Sleeping With Light: రాత్రి లైట్ వేసుకొని నిద్రపోతే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
Sleeping With Light: చాలామందికి రాత్రిపూట లైట్ వేసుకుని నిద్రపోయే అలవాటు ఉంటుంది. అయితే ఇలా నిద్రపోవడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి రాత్రంతా లైట్ వెలుగులో నిద్రిస్తే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.

రాత్రి లైట్ వేసుకొని నిద్రపోతే ఏమవుతుంది?
సాధారణంగా చిన్న పిల్లలున్న ఇళ్లలో చాలామంది తల్లిదండ్రులు, పిల్లలు భయపడకూడదని రాత్రంతా నైట్ ల్యాంప్ లేదా ఇతర లైట్లను వేసి ఉంచుతారు. కానీ, ఇలా నిద్రపోయేటప్పుడు గదిలో వెలుతురు ఉండటం నిద్రనే కాదు, ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా లైట్ వేసుకొని నిద్రపోవడం వల్ల గుండె ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
హార్ట్ బీట్ రేటులో మార్పులు
మన శరీరంలో సహజంగానే ఓ "బయోలాజికల్ క్లాక్" ఉంటుంది. ఇది పగలు మనల్ని మెలకువగా, రాత్రి నిద్రపోయేలా ఒక టైమ్ టేబుల్ సెట్ చేస్తుంది. రాత్రి సమయంలో మెదడులోని పీనియల్ గ్రంథి , మెలటోనిన్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ మన శరీరానికి "ఇప్పుడు విశ్రాంతి తీసుకుని, నిద్రపోవాల్సిన సమయం" అని చెబుతుంది. కానీ, రాత్రిపూట గదిలో ఎక్కువ వెలుతురు ఉంటే ఈ సహజ ప్రక్రియ దెబ్బతింటుంది. దీనివల్ల నిద్రకు ఆటంకం కలిగి, రక్తపోటు, హార్ట్ బీట్ రేటులో మార్పులు రావొచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.
నిద్రపై ప్రభావం
రాత్రిపూట వెలుతురు వల్ల నిద్ర దెబ్బతింటుంది. ఇది దీర్ఘకాలంలో గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. అయితే, గదిలో లైట్ వేసుకుంటే వెంటనే గుండె జబ్బులు వస్తాయని కాదు. వెలుతురు నేరుగా గుండె జబ్బులకు కారణం కాదు, కానీ అది నిద్రను పాడుచేయడం ద్వారా గుండె ఆరోగ్యంపై పరోక్షంగా ప్రభావం చూపుతుందని గుర్తుంచుకోవాలి.
గదిని చీకటిగా ఉంచుకోవడం..
రాత్రిపూట గదిని వీలైనంత వరకు చీకటిగా ఉంచుకోవడం మంచిది. నిద్రకు కనీసం గంట ముందు సెల్‌ఫోన్, టీవీ, ట్యాబ్లెట్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉండాలి. కిటికీల నుంచి వెలుతురు లోపలికి వస్తుంటే దళసరి కర్టెన్లు ఉపయోగించుకోవచ్చు. అవి అందుబాటులో లేకపోతే కళ్లకు ఐ మాస్క్ ధరించి నిద్రించడం మంచి ప్రత్యామ్నాయం. ఇలా చేయడం ప్రశాంతమైన, నాణ్యమైన నిద్రకు సహాయపడుతుంది.
గుండె ఆరోగ్యం కోసం...
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ తగినంత నిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామం, పోషకాహారం తీసుకోవడం, రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా రాత్రిపూట గదిలో వెలుతురును తగ్గించి ప్రశాంతమైన వాతావరణంలో నిద్రించడం మంచి నిద్రకు దోహదపడుతుంది. ఈ చిన్న అలవాట్లు గుండెతో పాటు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

