Milk : ఆవులు, బర్రెలు పచ్చగడ్డి తిని తెల్లని పాలు ఎలా ఇస్తాయి? అసలు పాలు ఎలా తయారవుతాయి?
ఆవులు, గేదెలు పచ్చని గడ్డిని మేస్తాయి… కానీ అవి ఇచ్చే పాలేమో తెల్లగా మెరిసిపోతూ ఉంటాయి… ఇదేలా సాధ్యం? ఈ డౌట్ మీలో చాలామందికి వచ్చివుంటుంది. మరి ఇది ఎలా సాధ్యమో ఇక్కడ తెలుసుకుందాం.

పశువుల పాల తయారీ వెనక ఇంత సీక్రెట్ దాగుందా..!
మన రోజువారీ జీవితంలో పాలు ఎంతో ముఖ్యమైన ఆహారం. ఉదయం లేవగానే టీ, కాఫీలు తాగడం నుండి రాత్రి పాలుతాగి పడుకునేవరకు పాలు లేదంటే పాల ఉత్పత్తులను అహారంగా తీసుకుంటాం. ఇక చిన్న పిల్లలకు ఇదే ప్రధాన అహారం... తల్లిపాలతో పాటు బయటి పాలు కూడా పడుతుంటారు. మనిషి ఆరోగ్యాన్ని కాపాడటం, వెంటనే శక్తి ఇవ్వడంలో పాలు కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే దేశవ్యాప్తంగా ప్రతిరోజు కొన్ని కోట్ల లీటర్ల పాలు ఉపయోగించబడుతున్నాయి.
అయితే పాలను చూస్తే ఒక ఆసక్తికరమైన సందేహం చాలామందికి వస్తుంది. పశువులు (ఆవు లేదా గేదె) పచ్చగా ఉండే గడ్డిని తింటాయి.. కానీ అవి ఇచ్చే పాలు మాత్రం తెల్లగా ఉంటాయి అని. అసలు పచ్చగడ్డి నుంచి తెల్లని పాలు ఎలా తయారవుతాయి? గడ్డి రంగులో పాలు ఎందుకుండవు, తెల్లగానే ఎందుకుంటాయి? పశువుల శరీరంలో జరిగే ప్రక్రియ ఏమిటి? అనేవి తెలుసుకుందాం.
పచ్చగడ్డి తినే పశువుల పాలు తెల్లగా ఎందుకుంటాయి?
పశువులు తినే గడ్డి, ఆకుల్లో (పశుగ్రాసంలో) కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, ఖనిజాలు, విటమిన్లు వంటి అనేక పోషకాలు ఉంటాయి. అయితే ఆకులకు పచ్చని రంగును ఇచ్చేది క్లోరోఫిల్ అనే వర్ణద్రవ్యం. గడ్డి ద్వారా ఈ క్లోరోఫిల్ పశువులు కడుపులోకి వెళుతుంది... కానీ ఇది నేరుగా పాలలోకి వెళ్లదు.
పశువులు తినే ఆహారం మొదట జీర్ణవ్యవస్థలోకి వెళ్లి అనేక దశల్లో జీర్ణమవుతుంది. అందులోని పోషకాలు చిన్న చిన్న అణువులుగా విడిపోయి శరీరానికి ఉపయోగపడే రూపంలోకి మారతాయి. అంటే ఇక్కడే గడ్డిలోని క్లోరోఫిల్ కూడా పూర్తిగా విచ్ఛిన్నమైపోతుంది... అంటే ఆకుపచ్చ రంగుని కోల్పోతుందన్నమాట.
ఇలా గడ్డిలోని పోషకాలన్ని విచ్చిన్నమై పశువుల శరీరానికి శక్తినివ్వడంతో పాటు కణాల నిర్మాణం, శరీర కార్యకలాపాల కోసం ఉపయోగపడతాయి. పాల ఉత్పత్తికి అవసరమైన పదార్థాలను కూడా పశువులు ఇదే ప్రక్రియ ద్వారా సమకూర్చుకుంటాయి.
పశువుల జీర్ణవ్యవస్థ ప్రత్యేకత ఏమిటి?
