Fennel Benefits : హోటల్స్‌లో భోజనం తర్వాత సోంపు, చక్కెర కలిపి ఇస్తారు? ఎందుకో తెలుసా?
కొందరికి భోజనం తర్వాత సోంపు తినే అలవాటు ఉంటుంది. ఇక హోటల్స్, రెస్టారెంట్స్ లో అయితే భోజనం తర్వాత సోంపు, చక్కెర కలిపి ఇస్తారు. మరి సోంపు తినడం వల్ల ఉపయోగాలేంటి? సోంపు, చక్కెర ఎందుకు ఇస్తారు? వంటి విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

సోంపు వల్ల ఇంత లాభమా..!
హోటల్స్, రెస్టారెంట్స్, దాబాల్లో భోజనం పూర్తయ్యాక అంటే బిల్లు కట్టే సమయంలో చిన్న గిన్నెలో సోంపు, చక్కెర కలిపి ఇవ్వడం చూస్తుంటాం. కొందరు దీన్ని కేవలం మౌత్ ఫ్రెషనర్ గా భావిస్తారు... ఇంకొందరు జీర్ణక్రియకు మంచిదని తింటారు. అయితే అసలు భోజనం తర్వాతే సోంపు ఎందుకు ఇస్తారు? సోంపు, చక్కెర ఎందుకు కలుపుతారు? సోంపులో ఉండే పదార్థాలు మన శరీరంలో ఎలా పనిచేస్తాయి? దానిలోని మెడిసినల్ వ్యాల్యూస్ ఏమిటి? అనే విషయాలు చాలామందికి తెలియదు.
సోంపు (Fennel) భారతీయ వంటకాలలో చాలా కాలంగా ఉపయోగిస్తున్న సుగంధ ద్రవ్యం. దీని గింజల్లో ప్రత్యేకమైన సువాసనకు కారణమయ్యే సహజ నూనెలు ఉంటాయి. అందుకే భోజనం తర్వాత కొద్దిగా సోంపు నమలడం ఒక ఆహార సంప్రదాయంగా మారింది. అయితే హోటళ్లలో ఇచ్చే సోంపు, చక్కెర వెనుక రుచి మాత్రమే కాదు.. జీర్ణక్రియ, నోటి పరిశుభ్రతతో పాటు మరికొన్ని ఆసక్తికర కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
భోజనం తర్వాత సోంపు ఎందుకు ఇస్తారు?
సోంపుకు సంప్రదాయంగా కార్మినేటివ్ లక్షణాలు ఉంటాయి. అంటే జీర్ణవ్యవస్థలో ఏర్పడే గ్యాస్, ఉబ్బరం వంటి అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడే పదార్థం అన్నమాట. భోజనం చేసిన తర్వాత కొంతమందికి కడుపు ఉబ్బరం, గ్యాస్ లేదా భారంగా అనిపించవచ్చు. సోంపును నమలడం వల్ల దాని సహజ నూనెలు జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతాయి... గ్యాస్ ను తొలగిస్తాయి. అందుకే భోజనం తర్వాత సోంపు తీసుకునే అలవాటు అనేక ప్రాంతాల్లో కనిపిస్తుంది.
ఇక సోంపుకు యాంటిస్పాస్మోడిక్ (Antispasmodic) లక్షణాలు కూడా ఉంటాయి. అంటే కడుపులోని కొన్ని రకాల కండరాల అనవసరమైన సంకోచాలను తగ్గించడంలో సహాయపడుతుందన్నమాట. జీర్ణవ్యవస్థలోని మృదుకండరాలపై ఇలాంటి ప్రభావం ఉండటం వల్ల కడుపు ఉబ్బరం, అసౌకర్యం వంటి కొన్ని సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఇది వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. తరచూ కడుపునొప్పి, తీవ్రమైన గ్యాస్ లేదా జీర్ణ సమస్యలు ఉంటే కారణాన్ని గుర్తించడం ముఖ్యం.
అయితే సోంపు తిన్న వెంటనే కడుపులోని మొత్తం గ్యాస్ బయటకు వెళ్లిపోతుంది లేదా జీర్ణక్రియ ఒక్కసారిగా వేగవంతమవుతుంది అని చెప్పడం శాస్త్రీయంగా సరైనది కాదు. దీన్ని ఒక తేలికపాటి ఆహార అలవాటుగా మాత్రమే చూడాలి.
సోంపు నోటి దుర్వాసనను తగ్గించడంలో సహాయపడుతుందా?
భోజనం తర్వాత సోంపు ఇవ్వడానికి ప్రధాన కారణం మౌత్ ఫ్రెషనర్‌గా పనిచేయడం. సోంపు గింజలను నమిలినప్పుడు వాటి సువాసన నోటిలో వ్యాపిస్తుంది. దీంతో భోజనం తర్వాత మిగిలే ఆహార వాసన తగ్గుతుంది. ఇలా సహజ మౌత్ ప్రెషనర్ గా ఉపయోగపడుతుంది.
