కుక్క పని గాడిద చేస్తే ఏమవుతుందో తెలుసా.? మీ కండ్లు తెరిపించే కథ
Motivational: మన చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తికీ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒకరు చేసే పని మనకు చిన్నదిగా కనిపించవచ్చు. ఇంకొకరు ఎక్కువగా కష్టపడుతున్నట్లు అనిపించవచ్చు. కానీ అవసరం వచ్చినప్పుడు ఎవరి విలువ ఏంటో తెలుస్తుందని చాటే మంచి కథ ఇప్పుడు తెలుసుకుందాం.

రామాపురం గ్రామంలో వీరేశం
అనగనగా రామాపురం అనే ఓ అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో వీరేశం అనే రజకుడు జీవించేవాడు. గ్రామంలోని ప్రజల దుస్తులు సేకరించి, వాటిని చెరువు దగ్గరకు తీసుకెళ్లి శుభ్రంగా ఉతికి, ఆరబెట్టి తిరిగి వారి ఇళ్లకు అందించడం అతని వృత్తి. పని ఎక్కువగా ఉండటంతో వీరేశం తనకు సహాయంగా ఓ గాడిదను, ఓ కుక్కను పెంచుకున్నాడు. ప్రతిరోజూ ఉదయం గ్రామంలోని ఇళ్ల నుంచి దుస్తులు సేకరించిన తర్వాత వాటిని గాడిదపై వేసేవాడు. గాడిద ఆ బరువును మోస్తూ వీరేశంతో కలిసి చెరువు వరకు వెళ్లేది. అదే సమయంలో కుక్క కూడా గాడిద వెంట నడుస్తూ దానికి తోడుగా ఉండేది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కూడా కుక్క ఇంటి పరిసరాల్లో తిరుగుతూ కాపలా కాసేది. ఇలా ఇద్దరూ తమకు అప్పగించిన పనిని నిత్యం చేసేవారు.
గాడిదే ఎక్కువ కష్టపడుతోందని భావించిన యజమాని
వీరేశం దృష్టిలో గాడిదే ఎక్కువగా పనిచేస్తున్నట్లు కనిపించేది. ఉదయం నుంచి సాయంత్రం వరకు బట్టల మూటలను మోసేది. చెరువుకు వెళ్లడం, తిరిగి రావడం ఇలా రోజంతా శ్రమించేది. కుక్క మాత్రం ఎలాంటి బరువులు మోయదు. తనతో పాటు నడుస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. అందుకే కుక్క పెద్దగా ఉపయోగపడటం లేదని వీరేశం భావించాడు. దాంతో గాడిదకు మంచి ఆహారం పెట్టేవాడు. దాని ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవాడు. కానీ కుక్క విషయంలో మాత్రం పెద్దగా పట్టించుకునేవాడు కాదు. దీంతో కుక్క బాధపడుతూ ఉండేది.
దొంగ వచ్చిన రాత్రి అసలు విషయం బయటపడింది
ఒకరోజు రాత్రి వీరేశం కుటుంబ సభ్యులంతా గాఢంగా నిద్రపోతున్నారు. అదే సమయంలో ఓ దొంగ ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ విషయాన్ని కుక్క గమనించింది. అయితే అది వెంటనే మొరగలేదు. ఇదంతా గమనించిన గాడిదకు ఆశ్చర్యం వేసింది. “దొంగ ఇంట్లోకి వచ్చాడు కదా! నువ్వు ఎందుకు అరవడం లేదు? వెంటనే యజమానిని నిద్రలేపాలి కదా?” అని కుక్కను అడిగింది.
అప్పుడు కుక్క ఇలా చెప్పింది.
“మన యజమానికి నేను ఎప్పుడైనా విలువైనదాన్నిగా అనిపించానా? నువ్వే ఎక్కువగా కష్టపడుతున్నావని ఆయన ఎప్పుడూ నీకు మంచి ఆహారం పెడతాడు. నన్ను మాత్రం పట్టించుకోడు. ఇంటిని కాపాడటం నా బాధ్యతే కావచ్చు. కానీ నా విలువ ఆయనకు తెలియనప్పుడు నేను ఎందుకు నా ప్రాణం పెట్టి అరవాలి? దొంగను చూసి నువ్వే అరవొచ్చు కదా!” అని చెప్పింది.
గాడిద అరవడంతో..
దీంతో కొద్దిసేపటి తర్వాత గాడిద పెద్దగా అరవడం ప్రారంభించింది. ఆ అరుపులతో నిద్రలో ఉన్న వీరేశం ఒక్కసారిగా లేచాడు. బయటకు వచ్చి చూసేసరికి దొంగ అప్పటికే అక్కడి నుంచి పారిపోయాడు. అయితే వీరేశానికి దొంగ గురించి తెలియదు. తన నిద్రను పాడు చేసినందుకు గాడిదపై కోపం వచ్చింది. “రాత్రంతా నిశ్శబ్దంగా ఉండకుండా ఎందుకు ఇలా అరుస్తున్నావు?” అంటూ గాడిదను కర్రతో కొట్టాడు.
అప్పుడు కుక్క మాట్లాడుతూ.. “చూశావా! ఎవరి పని వాళ్లు చేయాలి. బరువులు మోయడం నీ బాధ్యత. ఇంటికి కాపలా కాయడం నా బాధ్యత. నేను చేయాల్సిన పని నువ్వు చేస్తే నీకు ఇబ్బందే. నువ్వు చేయాల్సిన పని నేను చేస్తే నాకు ఇబ్బందే. ప్రతి ఒక్కరి పాత్ర వేరు. అందుకే ఎవరి పనిని బట్టి వారి విలువను నిర్ణయించకూడదు.” ఆ మాటలు విన్న గాడిదకు అసలు విషయం అర్థమైంది. కుక్క కూడా రోజంతా తనలా కనిపించే పని చేయకపోయినా.. అవసరమైన సమయంలో ఇంటిని కాపాడే బాధ్యతను నిర్వర్తించాల్సి ఉంటుంది.
కథలోని అసలైన సందేశం ఇదే
ఈ చిన్న కథలో రెండు సందేశాలు ఉన్నాయి. ఒకటి మనకు కనిపించని పని చేస్తున్న వారిని పనికిరాని వారిగా భావించడం పెద్ద పొరపాటు. ఒక వ్యక్తి చేసే పని మనకు చిన్నదిగా కనిపించవచ్చు. కానీ అతను చేసే పని లేకపోతే మనకు ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇంట్లో అయినా, ఉద్యోగంలో అయినా, సమాజంలో అయినా ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. ఒకరు సంపాదిస్తారు, మరొకరు ఇంటిని చూసుకుంటారు. ఒకరు ముందుండి పనిచేస్తారు, ఇంకొకరు వెనుక ఉండి సహాయం చేస్తారు. ఎవరి కృషి ఎక్కువో తక్కువో నిర్ణయించడం కంటే.. ప్రతి ఒక్కరి పాత్రను గౌరవించడం ముఖ్యం. కాబట్టి ఎవరినీ తక్కువగా అంచనా వేయకండి. ఎవరూ నిరుపయోగులు కాదు. సరైన సమయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి విలువ బయటపడుతుంది. మనకు కనిపించేది వారి పని మాత్రమే.. వారి అసలు అవసరం మాత్రం పరిస్థితి వచ్చినప్పుడే తెలుస్తుంది. ఇక రెండో సందేశం విషయానికొస్తే... మనకు ప్రావిణ్యత లేని మనకు అవగాహన లేని పనుల్లో జోక్యం చేసుకొని అభాసుపాలు కాకూడదనే మెసేజ్ కూడా ఉంది.

