- Home
- Feature
- Top 5 Railway Stations : దేశంలో అత్యధిక ఆదాయం కలిగిన టాప్ 5 రైల్వే స్టేషన్లు ఇవే.. సికింద్రాబాద్ ఇన్కమ్ ఎంతో తెలుసా?
Top 5 Railway Stations : దేశంలో అత్యధిక ఆదాయం కలిగిన టాప్ 5 రైల్వే స్టేషన్లు ఇవే.. సికింద్రాబాద్ ఇన్కమ్ ఎంతో తెలుసా?
భారతదేశంలో అతిపెద్ద ప్రజారవాణా వ్యవస్థ రైల్వే. ప్రతిరోజు లక్షలాదిమంది మంది రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారు. మరి దేశంలోనే అత్యధిక ఆదాయం కలిగిన రైల్వే స్టేషన్లు ఏవో తెలుసా?

ఆదాయంలో ఈ రైల్వే స్టేషన్లే టాప్
భారతీయ రైల్వే దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులనే కాదు వేల టన్నుల సరుకులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరవేస్తోంది ఈ రైల్వే వ్యవస్థ. అయితే రైల్వేస్ ప్రధాన ఆదాయ వనరుల్లో ప్రయాణికుల రవాణాదే కీలకపాత్ర. దేశంలోని కొన్ని ప్రధాన రైల్వే స్టేషన్లు ప్రయాణికుల రద్దీతో పాటు భారీ స్థాయిలో ఆదాయాన్ని కూడా ఆర్జిస్తున్నాయి. ఈ క్రమంలో రైల్వే మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం అత్యధిక వార్షిక ఆదాయం కలిగిన రైల్వే స్టేషన్లు ఏవో తెలుసుకుందాం.
1. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్.. ఆదాయంలో నంబర్ వన్
దేశ రాజధాని ఢిల్లీలోని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ అత్యధిక ఆదాయం ఆర్జించిన స్టేషన్ల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఈ ఒక్క స్టేషన్ నుండే సంవత్సరానికి రూ.3,337 కోట్లకు పైగా ఆదాయం రైల్వే శాఖకు సమకూరుతోంది. ఏటా సుమారు 3.93 కోట్ల మంది ప్రయాణికులు ఈ న్యూఢిల్లీ స్టేషన్ ద్వారా రాకపోకలు సాగిస్తున్నారట. ఇలా దేశంలోని అత్యంత కీలకమైన రైల్వే హబ్‌లలో ఇది ఒకటి. ఉత్తర భారతదేశంలోని అనేక నగరాలకు, అలాగే దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే సుదూర రైళ్లకు ఇది ప్రధాన కేంద్రంగా ఉంది.
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు చారిత్రక ప్రాధాన్యం కూడా ఉంది. కొత్త ఢిల్లీ నగర నిర్మాణంతో పాటు ఈ స్టేషన్ అభివృద్ధి చెందింది. ప్రస్తుతం స్టేషన్‌లో 16 ప్లాట్‌ఫారాలు ఉన్నాయి. స్టేషన్‌ను మరింత ఆధునికంగా తీర్చిదిద్దేందుకు భారీ స్థాయిలో పనులు చేపట్టారు. ప్రయాణికులకు మెరుగైన వెయిటింగ్ ఏరియాలు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు, మెరుగైన సైన్‌బోర్డులు, భద్రతా వ్యవస్థలు, రైలు-మెట్రో-బస్ వంటి రవాణా మార్గాలను అనుసంధానించే మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్ వంటి సదుపాయాలు ఈ అభివృద్ధిలో భాగంగా ఉన్నాయి.
2. హౌరా రైల్వే స్టేషన్.. ఆదాయంలోనే కాదు ప్రయాణికుల రద్దీలోనూ టాప్
పశ్చిమ బెంగాల్‌లోని హౌరా రైల్వే స్టేషన్ ఆదాయ పరంగా దేశంలో రెండో స్థానంలో ఉంది. ఈ స్టేషన్ రూ.1,692 కోట్లకు పైగా వార్షిక ఆదాయం ఆర్జించింది. అయితే ప్రయాణికుల సంఖ్యను పరిశీలిస్తే హౌరా మరింత ప్రత్యేకంగా నిలుస్తుంది. ఒక్క ఏడాదిలోనే 6.13 కోట్లకు పైగా ప్రయాణికుల రాకపోకలు నమోదయ్యాయి. అంటే ఆదాయంలో రెండో స్థానంలో ఉన్నప్పటికీ ప్రయాణికుల రద్దీ విషయంలో టాప్ లో ఉంది.