సోంపులోని కొన్ని సహజ సమ్మేళనాలు నోటిలోని సూక్ష్మజీవుల నాశనం చేస్తాయని కూడా చెబుతారు. అయితే సోంపును నమలడం వల్ల నోటిలోని అన్ని బ్యాక్టీరియా పూర్తిగా నశిస్తాయని చెప్పడం సరైంది కాదు... కొంతమేర ప్రభావం మాత్రం చూపుతాయని చెప్పవచ్చు. అందుకే దీన్ని మౌత్ ఫ్రెషనర్‌గా ఉపయోగించవచ్చు కానీ బ్రషింగ్, ఫ్లాసింగ్, నోటి పరిశుభ్రతకు ప్రత్యామ్నాయంగా భావించకూడదు.
సోంపు, షుగర్ ఎందుకు కలిపి ఇస్తారు?
సొంపు అనేది ఊపిరిత్తుల్లోని కఫంను బయటకు లాగేస్తుంది. ఈ సమయంలో ఎక్కువగా కఫం గొంతులోకి చేరి కండరాలను ఇబ్బంది పెట్టవచ్చు... దీంతో గొంతు గరగర పెరుగుతుంది. ఇలాంటి సమయంలో సొంపుతో పాటు షుగర్ కలిపి ఇవ్వడం ఉపయోగపడుతుంది. గొంతు గోడలకు షుగర్ ఓ కోటింగ్ లా పనిచేస్తుంది... దీంతో కఫం వల్ల ఇబ్బందులు ఉండవు. ఇందుకోసమే హోటల్స్, శుభకార్యాల్లో సొంపు, చక్కెర స్పటికాలు కలిపి ఇస్తారు... ఇటీవల కాలంలో షుగర్ కోటింగ్ తో సొంపు వస్తోంది.
ఇక సోంపుకు సహజంగానే కొంత తియ్యటి రుచి, ప్రత్యేకమైన వాసన ఉంటుంది. దానికి చక్కెర కలిపితే నమలడానికి మరింత రుచిగా ఉంటుంది. ఆహారం తర్వాత నోటి దుర్వాసనను తగ్గించడానికి కూడా ఈ కలయిక ఉపయోగపడతుంది. అందుకే చాలా హోటళ్లలో సోంపు, చక్కెరను మిశ్రమంగా అందిస్తారు.
సోంపు వల్ల ఇన్ని ఉపయోగాలున్నాయా?
సోంపు నమలడం వల్ల నోటిలో లాలాజలం ఉత్పత్తి పెరుగుతుంది. ఇది నోరు పొడిబారకుండా ఉండటానికి సహాయపడుతుంది.
ఇక సోంపు గింజల్లో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థలో ఉపయోగపడుతుంది.
సోంపుకు శరీరంలోని కొవ్వును కరిగించే గుణం ఉంటుంది. కాబట్టి బరువు తగ్గేవారు కూడా దీన్ని ఎక్కువగా తింటుంటారు.
సోంపు తింటే కొన్ని విష పదార్థాలు బయటకు వెళ్లి శరీరం “డిటాక్స్” అవుతుంది. దీంతో కాలేయం, మూత్రపిండాలపై ఒత్తిడి తగ్గుతుంది.
భోజనం తర్వాత సోంపు తినడం మంచిదేనా?
సాధారణంగా ఆహారంలో భాగంగా మితమైన పరిమాణంలో సోంపు తీసుకోవడం చాలామందికి సమస్య కలిగించదు. భోజనం తర్వాత కొద్దిగా సోంపు నమలడం వల్ల నోటిలో తాజా వాసన రావడం, లాలాజలం పెరగడం, కొంతమందిలో జీర్ణ సంబంధిత అసౌకర్యం తగ్గడం వంటి ప్రయోజనాలు ఉండొచ్చు.
అయితే ఏ ఆహార పదార్థమైనా అందరికీ ఒకే విధంగా పనిచేయదు. అలర్జీలు ఉన్నవారు లేదా ప్రత్యేక ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారు అధికంగా తీసుకోవడం మంచిది కాదు. అలాగే హోటళ్లలో ఇచ్చే సోంపు మిశ్రమంలో చక్కెర ఎక్కువగా ఉంటే దాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
చిన్న గిన్నెలో ఇచ్చే సోంపు వెనుక ఇంత కథ ఉందా..!
మొత్తానికి హోటల్‌లో భోజనం తర్వాత ఇచ్చే సోంపు, చక్కెర కేవలం సంప్రదాయం లేదా అలంకరణ కోసం మాత్రమే కాదు. సోంపును సంప్రదాయంగా జీర్ణక్రియకు సంబంధించిన అసౌకర్యం, గ్యాస్, నోటి వాసన వంటి వాటి కోసం ఉపయోగిస్తారు.

