వంటింట్లో స్టవ్ పక్కనే సింక్ ఉండొచ్చా? వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారు?
ఇంట్లో వంటగది ఎంతో ముఖ్యమైనది. వంటగదిలో స్టవ్, సింక్ పక్కపక్కనే ఉండొచ్చా అనే సందేహం ఎక్కువ మందికి ఉంది. అలా అయితే అగ్ని, నీరు పక్కపక్కనే ఉన్నట్టే. ఈ విషయంలో వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోండి.

స్టవ్ పక్కన సింక్ ఉండొచ్చా?
ఇప్పుడు కొత్త కట్టిన ఇళ్లల్లో ఇప్పుడు మోడ్రన్ కిచెన్ కడుతున్నారు. అందులో స్టవ్ కట్టిన ప్లాట్ ఫారం పక్కనే సింక్ కూడా నిర్మిస్తున్నారు. ఇలా స్టవ్ కు పక్కనే సింక్ ఉండవచ్చా అనే సందేహం ఎంతోమందికి ఉంటుంది. స్థలం సరిపోక, సరైన అవగాహన లేక ఒకే స్లాబ్‌పై లేదా సమాంతరంగా స్టవ్, సింక్ ను కడుతున్నారు. ఇది సాధారణ విషయంలా కనిపించినా.. వాస్తు శాస్త్రంలో మాత్రం తీవ్రమైన దోషంగా చెప్పుకుంటారు.
ఎందుకు రెండూ పక్కపక్కనే ఉండకూడదు?
వాస్తు శాస్త్రం అనేది భూమి, ఆకాశం, నీరు, గాలి, అగ్ని అనే పంచభూతాల ఆధారంగా పనిచేస్తుంది. వంటగదిలో నీరు (సింక్), అగ్ని (స్టవ్) అనే రెండు ముఖ్యమైన అంశాలు ఉంటాయి. ఈ రెండింటి మధ్య సమతుల్యం ఉండాలి. ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఇంట్లోని ప్రశాంతతపై ప్రభావం చూపుతుంది.
వంటగదిలోని గ్యాస్ స్టవ్‌ను అగ్ని స్వరూపంగా భావిస్తారు. వాస్తు ప్రకారం, స్టవ్‌ను ఆగ్నేయ దిశలో పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇది కుటుంబంలో సంతోషాన్ని, సిరిసంపదలను పెంచుతుందని నమ్ముతారు. వంటగదికి ఆగ్నేయం శుభప్రదమైన దిశ.
సింక్, స్టవ్ పక్కపక్కనే లేదా సమాంతరంగా ఉంటే.. నీరు, అగ్నిని ఒకేచోట ఉంచినట్టు అవుతుంది. ఈ రెండు శక్తుల మధ్య ఘర్షణ మొదలవుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇది మానసిక ఒత్తిడి, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆర్థిక నష్టాలు, ఇంట్లో వాళ్లకి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ.
ఈ సమస్యకు పరిష్కారం
గ్యాస్ స్టవ్, సింక్ పక్కపక్కనే పెట్టడం మంచిది కాదు. రెండింటి మధ్య కనీసం కొంత దూరం ఉండేలా చూసుకోవడం మంచిది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో సమాంతరంగా ఉంటే, స్టవ్, సింక్ మధ్యలో ఒక చిన్న గోడలాంటిది కట్టుకోవడం ఉత్తమం. సింక్, గ్యాస్ స్టవ్ మధ్యలో ఏదైనా బరువైన వస్తువును ఉంచడం ద్వారా కూడా ఈ వాస్తు దోషాన్ని నివారించుకోవచ్చు.

