PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముంబై పర్యటనకు ముందు భద్రతా పరంగా కీలక ఘటన చోటుచేసుకుంది. మోదీ పాల్గొననున్న కార్యక్రమ స్టేజ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

భద్రతా తనిఖీల్లో అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు

ఈ ఘటన సోమవారం అర్థరాత్రి చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రధాని మోదీ కార్యక్రమానికి సంబంధించి భద్రతా ఏర్పాట్లలో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కదులుతున్నట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌ (BKC)లో ఉన్న నితా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్‌ (NMACC) పరిసరాల్లో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. అనుమానం రావడంతో పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు ఉన్న బాడీగార్డును కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ బాడీగార్డు వద్ద తుపాకీ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

నకిలీ PMO ఐడీ.. తుపాకీ కూడా స్వాధీనం

పోలీసుల వివరాల ప్రకారం.. అరెస్టైన 24 ఏళ్ల రోహన్ పారేఖ్ తాను ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేసే అధికారినని చెప్పుకున్నాడు. అయితే అతని గుర్తింపు కార్డును పరిశీలించగా అది నకిలీదని తేలింది. మరోవైపు, ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పద ప్రభుత్వ గుర్తింపు కార్డును ఉపయోగించి జియో వరల్డ్ ప్లాజాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద తుపాకీ కూడా ఉన్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే స్వాధీనం చేసుకున్న తుపాకీకి లైసెన్స్ ఉన్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. తుపాకీకి సంబంధించిన వ్యవహారంలో ఇద్దరిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

మోదీ పర్యటనతో సంబంధం లేదన్న పోలీసులు

ఈ ఘటనపై భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ప్రధాని మోదీ ముంబైకి చేరుకునే ముందు ఈ ఘటన చోటుచేసుకోవడంతో అధికారులు మరింత జాగ్రత్తలు తీసుకున్నారు. నిందితులు ఆయుధంతో, నకిలీ గుర్తింపు కార్డులతో కార్యక్రమ పరిసరాల్లోకి ఎందుకు ప్రవేశించేందుకు ప్రయత్నించారనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ముంబై క్రైమ్ బ్రాంచ్‌ ఈ కేసు దర్యాప్తును చేపట్టింది. నిందితుల ఉద్దేశం ఏంటి? వారు ఎవరితో సంబంధాలు కలిగి ఉన్నారు? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. అయితే ఈ ఘటనకు ప్రధాని మోదీ మంగళవారం చేపట్టనున్న పర్యటనతో ఎలాంటి సంబంధం లేదని ముంబై పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటన సోమవారం జరిగిందని, మోదీ పర్యటన మంగళవారం జరుగుతోందని వెల్లడించారు.

గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌ను ప్రారంభించనున్న మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ముంబైలో గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ (GFF) 2026ను ప్రారంభించనున్నారు. ప్రపంచంలోని ప్రముఖ ఫిన్‌టెక్‌ సదస్సుల్లో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా ఫిన్‌టెక్, టెక్నాలజీ రంగాలకు చెందిన ప్రతినిధులు హాజరుకానున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టోకెనైజేషన్, క్వాంటమ్ టెక్నాలజీ వంటి అంశాలతో పాటు భవిష్యత్తులో ఆర్థిక సేవలను మరింత సురక్షితంగా, అందరికీ అందుబాటులోకి తీసుకురావడంపై ఈ సదస్సులో చర్చలు జరగనున్నాయి.