Motivational Story: ఏదీ శాశ్వతం కాదు.. ఈ కథ చదివితే మీ మనసు ప్రశాంతమవడం ఖాయం
Motivational Story: జీవితంలో ప్రతీ ఒక్కరం విజయం, ఆనందం, కీర్తి, సంపద ఇలా ఏదో ఒక దాని కోసం ప్రయత్నిస్తూనే ఉంటాం. అయితే జీవితమనే ప్రయాణంలో ఇవేవి శాశ్వతం కాదనే సత్యాన్ని మాత్రం గుర్తించాం. కానీ ఈ కథ చదివితే మీ ఆలోచన మారడం ఖాయం.

ఊరూరా తిరిగే సాధువుకు యువకుడి ఆతిథ్యం
ఒక సాధువు ఊరూరా తిరుగుతూ ఆధ్యాత్మిక విషయాలపై ప్రవచనాలు చెప్పేవాడు. ఒక గ్రామంలో ప్రవచనం పూర్తయిన తర్వాత అక్కడి ప్రజలు ఇచ్చిన కానుకలు స్వీకరించి, మరుసటి రోజు మరో గ్రామానికి వెళ్లడం ఆయనకు అలవాటు. ఒకసారి ఓ గ్రామంలో ప్రవచనం ముగిసేసరికి బాగా రాత్రయింది. అప్పటికే ప్రయాణం చేయడం సాధ్యం కాకపోవడంతో అదే గ్రామంలో రాత్రి గడపాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఓ యువకుడు ముందుకొచ్చి సాధువును తన ఇంటికి ఆహ్వానించాడు.
భోజనం పెట్టి, రాత్రికి బస చేసే ఏర్పాట్లు చేశాడు. అతడి ఆతిథ్యానికి సంతోషించిన సాధువు మరుసటి రోజు బయలుదేరే సమయంలో ‘‘నీ జీవితంలో సిరిసంపదలు వెల్లివిరియాలి. భగవంతుడు నీకు అన్నీ అనుగ్రహించాలి’’ అని ఆశీర్వదించాడు. అది విన్న యువకుడు చిరునవ్వుతో ‘‘స్వామీ.. తమ ఆశీర్వాదం ఎంతో గొప్పది. కానీ సంపద, సుఖం, అధికారం.. ఇవన్నీ ఎప్పటికీ మనతో ఉండవు కదా!’’ అన్నాడు. ఆ మాటలు సాధువును ఆలోచనలో పడేశాయి. యువకుడు చెప్పింది నిజమేనని అనిపించడంతో ఆయన మరేమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
సంపద పోయినా.. చిరునవ్వు మాత్రం పోలేదు
దాదాపు రెండేళ్లు గడిచాయి. అదే గ్రామానికి సాధువు మరోసారి వచ్చాడు. గతంలో తనకు ఆతిథ్యం ఇచ్చిన యువకుడు గుర్తుకు రావడంతో అతడిని కలవాలని అనుకున్నాడు. విచారించగా అతడి పరిస్థితి పూర్తిగా మారిపోయిందని తెలిసింది. ఒకప్పుడు ఆస్తిపాస్తులతో సౌకర్యంగా జీవించిన ఆ యువకుడు ఇప్పుడు తన సంపద మొత్తాన్ని కోల్పోయి ఓ భూస్వామి దగ్గర కూలీగా పనిచేస్తున్నాడు. ఈ విషయం తెలిసి సాధువు మనసు కలచిపోయింది. ఇంత మంచి మనిషికి ఇంతటి కష్టం ఎందుకు వచ్చిందని బాధపడ్డాడు.
కానీ యువకుడిని కలిసిన తర్వాత సాధువుకు ఆశ్చర్యం ఎదురైంది. ఆర్థికంగా ఎంతో కష్టాల్లో ఉన్నప్పటికీ అతడి ముఖంలో దిగులు కనిపించలేదు. గతంలో మాదిరిగానే ఆప్యాయంగా పలకరించి ఇంటికి తీసుకెళ్లాడు. తనకు చేతనైనంత ఆతిథ్యం ఇచ్చాడు.
అతడి పరిస్థితి చూసి సాధువు బాధపడుతుంటే యువకుడు మాత్రం ప్రశాంతంగా నవ్వుతూ ‘‘స్వామీ.. ఎందుకు బాధపడుతున్నారు? సుఖంగా ఉన్నప్పుడు దేవుడిని నమ్మాలి, కష్టాల్లో ఉన్నప్పుడు కూడా అదే విశ్వాసంతో ఉండాలి అని మీరే చెబుతుంటారు కదా! కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈ రోజు ఉన్న పరిస్థితి రేపు ఉండకపోవచ్చు. కాబట్టి కష్టాన్ని చూసి కుంగిపోవడం ఎందుకు?’’ అన్నాడు.
కష్టం కూడా శాశ్వతం కాదు..
