రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే ఈ ప్రమాదకరమైన రోగాలొస్తయ్.. జర జాగ్రత్త..
ఈ మధ్యకాలంలో చిన్నవయసు వారు కూడా డయాబెటీస్ బారిన పడుతున్నారు. కానీ దీన్ని నియంత్రణలో ఉంచుకోకపోతే ప్రమాదకరమైన రోగాలొస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రక్తంలో గ్లూకోజ్ అధికంగా ఉండే పరిస్థితినే డయాబెటిస్ అంటారు. దీన్ని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ వ్యాధి మనం కోలుకోలేని ప్రాణాంతక రోగాలకు దారీస్తుంది కాబట్టి. ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం, కుటుంబ చరిత్ర వంటి వివిధ కారణాల వల్ల ప్రస్తుతం చాలా మంది ఈ డయాబెటీస్ బారిన పడుతున్నారు. పెద్దలే కాదు పిల్లలు, యువత కూడా ఈ షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ డయాబెటిస్ మన శరీరంలోని ప్రతి భాగాన్ని దెబ్బతీస్తుంది. దీన్ని సరైన సమయంలో నియంత్రించకపోతే ఎన్నో ప్రమాదకరమైన రోగాలు వస్తాయి. అవేంటంటే..
పాదాల సమస్యలు
డయాబెటిస్ పాదాల సమస్యలకు కూడా దారితీస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను పెరిగితే.. ఫుట్ అల్సర్లు వస్తాయి. ఈ వ్యాధి మూలంగా మీ పాదాలపై నయం కాని పుండ్లు ఏర్పడతాయి. ఇలాంటి సమయంలో వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మంచిది. ఇలాంటి సమస్యలు రాకూడదంటే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలి.
కంటి సమస్యలు
ఎప్పుడూ రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే వారిలో డయాబెటిక్ రెటినోపతి సమస్య వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధి వారి కంటి చూపును ప్రభావితం చేస్తుంది. ఇది అంధత్వానికి కూడా దారితీస్తుంది. అందుకే రక్తంలో చక్కెర స్థాయిలను ఎప్పుడూ చెక్ చేస్తూ ఉండండి. ఎక్కువగా ఉంటే తగ్గించుకునే ప్రయత్నం చేయండి.
గుండెపోటు, స్ట్రోక్
డయాబెటీస్ ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుంది. ముఖ్యంగా గుండెపోటు, స్ట్రోక్ కు. డయాబెటీస్ బారిన పడిన వారి రక్తంలో ఎప్పుడు చక్కెర స్థాయిలు ఎక్కువగానే ఉంటే వారిలో రక్త నాళాలు దెబ్బతింటాయి. ఇది గుండెపోటు, స్ట్రోక్ ను దారితీస్తుంది.
కిడ్నీ సమస్యలు
డయాబెటీస్ ఉన్న చాలా మందికి కిడ్నీ సమస్యలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఈ డయాబెటీస్ మూత్రపిండాలను ప్రభావితం చేస్తుంది. దీంతో మీ శరీరం నుంచి అదనపు ద్రవాన్నని, వ్యర్థాలను క్లియర్ చేయడం మూత్రపిండాలకు కష్టంగా మారుతుంది. దీనివల్ల మూత్రపిండాల వైఫల్యం సమస్య వస్తుంది. మీకు డయాలసిస్ అవసరం కావచ్చు. అందుకే బ్లడ్ షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుకోవాలి.
లైంగిక సమస్యలు
మీరు షుగర్ పేషెంటా? అయితే దాన్ని ఎప్పుడూ నియంత్రణలోనే ఉంచుకోండి. ఎందుకంటే ఈ వ్యాధి రక్త నాళాలు, నరాలకు నష్టం కలిగిస్తుంది. అంతేకాదు లైంగిక అవయవాలకు రక్త ప్రవాహాన్ని పరిమితం చేస్తుంది. దీనివల్ల మీరు సెక్స్ పట్ల ఇంట్రెస్ట్ చూపరు. దీనివల్ల మీ సెక్స్ లైఫ్ నాశనం అవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి.
diabetes
డయాబెటిస్ ఉన్నవారు క్రమం తప్పకుండా సమయానికి మందులను వేసుకోవాలి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా చెక్ చేస్తూ ఉండాలి. సమతుల్య ఆహారం తినాలి. ఒత్తిడి లేకుండా ఉండాలి. ఆరోగ్యకరమైన బరువు ఉండేట్టు చూసుకోవాలి. క్రమం తప్పకుండా హెల్త్ చెకప్ లు చేయించుకోవాలి.