పశ్చిమ బెంగాల్ ఉపఎన్నికల్లో ఊహించని ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఇద్దరు టీఎంసీ అభ్యర్థులు నామినేషన్లు వెనక్కి తీసుకోగా, మమత సపోర్ట్ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. అసలేం జరిగిందంటే?
West Bengal Byelections : ఇప్పటికే అధికారాన్ని కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్ (TMC) కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మాజీ ముఖ్యమంత్రి, టిఎంసి చీఫ్ మమత బెనర్జీ పొలిటికల్ గా గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారు. చివరికి ఆమె పరిస్థితి ఎంత దయనీయంగా తయారయ్యిందంటే కనీసం ఉపఎన్నికల్లో బరిలోకి దింపేందుకు అభ్యర్థులు కూడా కరువయ్యారు.
నందిగ్రామ్ ఉపఎన్నికల రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. పోలింగ్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ అక్కడ ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. మొదట్లో టీఎంసీ పేరు, గుర్తుపై పెద్ద చర్చే జరిగింది. ఎన్నికల సంఘం టీఎంసీ పేరు, గుర్తును ఫ్రీజ్ చేసి.. మమతా బెనర్జీ, రుతబ్రత బెనర్జీ వర్గాలకు వేర్వేరు పేర్లు, గుర్తులు కేటాయించింది. అయితే ఇప్పుడు నందిగ్రామ్‌లో అభ్యర్థి విషయంలో మరో కొత్త డ్రామా మొదలైంది.
నందిగ్రామ్‌లో మమతకు అభ్యర్థే లేరా..!
నందిగ్రామ్, రెజీనగర్ ఉపఎన్నికల వేళ మమతా బెనర్జీకి మొదట తన సొంత పార్టీ గుర్తు, పేరు చేజారిపోయాయి. ఇప్పుడు ఏకంగా అభ్యర్థే లేకుండా పోయారు. నందిగ్రామ్ బరిలో సంచితా దేని మమతా బెనర్జీ నిలబెట్టారు. కానీ శుక్రవారం ఆమె ముఖ్యమంత్రి సువేందు అధికారిని కలిశారు. ఇద్దరి మధ్య చాలాసేపు చర్చలు జరిగాయి. అయితే వాళ్లు ఏం మాట్లాడుకున్నారనేది మాత్రం బయటకు రాలేదు.
ముఖ్యమంత్రితో భేటీ అనంతరం టిఎంసి అభ్యర్థి సంచితా దే తన నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితమే అఖిల్ గిరితో కలిసి వెళ్లి ఆమె నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. ఇవాళ (సెప్టెంబర్ 19, శనివారం) నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుండగా.. ఆలోపే ఆమె తప్పుకున్నారు.
కాంగ్రెస్‌కు మమత సపోర్ట్
ఈ పరిణామాల మధ్య నందిగ్రామ్‌లో కాంగ్రెస్ అభ్యర్థికి సపోర్ట్ ఇస్తున్నట్లు మమతా బెనర్జీ ప్రకటించారు. "గురువారం రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ నాకు ఫోన్ చేశారు. మేమంతా కలిసే పోరాడుతాం. బీజేపీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మా మిత్రపక్షాలకు, సహజ కూటమికి సపోర్ట్ ఇస్తాం కానీ బీజేపీకి కాదు" అని మమత స్పష్టం చేశారు. ఆమె ప్రకటనతో నందిగ్రామ్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
అయితే మమత సపోర్ట్ ప్రకటించిన వెంటనే నందిగ్రామ్ పాలిటిక్స్ మరో మలుపు తిరిగాయి. శుక్రవారం సాయంత్రం నందిగ్రామ్ కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పాత కేసుకు సంబంధించే ఆయన్ను అరెస్ట్ చేసినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు మిలన్‌పై తామే ఫిర్యాదు చేశామని రుతబ్రత బెనర్జీ వర్గం చెబుతోంది. కాగా రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఈ అరెస్ట్ జరిగిందని రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో మండిపడ్డారు.
రెజీనగర్ లోనూ ఇదే సీన్ రిపీట్
పశ్చిమ బెంగాల్ లో నందిగ్రామ్ తో పాటు రెజీనగర్ అసెంబ్లీకి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా టీఎంసికి అభ్యర్థి లేకుండా పోయాడు… ఈ పార్టీ అభ్యర్థి రబీ ఉల్ ఆలమ్ చౌద్రీ కూడా నామినేషన్ ను వెనక్కి తీసుకుని పోటీనుండి తప్పుకున్నాడు. ఈ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఆలమ్ చౌద్రీకి ఉంది… అందుకే ఆయన బలమైన అభ్యర్థిగా ఉంటాడని మమత బరిలోకి దింపింది. కానీ అనూహ్యంగా అతడు పోటీనుండి తప్పుకోవడంతో మాజీ సీఎంకు షాక్ తప్పలేదు.


