- Home
- Entertainment
- Bigg Boss 20: బిగ్ బాస్ 20 గ్రాండ్ లాంచ్.. మేరీ కోమ్ నుంచి కనికా మాన్ వరకు.. హౌస్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్లు వీరే
Bigg Boss 20: బిగ్ బాస్ 20 గ్రాండ్ లాంచ్.. మేరీ కోమ్ నుంచి కనికా మాన్ వరకు.. హౌస్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్లు వీరే
Bigg Boss 20: సల్మాన్ ఖాన్ హోస్టింగ్‌లో బిగ్ బాస్ 20 గ్రాండ్‌గా ప్రారంభమైంది. మేరీ కోమ్, కనికా మాన్‌తో పాటు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

బిగ్ బాస్ 20లోకి ఒలింపిక్ ఛాంపియన్ మేరీ కోమ్.. తొలి రోజే సింగిల్ బెడ్ రగడ
బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ మళ్లీ వచ్చేసింది. హిందీ బిగ్ బాస్ మైలురాయి లాంటి 20వ సీజన్ చాలా గ్రాండ్‌గా మొదలైంది. బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా మళ్లీ స్టేజ్ పై అలరించారు. ఈ కొత్త సీజన్‌లో నటులు, సింగర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, గేమర్లు, రాపర్లతో పాటు భారత్ గర్వించదగ్గ బాక్సింగ్ లెజెండ్ ఎంసీ మేరీ కోమ్ కూడా హౌస్‌లోకి అడుగుపెట్టారు.
జియో హాట్‌స్టార్ లో రాత్రి 9 గంటలకు, కలర్స్ టీవీ లో రాత్రి 10:30 గంటలకు ఈ గ్రాండ్ ప్రీమియర్ స్ట్రీమింగ్ అయింది. ఈ సీజన్ కోసం 'వర్దాన్' అనే వినూత్న థీమ్‌ను పరిచయం చేశారు. "తథాస్తు", "ఏక్ సే భలే దో" అంటూ సల్మాన్ ఖాన్ ఈసారి సరికొత్త ట్విస్టులు ఉండబోతున్నాయని చెప్పారు. అలాగే హౌస్‌లోని 'రూమ్ నంబర్ 20' చుట్టూ తిరిగే మిస్టరీ షోపై మరింత ఉత్కంఠను పెంచింది. షో ప్రారంభంలో సల్మాన్ ఖాన్ తన ఐకానిక్ సాంగ్స్ 'బేబీ కో బేస్ పసంద్ హై', 'జీనే కే హై చార్ దిన్' పాటలకు అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అలాగే ఇండస్ట్రీలో తన 38 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు.
గ్రాండ్ ఎంట్రీలు.. తొలిరోజే మేరీ కోమ్ బెడ్ రగడ
ప్రీమియర్ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లు ఒక్కొక్కరుగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. టీవీ నటి కనికా మాన్ మొదటి కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి వెళ్లారు. ఆమె గుడ్డన్ తుమ్సే నా హో పాయేగా, నాగిన్ 7, ఖత్రోన్ కే ఖిలాడీ 12 షోలతో పాపులర్ అయ్యారు. సల్మాన్ ఖాన్ వాళ్ల అమ్మగారు కనికాకు పెద్ద ఫ్యాన్ అని ఈ సందర్భంగా సల్మాన్ చెప్పారు.
రెండో కంటెస్టెంట్‌గా 'పంచాయత్', 'మిర్జాపూర్', 'పాతాళ్ లోక్' నటుడు ఆసిఫ్ ఖాన్ ఎంట్రీ ఇచ్చారు. సల్మాన్ 'రెడీ' సినిమాలో తాను ఒక జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేశానని చెబుతూ ఆసిఫ్ స్టేజ్ మీద భావోద్వేగానికి గురయ్యారు.
