తెలంగాణలో సినిమా టికెట్ ధరలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నాన్ ఏసీ నుంచి మల్టీప్లెక్స్‌ల వరకు టికెట్ ధరలు, షోలపై నిబంధనలు ప్రకటించింది.

టికెట్ ధరలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం 

తెలంగాణలో సినిమా టికెట్ ధరలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నాన్ ఏసీ, ఏసీ థియేటర్లతోపాటు స్పెషల్ థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల్లో టికెట్ ధరలపై కనిష్ఠ, గరిష్ఠ పరిమితులను నిర్ణయించింది. కొత్త నిబంధనల ప్రకారం థియేటర్లలో టికెట్ ధరలు ఇక నిర్దేశిత పరిమితుల్లోనే ఉండనున్నాయి. నాన్ ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియం కేటగిరీ టికెట్ ధర కనిష్ఠంగా రూ.30, గరిష్ఠంగా రూ.70గా నిర్ణయించారు. ప్రీమియం టికెట్ ధర కనిష్ఠంగా రూ.50, గరిష్ఠంగా రూ.100గా ఉంటుంది. ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.50 నుంచి రూ.150 వరకు, ప్రీమియం టికెట్ ధర రూ.100 నుంచి రూ.200 వరకు ఉండనుంది.

స్పెషల్ థియేటర్లు, మల్టీప్లెక్స్‌లకు ప్రత్యేక రేట్లు 

స్పెషల్ థియేటర్లలో నాన్ ప్రీమియం కేటగిరీ టికెట్ ధర కనిష్ఠంగా రూ.100, గరిష్ఠంగా రూ.250గా నిర్ణయించారు. ప్రీమియం రిక్లైనర్ టికెట్ ధర కనిష్ఠంగా రూ.200, గరిష్ఠంగా రూ.300 వరకు ఉండనుంది. ఇక మల్టీప్లెక్స్‌లలో రెగ్యులర్ టికెట్ ధర కనిష్ఠంగా రూ.100, గరిష్ఠంగా రూ.250గా, రిక్లైనర్ టికెట్ ధర రూ.200 నుంచి రూ.300 వరకు ఉండేలా ప్రభుత్వం నిర్ణయించింది. 7.1 సరౌండ్ సౌండ్ వ్యవస్థ, 2K లేదా 4K ప్రొజెక్షన్, కనీసం 75 అడుగుల తెర ఉన్న థియేటర్లను స్పెషల్ థియేటర్లుగా గుర్తించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీని ప్రకారం ప్రత్యేకమైన సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో కూడా టికెట్ ధర 300 ఉండే అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. హైదరాబాద్ లో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఎక్కువగా ఈ ప్రత్యేక కేటగిరీ కిందికే వస్తాయి. అంటే సామాన్యులకు ఈ టికెట్ ధరల బాదుడు తప్పదు.

రోజుకు ఐదు షోలకు అనుమతి 

కొత్త నిబంధనల ప్రకారం ప్రతి థియేటర్‌లో ఉదయం 8 గంటల నుంచి మిడ్ నైట్ 1 గంట వరకు ఐదు షోలకు అనుమతి ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఒక షోలో చిన్న సినిమాల ప్రదర్శనకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. పరిమిత బడ్జెట్‌తో తీసిన చిన్న సినిమాలకు పండుగల సమయంలో ప్రాధాన్యం ఇవ్వాలని కూడా పేర్కొంది. రూ.100 కోట్లకు పైగా పెట్టుబడితో తీసే చిత్రాలను సూపర్ హై బడ్జెట్ సినిమాలుగా గుర్తించనున్నారు. సూపర్ హై బడ్జెట్ చిత్రాలకు మొదటి 10 రోజులపాటు మాత్రమే టికెట్ ధరలు పెంచుకునే అవకాశం కల్పించారు.

సినీ కార్మిక సంక్షేమ నిధికి విరాళం ఇచ్చే చిత్రాలకు టికెట్ ధరల పెంపు 

సినీ కార్మిక సంక్షేమ నిధికి రూ.1 కోటి విరాళం ఇచ్చే చిత్రాలకు టికెట్ ధరలు పెంచుకునే అవకాశం ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పేద, మధ్య తరగతి ప్రేక్షకుల కోసం మల్టీప్లెక్స్‌లు ప్రతి థియేటర్‌లో 25 శాతం సీట్లు కేటాయించాలని ప్రభుత్వం సూచించింది. దీంతో సినిమా టికెట్ ధరల విషయంలో వివిధ వర్గాల ప్రేక్షకుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిబంధనలు రూపొందించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ విషయంలో కూడా ప్రభుత్వం పరిమితులను నిర్ణయించింది. ఏసీ థియేటర్లకు ఒక్కో టికెట్‌పై రూ.5, నాన్ ఏసీ థియేటర్లకు ఒక్కో టికెట్‌పై రూ.3ను నిర్వహణ ఛార్జీగా వసూలు చేసుకునే అవకాశం కల్పించింది.

థియేటర్లకు మార్పుల కోసం గడువు 

ప్రస్తుతం ఉన్న థియేటర్లకు సంబంధించి కూడా ప్రభుత్వం కీలక సూచన చేసింది. ఎయిర్ కూల్డ్ థియేటర్లను రెండేళ్లలో ఏసీ థియేటర్లుగా మార్చుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. మొత్తంగా తెలంగాణలో సినిమా టికెట్ ధరలు, షోల సంఖ్య, చిన్న సినిమాలకు ప్రాధాన్యం, సూపర్ హై బడ్జెట్ చిత్రాలకు టికెట్ ధరల పెంపు, మల్టీప్లెక్స్‌ల్లో సీట్ల కేటాయింపు, ఆన్‌లైన్ బుకింగ్ నిర్వహణ ఛార్జీల వరకు పలు అంశాలపై ప్రభుత్వం నిబంధనలు ప్రకటించింది. ఈ కొత్త మార్గదర్శకాలు థియేటర్ల నిర్వహణతోపాటు ప్రేక్షకులు సినిమా చూసేందుకు చెల్లించే టికెట్ ధరలపై కూడా ప్రభావం చూపనున్నాయి.