న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని గుర్తిస్తూ కేంద్ర హోంశాఖ సరికొత్త ఇండియా మ్యాప్ ను విడుదల చేసింది. ఏపీ రాజధాని అమరావతిని మార్క్ చేస్తూ సర్వే ఆఫ్ ఇండియా కొత్త ఇండియా మ్యాప్ ను శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. 

ఇటీవలే కేంద్ర హోంశాఖ ఇండియా మ్యాప్ ను విడుదల చేసింది. ఆ మ్యాప్ లో జమ్ముకశ్మీర్, లడఖ్ ప్రాంతాలను గుర్తించిన కేంద్రం ఏపీ రాజధాని అమరావతిని మాత్రం గుర్తించలేదు. 
దాంతో ఏపీ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. భారతదేశం యెుక్క మ్యాప్ లో ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకపోవడం తమను అవమాన పరిచినట్లేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ ప్రజలు. 

ఇకపోతే గురువారం ఇదే అంశంపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్ సభలో నిలదీశారు. కేంద్ర హోంశాఖ విడుదల చేసిన భారతదేశ చిత్రపటంలో అమరావతి లేకపోవడం చూసి ఆశ్చర్యానికి గురయ్యానని తెలిపారు. అమరావతిని మ్యాప్ లో చూపించకపోవడం ఏపీ ప్రజలను అవమాన పరచడమే కాకుండా ప్రధాని నరేంద్రమోదీని సైతం అవమానించినట్లేనని గల్లా జయదేవ్ ఆరోపించారు. 

అమరావతి లేని ఇండియా మ్యాప్ విడుదల చేస్తారా..?: కేంద్రంపై గల్లా జయదేవ్ ఫైర్

ఏపీ రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసింది ప్రధాని నరేంద్రమోదీయేనన్న విషయాన్ని కేంద్రం గుర్తుంచుకోవాలని సూచించారు. ఇప్పటికైనా కేంద్రం చొరవ చూపి అమరావతి రాజధానితో కూడాని కొత్త మ్యాప్ ను విడుదల చేయాలని కోరిన సంగతి తెలిసిందే. 

ఇకపోతే ఇటీవల కేంద్రప్రభుత్వం విడుదల చేసిన మ్యాప్ లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పడ్డ జమ్మూ కశ్మీర్, లడఖ్ లకు చోటు కల్పించింది. అయితే ఒక రాష్ట్రం కనుమరుగైనప్పటికీ రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు జమ్ము కశ్మీర్ గుర్తించింది. 

దాంతో ఇప్పటి వరకు ఉన్న 29 రాష్ట్రాలు కలిగిన భారతదేశం కాస్త 28 రాష్ట్రాలు కలిగిన దేశంగా మారిపోయింది. 2014 కు ముందు ఎలా అయితే  28 రాష్ట్రాలతో కూడిన భారతదేశంలాగ మారిపోయింది. తెలంగాణ అనంతరం దేశంలోని రాష్ట్రాల సంఖ్య 29కి చేరుకుంది. అయితే జమ్ముకశ్మీర్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారడంతో ఒక స్థానం తగ్గి 28కి చేరుకుంది.