పశువులు ఒక రుమినెంట్ జంతువులు. అంటే గడ్డిని జీర్ణించుకోవడానికి ప్రత్యేకమైన జీర్ణవ్యవస్థ కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఆవు కడుపులో నాలుగు ప్రధాన భాగాలు ఉంటాయి. వాటిలో రూమెన్ అనే భాగంలో అనేక సూక్ష్మజీవులు నివసిస్తాయి. ఆవు తినే గడ్డిలో ఉండే సెల్యులోజ్ వంటి సంక్లిష్ట పదార్థాలను ఆవు స్వయంగా పూర్తిగా జీర్ణించుకోలేదు. కాబట్టి రూమెన్‌లో ఉండే బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు వాటిని విచ్ఛిన్నం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ ప్రక్రియలో వోలటైల్ ఫ్యాటీ యాసిడ్స్ (VFAs) వంటి పదార్థాలు ఏర్పడతాయి. వీటిలో ముఖ్యంగా అసిటేట్, ప్రొపియోనేట్, బ్యూటిరేట్ ఆవు శరీరానికి శక్తి, ఇతర జీవక్రియలకు అవసరమైన పదార్థాలను అందిస్తాయి.
ఇలా ఆవుల జీర్ణ వ్యవస్థలో ఏర్పడే పోషకాలు రక్తంలోకి లేదా ఇతర శోషణ అవయవాల్లోకి చేరి శరీరంలోని వివిధ భాగాలకు చేరుతాయి. ఇలా పాల గ్రంథులకు కూడా అవసరమైన పోషకాలు రక్తం ద్వారా అందుతాయి.
పాలు ఎక్కడ తయారవుతాయి?
పాడిపశువుల శరీరంలో పాలు తయారయ్యే ప్రధాన అవయవం పొదుగు (udder). పొదుగులో నాలుగు పాల గ్రంథి భాగాలు ఉంటాయి. ప్రతి భాగంలో చిన్న చిన్న నిర్మాణాలు, ముఖ్యంగా అల్వియోలీ ఉంటాయి. వీటిలో ఉండే పాల తయారీ కణాలను మామరీ ఎపితీలియల్ కణాలు అంటారు.
పశువులు తిన్న ఆహారం జీర్ణమైన తర్వాత అందులోని పోషకాల నుంచి అవసరమైన పదార్థాలు రక్తం ద్వారా పాల గ్రంథులకు చేరుతాయి. అక్కడి కణాలు వాటిని ఉపయోగించి పాలలో ఉండే వివిధ భాగాలను తయారు చేస్తాయి. అంటే గడ్డి నేరుగా పాలు కావడం కాదు... గడ్డిలోని పోషకాలు జీర్ణమై, శరీరంలో జరిగే జీవరసాయన ప్రక్రియల ద్వారా పాలలోని పదార్థాలుగా మారతాయి.
ఇలా ఆవులు, గేదెల్లో తయారయ్యే పాలలో ప్రధానంగా నీరు ఉంటుంది. దానితో పాటు లాక్టోస్, కొవ్వు, ప్రోటీన్లు, ఖనిజాలు, విటమిన్లు వంటి అనేక పదార్థాలు ఉంటాయి. లాక్టోస్ అనేది పాలలోని ప్రధాన చక్కెర. ఇది పాల గ్రంథి కణాల్లో గ్లూకోజ్ నుంచి తయారవుతుంది. లాక్టోస్ తయారవుతున్నప్పుడు నీరు కూడా పాలలోకి చేరుతుంది. అందుకే పాలలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది.
పాలలోని ముఖ్యమైన ప్రోటీన్లలో కేసిన్ ఒకటి. పాల గ్రంథి కణాలు రక్తం నుంచి వచ్చిన అమైనో ఆమ్లాలను ఉపయోగించి కేసిన్ వంటి పాల ప్రోటీన్లను తయారు చేస్తాయి. అదే విధంగా పాల కొవ్వు కూడా పాల గ్రంథి కణాల్లో ప్రత్యేకమైన జీవరసాయన ప్రక్రియల ద్వారా తయారవుతుంది. ఇలా పశువుల ఆహారంలో ఉన్న పోషకాలు ఈ ప్రక్రియలకు అవసరమైన ముడి పదార్థాలను అందిస్తాయి.