హౌరా స్టేషన్ చాలా పురాతనమైనది... 1854లోనే తొలి ప్రయాణికుల రైలు నడిచింది. కోల్‌కతా మెట్రోపాలిటన్ ప్రాంతానికి ఇది ప్రధాన రైల్వే గేట్‌వేగా పనిచేస్తోంది. ఈ స్టేషన్‌లో పెద్ద సంఖ్యలో ప్లాట్‌ఫారాలు ఉండటంతో పాటు సుదూర రైళ్లు, సబర్బన్ రైళ్లు నిరంతరం రాకపోకలు సాగిస్తుంటాయి. హౌరా బ్రిడ్జి సమీపంలో ఉండటం వల్ల కోల్‌కతా నగరంతో దీనికి అత్యంత కీలకమైన రవాణా అనుసంధానం ఉంది.
3. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్.. దక్షిణ భారతదేశానికి కీలక కేంద్రం
తమిళనాడు రాజధానిలోని చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ ఆదాయ పరంగా మూడో స్థానంలో నిలిచింది. ఈ స్టేషన్ నుంచి సుమారు రూ.1,299 కోట్ల వార్షిక ఆదాయం వస్తోంది. ఇదే సమయంలో 3.06 కోట్లకు పైగా ప్రయాణికుల రాకపోకలు సాగిస్తున్నారు. దక్షిణ భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన రైల్వే టెర్మినళ్లలో చెన్నై సెంట్రల్ ఒకటి.
1873లో ఏర్పాటైన ఈ స్టేషన్‌కు 150 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. ఈ రైల్వే స్టేషన్ భవనం పాశ్చాత్య శైలిలో ఉంటుంది… ఇది చెన్నై నగరానికే ప్రత్యేక గుర్తింపుఇస్తోంది. చెన్నై నుంచి ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రధాన నగరాలకు వెళ్లే అనేక రైళ్లకు ఇది ముఖ్యమైన టెర్మినల్. ప్రస్తుతం ప్రధాన స్టేషన్, సబర్బన్ టెర్మినల్ కలిపి 17 ప్లాట్‌ఫారాలు ఉన్నాయి.
4. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.. తెలుగు ప్రజలకే గర్వకారణం
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దేశవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఈ స్టేషన్ రూ.1,276 కోట్లకు పైగా వార్షిక ఆదాయం ఆర్జించి దేశంలోని అత్యధిక ఆదాయం కలిగిన రైల్వే స్టేషన్లలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ రైల్వే స్టేషన్ నుండి ఏడాదికి 2.77 కోట్లకు పైగా ప్రయాణికుల రాకపోకలు సాగిస్తారు. న్యూఢిల్లీ, హౌరా, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ తర్వాత సికింద్రాబాద్ స్థానం దక్కించుకుంది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు కేవలం ఆదాయ పరంగానే కాకుండా చారిత్రకంగానూ ఎంతో ప్రత్యేకత ఉంది. హైదరాబాద్‌లో రైల్వే వ్యవస్థకు ఇది పునాది వేసింది… నిజాం కాలంలో సికింద్రాబాద్–వాడి రైల్వే లైన్ నిర్మాణంతో పాటు స్టేషన్ అభివృద్ధి జరిగింది. 1874 అక్టోబర్ 9న సికింద్రాబాద్–వాడి రైల్వే లైన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రారంభమయ్యాయి. దీంతో అప్పటి హైదరాబాద్ రాష్ట్రం దేశంలోని ఇతర ప్రాంతాలతో రైల్వే మార్గం ద్వారా మరింత బలంగా అనుసంధానమైంది. స్టేషన్ పాత భవనంలో నిజాం కాలం నాటి నిర్మాణ శైలికి సంబంధించిన ఆనవాళ్లు కనిపించేవి.
సికింద్రాబాద్ స్టేషన్ తెలంగాణతో పాటు దక్షిణ మధ్య రైల్వేకు కూడా అత్యంత కీలకమైన ఆపరేషనల్ హబ్‌గా ఉంది. హైదరాబాద్ జంట నగరాల నుంచి దేశంలోని ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ ప్రాంతాలకు వెళ్లే అనేక రైళ్లకు ఇది ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి ప్రధాన నగరాలతో సికింద్రాబాద్‌కు రైలు కనెక్టివిటీ ఉంది. పండుగలు, సెలవుల సమయంలో ఇక్కడ ప్రయాణికుల రద్దీ మరింత పెరుగుతుంది. అందుకే స్టేషన్ సామర్థ్యాన్ని పెంచడం, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కీలకంగా మారింది.
