్చు. 

మొదటగా చట్టానికి సంబంధించినది. ఆంధ్రప్రజేష్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 2014 నుండి 10 సంవత్సరాలపాటు హైదరాబాద్ ఇరు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుంది. హైదరాబాద్ నుండి చంద్రబాబు రాష్ట్రం విడిపోగానే వెళ్ళిపోయినా హైదరాబాద్ మాత్రం చట్టప్రకారంగా ఉమ్మడి రాజధానిగానే కొనసాగుతుంది. 

వాస్తవానికి విభజన చట్టాన్ని సవరణ చేసి ఉండాల్సింది. చంద్రబాబు పాలన అమరావతి నుంచి చేసినప్పటికీ మొన్నటివరకు హై కోర్ట్ విభజన కాలేదు. ఇప్పుడు మిగిలిన హై కోర్ట్ విభజన కూడా పూర్తయ్యింది. ఇక్కడ ఉన్న భవనాలను జగన్ తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించేసాడు. ఇప్పటికైనా విభజన చట్టానికి సవరణ చేయాల్సింది ఇంకా చేయలేదు. 

Also read: మనోభావాలపై క్రీడ: జగన్ నిర్ణయం బెడిసి కొడుతుందా?

మరో సాధ్యమైన కారణం ఏదన్నా ఉందంటే అది బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్య. చంద్రబాబు పాలన సాగించాడు కానీ అమరావతిని ఏనాడు కూడా నోటిఫై చేయలేదు. మునిసిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ గారు ప్రెస్ మీట్ లో చెప్పిన మాటలు ఇవి. 

సరే 5 సంవత్సరాలలో చంద్రబాబు చేయలేదు, మరి జగన్ సర్కార్ పీఠమెక్కి కూడా 6నెలలు దాటింది కదా! మరి జగన్ ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు నోటిఫై చేయలేదు? దీనికి మాత్రం సదరు మంత్రిగారు సమాధానం నేరుగా చెప్పకుండా గత ప్రభుత్వం వల్లే ఈ దుస్థితి దాపురించిందంటూ దాటవేశారు. జగన్ సర్కార్ నోటిఫై చేయకపోవడానికి కారణాలేంటో వారికే తెలియాలి. 

ఈ రెండో వాదన నుంచే మూడవ కారణం ఉద్భవిస్తుంది. అదే జగన్ సర్కార్ రాజధానిని మార్చే ఆలోచనలో ఉంది. అందుకనే నోటిఫై చేయలేదు ఇంతవరకు అమరావతిని. కేంద్రం కూడా జగన్ ఈ నిర్ణయం తీసుకోబోతున్నాడని తెలిసే(జగన్ ఎం నిర్ణయం తీసుకున్నా కేంద్ర ప్రభుత్వానికి చెప్పే తీసుకుంటాడనే విజయసాయి రెడ్డి గారి మాటలను గుర్తు చేసుకోవాలి)కేంద్రం కూడా గుర్తించలేదు. 

ఇండియన్ మ్యాప్ లో అమరావతి లేకపోవడాన్ని బట్టి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజధానిని మరో ప్రాంతానికి తరలిస్తున్నారనేది అర్థమవుతోందని టీడీపీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య అన్నారు. రాజధాని తరలింపుపై కేంద్రానికి తన అభిప్రాయాన్ని జగన్ కు చెప్పి ఉంటారని ఆయన అన్నారు. సవరించిన భారత చిత్రపటంలో అమరావతి లేకపోవడానికి కారణమదే అయి ఉంటుందని ఆయన అన్నారు. 

రాజధాని అమరావతికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారని, గత ఐదేళ్లుగా అధికారిక కార్యలాపాలన్నీ అమరావతి నుంచే నడుస్తున్నాయని, కేంద్రానికీ రాష్ట్రానికీ మధ్య సమాచార వినిమయం కూడా అక్కడి నుంచే జరుగుతోందని ఆయన చెప్పారు.

రాజధాని పేరు లేకుండా ఆంధ్రప్రదేశ్ చిత్రపటంలో చోటు చేసుకోవడం దురదృష్టకరమని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణా రెడ్డి అన్నారు. దానికి చంద్రబాబు నాయకత్వంలోని గత టీడీపీ ప్రభుత్వమే కారణమని ఆయన అన్నారు. అమరావతిలో శాశ్వత నిర్మాణాలను కాకుండా తాత్కాలిక నిర్మాణాలను చేపట్టారని, అమరావతిని రాజధానిగా పేర్కొంటూ గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని ఆయన అన్నారు.

ఇలా అందరూ తామంటే తాము ఈ చర్యకు కారణం కాదని, అవతలి వారిపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఏది ఏమైనా భారతదేశ పొలిటికల్ మ్యాప్, అదికూడా ఆర్టికల్ 370 రద్దు తరువాత కేంద్రం అధికారికంగా విడుదల చేసిన మ్యాప్. దీంట్లో ఇలా ఆంధ్రప్రదేశ్ రాజధానిని గుర్తించకపోవడం మాత్రం బాధాకరం.