పాలు తెల్లగా కనిపించడానికి కారణం ఏమిటి?
పాలు తెల్లగా కనిపించడానికి గడ్డి రంగుకు ఎలాంటి సంబంధం లేదు. పాలలో కేసిన్ అనే ప్రోటీన్ సూక్ష్మ కణాల రూపంలో ఉంటుంది. పాలలోని కొవ్వు బిందువులు, కేసిన్ కణాలు కాంతిని వివిధ దిశల్లో చెదరగొట్టడం (light scattering) వల్ల పాలు మన కళ్లకు తెల్లగా ఉన్నట్లు కనిపిస్తాయి.
పాలలో ఉండే సహజ వర్ణద్రవ్యాలు, ముఖ్యంగా కొవ్వులో కరిగే కొన్ని పదార్థాలు పాలకు స్వల్పంగా క్రీమ్ లేదా పసుపు ఛాయను ఇస్తాయి. అందుకే పశువుల జాతి, ఆహారం, పాలలోని కొవ్వు శాతం వంటి అంశాల ఆధారంగా పాల రంగులో స్వల్ప తేడాలు కనిపించవచ్చు. కాబట్టి పశువులు పచ్చగడ్డి తిన్నా పాలు తెల్లగానే కనిపిస్తాయి.
పశువుల రక్తం నుంచి పాలు తయారవుతాయా?
పాల తయారీ గురించి మరో ఆసక్తికరమైన విషయం ఉంది. సాధారణంగా “పాలు రక్తం నుంచి తయారవుతాయి” అని చెబుతుంటారు... కానీ ఇది పూర్తిగా నిజం కాదు, అలాగని అబద్దం కూడా కాదు. పాల తయారీకి రక్తం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది... కానీ రక్తమే పాలలా మారదు.
పశువుల రక్తం పాల గ్రంథులకు గ్లూకోజ్, అమైనో ఆమ్లాలు, కొవ్వు ఆమ్లాలకు సంబంధించిన పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు వంటి అవసరమైన పోషకాలను తీసుకెళ్తుంది. పాల గ్రంథి కణాలు ఈ పదార్థాలను తీసుకుని తమకు అవసరమైన జీవరసాయన ప్రక్రియల ద్వారా లాక్టోస్, కేసిన్, పాల కొవ్వు, ఇతర పాల భాగాలను తయారు చేస్తాయి.
అందువల్ల రక్తం నేరుగా పాలు కాదు.. పాల తయారీకి అవసరమైన ముడి పదార్థాలను పాల గ్రంథులకు చేరవేసే రవాణా వ్యవస్థలా పనిచేస్తుంది.
దూడ పుట్టిన తర్వాత పాల ఉత్పత్తి ఎలా పెరుగుతుంది?
పశువులు దూడకు జన్మనిచ్చిన తర్వాత పాల ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియలో హార్మోన్లకు కీలకమైన పాత్ర ఉంటుంది. దూడ పాలుతాగే సమయంలో పొదుగులోని నరాల ద్వారా సంకేతాలు మెదడుకు చేరతాయి. దానికి ప్రతిస్పందనగా ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలై పాల గ్రంథుల్లో తయారైన పాలు బయటకు రావడానికి సహాయపడుతుంది. దీనినే సాధారణంగా “milk let-down” ప్రక్రియగా పేర్కొంటారు.
ప్రసవం తర్వాత మొదట వచ్చే పాలను కొలస్ట్రమ్ (ముర్రుపాలు) అంటారు. ఇందులో దూడకు అవసరమైన రోగనిరోధక పదార్థాలు, ముఖ్యంగా ఇమ్యూనోగ్లోబులిన్లు, ఎక్కువగా ఉంటాయి. కొంతకాలం తర్వాత సాధారణ పాలు ఉత్పత్తి అవుతాయి.