యువకుడి మాటలు సాధువును మరింత ఆలోచింపజేశాయి. సంపద కోల్పోయినా అతడు తన మనశ్శాంతిని కోల్పోలేదు. తనకు జరిగిన నష్టాన్ని శాపంగా భావించలేదు. వచ్చిన పరిస్థితిని అంగీకరించి, తనకు చేతనైన పని చేసుకుంటూ సంతోషంగా జీవిస్తున్నాడు. ‘‘మన జీవితంలో ఏదీ మనం కోరుకున్నట్టే ఉండదు. కొన్ని రోజులు సుఖం వస్తుంది. మరికొన్ని రోజులు కష్టం ఎదురవుతుంది. ఒకసారి విజయం పలకరిస్తే మరోసారి ఓటమి ఎదురవుతుంది. ఇవన్నీ జీవిత ప్రయాణంలో సహజమైన మార్పులే. వాటిని శాశ్వతంగా భావించినప్పుడే మనకు బాధ మొదలవుతుంది’’ అని యువకుడు సాధువుతో చెప్పాడు. ఆ రోజు సాధువుకు ఒక విషయం స్పష్టమైంది. తాను ఎన్నో ఏళ్లుగా ఇతరులకు వైరాగ్యం, ప్రశాంతత గురించి బోధిస్తున్నా.. ఈ యువకుడు మాత్రం వాటిని తన జీవితంలో ఆచరిస్తున్నాడు.
అదృష్టం మళ్లీ తలుపు తట్టింది
మరికొంత కాలం గడిచింది. సాధువు మరోసారి అదే గ్రామానికి వెళ్లాడు. ఈసారి అక్కడ అతడికి మరో వార్త తెలిసింది. కొన్నేళ్ల క్రితం కష్టాల్లో ఉన్న ఆ యువకుడు ఇప్పుడు భారీ ఆస్తికి వారసుడయ్యాడు. ఆశ్చర్యపోయిన సాధువు అతడిని కలవగా యువకుడు జరిగిన విషయాన్ని వివరించాడు. తాను పనిచేసిన భూస్వామికి పిల్లలు లేరు. యువకుడి నిజాయితీ, నిబద్ధత, కష్టపడే స్వభావం ఆయనకు ఎంతో నచ్చాయి. చివరకు తన ఆస్తినంతా ఈ యువకుడి పేరున రాసి పెట్టాడు. అయితే సంపద వచ్చిందని యువకుడి జీవన విధానం మారలేదు. ‘‘ఈ ఆస్తి నాకు వచ్చింది కాబట్టి ఇది శాశ్వతంగా నాదని అనుకోవడం లేదు. నాకు లభించిన దాంట్లో కొంత ధర్మకార్యాలకు ఉపయోగిస్తున్నాను. అవసరంలో ఉన్నవారికి సాయం చేస్తున్నాను. మనకు దక్కిన సంపదకు అసలైన విలువ అప్పుడే వస్తుంది’’ అని చెప్పాడు. ఆ మాటలు విన్న సాధువు ఎంతో సంతోషించి ‘‘ఇప్పుడు నీ కష్టాలన్నీ తొలగిపోయాయి. ఇక జీవితాంతం సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను’’ అని ఆశీర్వదించాడు.
‘‘ఇది కూడా పోతుంది’’.. జీవితానికి అసలైన సత్యం
సాధువు మాటలు విన్న యువకుడు మరోసారి చిరునవ్వు నవ్వాడు. ‘‘స్వామీ.. తమరే ఇలా అంటున్నారా? కష్టం శాశ్వతం కాదని నాకు చెప్పింది మీరే కదా! మరి సుఖం మాత్రం శాశ్వతంగా ఎలా ఉంటుంది?’’ అని ప్రశ్నించాడు.
‘‘ఈ సంపద కూడా ఏదో ఒక రోజు నా నుంచి వెళ్లిపోవచ్చు. దాన్ని అనుభవించే మనిషి కూడా ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే. కాబట్టి సంపద వచ్చిందని పొంగిపోవడం లేదు. అది పోయిందని బాధపడను. సుఖం వచ్చినా స్వీకరిస్తాను. కష్టం వచ్చినా స్వీకరిస్తాను. ఎందుకంటే ఈ లోకంలో మార్పు తప్ప శాశ్వతమైనది ఏదీ లేదు. నిజంగా శాశ్వతమైనది ఏదైనా ఉందంటే అది పరమాత్మ ఒక్కడే’’ అని యువకుడు చెప్పాడు.
ఆ మాటలు విన్న సాధువు మౌనంగా నిలిచిపోయాడు. చివరకు అతడి చేతులు పట్టుకుని ‘‘నేను ఇన్నాళ్లు ప్రజలకు ప్రవచనాలు చెబుతున్నాను. కానీ నువ్వు చెప్పిన మాటలను నీ జీవితంలో ఆచరించావు. నిజమైన వైరాగ్యం అంటే అన్నీ వదిలేయడం కాదు.. అన్నీ ఉన్నా వాటిపై మితిమీరిన మమకారం లేకుండా జీవించడం. ఆ విషయంలో నువ్వే నాకు గురువు. నిజమైన సన్యాసివి నువ్వే’’ అన్నాడు.

