- Home
- Telangana
- Tank Bund Ganesh Immersion: ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం బంద్.. ఖైరతాబాద్ వినాయకుడి పరిస్థితి ఏంటి? అసలు కారణం ఏంటి?
Tank Bund Ganesh Immersion: ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం బంద్.. ఖైరతాబాద్ వినాయకుడి పరిస్థితి ఏంటి? అసలు కారణం ఏంటి?
Ganesh Immersion: హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ పై గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని నిషేధించారు. తెలంగాణ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు, పర్యావరణ పరిరక్షణ రూల్స్ తో పోలీస్ శాఖ, జీహెచ్ఎంసీ ట్యాంక్ బండ్‌పై భారీ ఫ్లెక్సీలు, ఐరన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది.

ట్యాంక్ బండ్‌పై గణేష్ నిమజ్జనం బ్యాన్
భాగ్యనగరంలో ఏటా ఎంతో సందడిగా జరిగే వినాయక నిమజ్జనోత్సవంలో ఈసారి ఒక కీలకమైన మార్పు వచ్చింది. ప్రతిసారీ వేలాది విగ్రహాలతో కోలాహలంగా మారే ప్రధాన స్టేజ్ అయిన ట్యాంక్ బండ్‌పై ఈ సంవత్సరం గణేష్ నిమజ్జనాన్ని పూర్తిగా నిషేధించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), హైదరాబాద్ పోలీస్ శాఖ కలసి సంయుక్తంగా ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నాయి. అప్పర్ ట్యాంక్ బండ్ వెంబడి భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలవడంతో ప్రస్తుతం ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఆంక్షల వెనుక ఉన్న ప్రధాన కారణాలు ఇవే
ట్యాంక్ బండ్‌పై నిమజ్జనాలు నిలిపివేయడం వెనుక పర్యావరణ పరిరక్షణతో పాటు న్యాయపరమైన ఆదేశాలు ఉన్నాయి. తెలంగాణ హైకోర్టు గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయడంలో భాగంగానే అధికారులు ఈ ఆంక్షలు విధిస్తున్నారు. ప్రధానంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితం కాకుండా చూడడం, నిమజ్జనం సమయంలో నగరంలో భారీగా తలెత్తే ట్రాఫిక్ చిక్కులను నివారించడం ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశం. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీపీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్లు స్పష్టం చేశారు.
బేబీ పాండ్లు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం
ట్యాంక్ బండ్‌పై నిషేధం విధించినందున భక్తులు నిరాశ చెందాల్సిన పనిలేదని, నగరం నలుమూలలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ ప్రత్యేకంగా నిర్మించిన 'బేబీ పాండ్లు' (కృత్రిమ నిమజ్జనం కోసం చిన్న చెరువులు), ఇతర ప్రత్యామ్నాయ ఘాట్లలో మాత్రమే విగ్రహాలను నిమజ్జనం చేయాలని సూచించారు. ఇక భారీ విగ్రహాల కోసం ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా సమీపంలో ప్రత్యేక ప్లాట్‌ఫారమ్‌లు, క్రేన్లను సిద్ధం చేస్తున్నారు. వీలైనంత వరకు ఎకో-ఫ్రెండ్లీ మట్టి విగ్రహాలనే ఉపయోగించాలని అధికారులు కోరుతున్నారు.
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ఎలా జరుగుతుంది?
ట్యాంక్ బండ్ మెయిన్ రోడ్డుపై విగ్రహాల నిమజ్జనాన్ని నిలిపివేయడంతో, నగరంలోనే అత్యంత భారీగా కొలువుదీరే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనంపై భక్తులలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే, గత కొన్ని ఏళ్లుగా ఖైరతాబాద్ ఉత్సవ సమితి పర్యావరణహిత మట్టి విగ్రహాలకే ప్రాధాన్యం ఇస్తుండటం గమనార్హం. ఈ సారి మహాగణపతిని సంప్రదాయబద్ధంగా ఎన్టీఆర్ మార్గ్‌లోని ప్రత్యామ్నాయ ఘాట్ వద్దే నిమజ్జనం చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పువు
హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం PoP విగ్రహాల నిమజ్జనంపై నిషేధం పక్కాగా అమలు కానుంది. రూల్స్ బ్రేక్ చేసి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు విగ్రహాలను తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. నిమజ్జన ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక చెక్‌పోస్టులు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. భక్తులు, గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఈ మార్గదర్శకాలను గమనించి, పోలీసులకు, సివిక్ అథారిటీలకు సంపూర్ణంగా సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