ప్రస్తుతం సికింద్రాబాద్ స్టేషన్ లో భారీ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సుమారు రూ.715–720 కోట్ల వ్యయంతో స్టేషన్‌ను ఆధునిక రవాణా కేంద్రంగా తీర్చిదిద్దే పనులు కొనసాగుతున్నాయి. పాత ప్రధాన టెర్మినల్ భవనాల స్థానంలో ఆధునిక సౌకర్యాలతో కొత్త నిర్మాణాలను అభివృద్ధి చేస్తున్నారు. ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేయడం, ప్లాట్‌ఫారాల అనుసంధానాన్ని మెరుగుపరచడం, ఎస్కలేటర్లు, లిఫ్టులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, మెరుగైన ప్రయాణికుల సమాచారం, భద్రతా సదుపాయాలు వంటి అనేక అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
స్టేషన్ ఆధునీకరణ పూర్తయిన తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కేవలం రైళ్లు ఎక్కి దిగే ప్రదేశంగా కాకుండా ఆధునిక మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌గా మారే అవకాశం ఉంది. హైదరాబాద్ మెట్రో, రోడ్డు రవాణా, రైల్వే సేవలను మరింత సమర్థంగా అనుసంధానించడం ద్వారా ప్రయాణికులకు ప్రయాణ సమయం తగ్గడంతో పాటు స్టేషన్‌లో రద్దీ నిర్వహణ కూడా మెరుగుపడే అవకాశం ఉంది. తెలంగాణలో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేస్తున్న ప్రధాన స్టేషన్లలో సికింద్రాబాద్‌కు ప్రత్యేక ప్రాధాన్యం లభిస్తోంది.
5. హజ్రత్ నిజాముద్దీన్.. తక్కువ ప్రయాణికులతో భారీ ఆదాయం
ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉంది. ఈ స్టేషన్ రూ.1,227 కోట్లకు పైగా వార్షిక ఆదాయం కలిగివుంది. ఏటా సుమారు 1.45 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ప్రయాణికుల సంఖ్య న్యూఢిల్లీ, హౌరా, చెన్నై, సికింద్రాబాద్ కంటే తక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం మాత్రం రూ.1,200 కోట్లను దాటడం ఈ స్టేషన్‌కు ఉన్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది. దేశంలోని అనేక ప్రధాన నగరాలకు వెళ్లే సుదూర రైళ్లకు ఇది ముఖ్యమైన స్టేషన్‌గా ఉంది.
టాప్-10లో ముంబై, అహ్మదాబాద్, పుణె స్టేషన్లు
ఇక ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ రూ.1,036 కోట్ల ఆదాయంతో ఆరో స్థానంలో ఉంది. అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ రూ.1,010 కోట్లతో ఏడో స్థానంలో నిలిచింది. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ రూ.982 కోట్ల ఆదాయంతో ఎనిమిదో స్థానంలో ఉంది. పుణె రైల్వే స్టేషన్ రూ.976 కోట్లతో తొమ్మిదో స్థానంలో, ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ రూ.844 కోట్లతో పదో స్థానంలో ఉన్నాయి. పుణె స్టేషన్‌లో 2.22 కోట్లకు పైగా, అహ్మదాబాద్‌లో 1.82 కోట్లకు పైగా, ముంబై CSMTలో 5.16 కోట్లకు పైగా ప్రయాణికుల రాకపోకలు నమోదయ్యాయి.
మొత్తంగా చూస్తే దేశంలోని అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న రైల్వే స్టేషన్ల జాబితా భారతీయ రైల్వేలో ప్రాంతీయ కనెక్టివిటీ, ప్రయాణికుల డిమాండ్, సుదూర రైళ్ల ప్రాధాన్యం ఎంత కీలకమో తెలియజేస్తోంది. ముఖ్యంగా సికింద్రాబాద్ స్టేషన్ దేశంలోని టాప్-5 ఆదాయ ఆర్జించే స్టేషన్లలో చోటు దక్కించుకోవడం హైదరాబాద్, తెలంగాణకు ఎంతో ప్రాధాన్యం కలిగిన విషయం. ఒకవైపు చారిత్రక వారసత్వాన్ని కలిగి ఉండగా, మరోవైపు రూ.1,276 కోట్లకు పైగా వార్షిక ఆదాయాన్ని అందిస్తూ ఆధునికీకరణ దిశగా అడుగులు వేస్తుండటంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భవిష్యత్తులో మరింత కీలక రవాణా కేంద్రంగా మారే అవకాశం ఉంది.

