- Home
- Feature
- Dakshina Kailasam: గ్రహణ సమయంలోనూ మూయని ఏకైక గుడి.. ఈ ఆలయానికి జీవితంలో ఒక్కసారైనా ఎందుకు వెళ్లాలి?
Dakshina Kailasam: గ్రహణ సమయంలోనూ మూయని ఏకైక గుడి.. ఈ ఆలయానికి జీవితంలో ఒక్కసారైనా ఎందుకు వెళ్లాలి?
Dakshina Kailasam: గ్రహణ సమయంలోనూ మూయని ఏకైక గుడి వుందని మీకు తెలుసా? అదే పరమశివుడు కోలువైన శ్రీకాళహస్తి. దక్షిణ కైలాసంగా గుర్తింపు పొందిన ఈ ఆలయ చరిత్ర, వాయులింగ రహస్యం, సాలీడు పాము ఏనుగు కథ, రాహు కేతు పూజల ప్రాముఖ్యం పూర్తి వివరాలు మీకోసం.

దక్షిణ కైలాసంలో వాయులింగ రహస్యం: శ్రీకాళహస్తి ఆలయ విశేషాలు ఇవే
ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా, స్వర్ణముఖి నది ఒడ్డున వెలసిన పవిత్ర శైవ క్షేత్రం శ్రీకాళహస్తి. మన దేశంలో ఉన్న అత్యంత ప్రాచీన, మహిమాన్వితమైన ఆలయాల్లో ఇది ఒకటి. ఈ క్షేత్రాన్ని "దక్షిణ కైలాసం" లేదా "దక్షిణ కాశీ" అని ఎంతో భక్తితో పిలుస్తారు. పంచభూత క్షేత్రాలలో ఇది వాయులింగ క్షేత్రంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ పవిత్ర క్షేత్రం వెనుక ఉన్న ఆసక్తికరమైన చరిత్ర, ఆధ్యాత్మిక విశేషాలు, శాస్త్రీయ రహస్యాలు మిమ్మల్ని షాక్ కు గురిచేస్తాయి.
'శ్రీకాళహస్తి' అనే పేరు ఎలా వచ్చింది?
ఈ ఆలయానికి ఆ పేరు రావడం వెనుక ఒక అద్భుతమైన పురాణ కథ ఉంది. 'శ్రీ', 'కాళ', 'హస్తి' అనే మూడు పదాల కలయికతో శ్రీకాళహస్తి ఏర్పడింది.
• శ్రీ అంటే సాలీడు (సాలెపురుగు)
• కాళ అంటే కాళసర్పం (పాము)
• హస్తి అంటే ఏనుగు
ఈ మూడు జీవులు తమ తమ రీతుల్లో శివలింగాన్ని పూజించి మోక్షాన్ని పొందాయి. సాలీడు తన నూలు గూడుతో, పాము రత్నాలతో, ఏనుగు స్వర్ణముఖి నది నీరు, పూలతో పరమశివుడిని ఆరాధించాయి. వీరి నిష్కల్మషమైన భక్తికి మెచ్చి పరమేశ్వరుడు మోక్షాన్ని ప్రసాదించాడు. అందుకే ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది.
వాయులింగ రహస్యం, గర్భగుడి ఒక అద్భుతం
శ్రీకాళహస్తి ఆలయం పంచభూత స్థలాలలో వాయు తత్వానికి ప్రతీక. గర్భగుడిలో ఉండే శివలింగం స్వయంభూ, చతురస్రాకారంలో తెల్లని వర్ణంలో ఉంటుంది. ఇక్కడి అత్యంత విచిత్రమైన విషయం ఏమిటంటే, గర్భగుడిలో గాలి వీచడానికి ఎలాంటి మార్గాలు లేకపోయినా, శివలింగానికి ఇరువైపులా ఉండే అఖండ జ్యోతుల జ్వాలలు నిరంతరం రెపరెపలాడుతూ ఊగుతుంటాయి. ఇది స్వామివారి వాయు స్వరూపానికి, ఉచ్ఛ్వాస నిశ్వాసలకు ప్రత్యక్ష నిదర్శనమని భక్తులు బలంగా నమ్ముతారు. అంతేకాకుండా ఇక్కడి మూలవిరాట్టును పూజారులు కూడా నేరుగా చేతులతో తాకరు.
గ్రహణ సమయంలోనూ తెరిచే ఉండే ఏకైక క్షేత్రం
సాధారణంగా సూర్య గ్రహణం లేదా చంద్ర గ్రహణ సమయాల్లో దేశంలో ఉన్న అన్ని చిన్న, పెద్ద ఆలయాలను మూసివేస్తారు. కానీ శ్రీకాళహస్తి ఆలయం మాత్రం గ్రహణ సమయాల్లో కూడా తెరిచే ఉంటుంది. ఆ సమయంలో స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. గ్రహణ ప్రభావం పడని దివ్యమైన శక్తి ఈ క్షేత్రానికి ఉందని చెబుతారు.
రాహు-కేతు పూజలు, సర్పదోష నివారణ పూజలు
రాహు-కేతు దోషాలు, కాలసర్ప దోషాలు లేదా జాతకంలో తీవ్రమైన గ్రహ లోపాలు ఉన్నవారికి శ్రీకాళహస్తి ప్రసిద్ధ పరిహార క్షేత్రం. స్వామివారి నవగ్రహ కవచ విశేషం, జ్ఞానప్రసూనాంబ అమ్మవారి వద్ద కేతువు వడ్డాణంగా ఉండటం వల్ల, ఇక్కడ నిర్వహించే రాహు-కేతు నివారణ పూజల ద్వారా సకల దోషాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. అందుకే దేశ విదేశాల నుంచి రోజూ వేలాది మంది భక్తులు ఈ పూజల కోసం ఇక్కడికి వస్తుంటారు.
భక్త కన్నప్ప భక్తికి నిదర్శనం
శ్రీకాళహస్తి అనగానే ప్రతి ఒక్కరికీ వెంటనే గుర్తుకు వచ్చే మరొక గొప్ప కథ 'భక్త కన్నప్ప' (తిన్నడు). ఏ శాస్త్రాలు, పూజా విధానాలు తెలియని ఒక సామాన్య వేటగాడు తన నిస్వార్థ భక్తితో దేవుడిని ఎలా మెప్పించవచ్చో కన్నప్ప చరిత్ర నిరూపిస్తుంది. శివలింగం కంటి నుండి రక్తం కారుతుంటే చూసి తట్టుకోలేక, తన కంటిని తీసి లింగానికి అమర్చిన పరమ భక్తుడు కన్నప్ప. ఆయన భక్తికి పరవశించిన పరమశివుడు ప్రత్యక్షమై మోక్షాన్ని ప్రసాదించాడు. ఆలయానికి సమీపంలో ఉన్న కొండపై కన్నప్ప ఆలయం ఇప్పటికీ ఉంది.
ఈ క్షేత్రంలో అమ్మవారు 'జ్ఞానప్రసూనాంబిక'గా దర్శనమిస్తారు. భక్తులకు జ్ఞానాన్ని, బుద్ధి వికాసాన్ని ప్రసాదించే తల్లిగా అమ్మవారిని పూజిస్తారు. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ నిర్మించిన 120 అడుగుల రాజగోపురం, వంద కాళ్ల మండపం ఈ ఆలయ శిల్పకళా వైభవానికి నిదర్శనాలు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి.