ఇక ఈ సీజన్‌లో అందరినీ ఆశ్చర్యపరిచిన ఎంట్రీ ఒలింపిక్ విజేత, ఆరుసార్లు వరల్డ్ ఛాంపియన్ ఎంసీ మేరీ కోమ్. ఆమె తన ఇద్దరు కొడుకులతో కలిసి షోకి వచ్చారు. నటి ప్రియాంక చోప్రా మేరీ కోమ్‌కు ప్రత్యేకంగా ఆల్ ది బెస్ట్ చెప్పారు. అయితే హౌస్‌లోకి వెళ్లిన వెంటనే మేరీ కోమ్‌కి ఒక చిన్న ఛాలెంజ్ ఎదురైంది. సింగిల్ బెడ్ కోసం ఆమె సింగర్ ఖాజీ తౌకీర్‌ను అడుగగా, అతను బెడ్ మార్చుకోవడానికి నిరాకరించాడు. దీంతో హౌస్‌మేట్స్ మధ్య కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది.
భావోద్వేగాలు.. భోజ్‌పురి స్టార్ల సందడి
పంజాబీ నటి ఇషా రిఖీ హౌస్‌లోకి అడుగుపెడుతూనే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇటీవల రాపర్ బాద్‌షాతో విడాకులు తీసుకున్న ఆమెకు, పాత విషయాలు మరిచిపోయి ముందుకెళ్లాలని సల్మాన్ సలహా ఇచ్చారు. భోజ్‌పురి నటి ఆమ్రపాలి దూబే ఎంట్రీ ఇస్తూ సల్మాన్ ఖాన్ పాపులర్ క్యారెక్టర్ 'ప్రేమ్'ను 'గ్రీన్ ఫ్లాగ్' అని అభివర్ణించారు. ఆమ్రపాలికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి భోజ్‌పురి స్టార్ దినేష్ లాల్ యాదవ్ కూడా స్టేజ్‌పైకి వచ్చారు.
మాజీ ఎంపీ, నటుడు మనోజ్ తివారి తన కుమార్తె రీతి తివారిని హౌస్‌లోకి పంపడానికి వచ్చారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ సీజన్ 4లో మనోజ్ తివారికి, డాలీ బింద్రాకు మధ్య జరిగిన అండా వివాదాన్ని సల్మాన్ గుర్తుచేసుకుని నవ్వులు పూయించారు. అలాగే ఇటీవల భర్త జై భానుషాలితో విడాకులు తీసుకున్న ప్రముఖ టీవీ నటి మాహీ విజ్ చివరి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు. తన పిల్లల ప్రోత్సాహంతోనే బిగ్ బాస్‌కి వచ్చానని ఆమె తెలిపారు.
యూట్యూబర్లు, రాపర్లు.. బిగ్ బాస్ 20 కంటెస్టెంట్ల పూర్తి జాబితా
బిగ్ బాస్ 20 హౌస్‌లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్ల వివరాలు గమనిస్తే..
1. కనికా మాన్ - టీవీ నటి, మోడల్ (గుడ్డన్ తుమ్సే నా హో పాయేగా ఫేమ్)
2. ఆసిఫ్ ఖాన్ - బాలీవుడ్ నటుడు (పంచాయత్, మిర్జాపూర్, పాతాళ్ లోక్)
3. ఖాజీ అహ్మద్ తౌకీర్ - సింగర్ ('అఫ్గాన్ జలేబీ' ఫేమ్, ఫేమ్ గురుకుల్ విజేత)
4. ఇషా రిఖీ - పంజాబీ, హిందీ నటి
5. ఆమ్రపాలి దూబే - భోజ్‌పురి నటి ('క్వీన్ ఆఫ్ భోజ్‌పురి సినిమా')
6. రోహెద్ ఖాన్ - ఆస్ట్రియన్ నటుడు, మోడల్ (బడే మియాన్ చోటే మియాన్ 2024)
7. లవ్ గిల్ - పంజాబీ నటి (రియా అహిర్‌ను ఓడించి ఎంట్రీ ఇచ్చారు)
8. ఎంసీ మేరీ కోమ్ - ఒలింపిక్ బాక్సింగ్ విజేత, మాజీ ఎంపీ
9. యంగ్ డీఎస్ఏ (హర్ష్ విజయ్ మచారే) - పూణేకి చెందిన రాపర్, సాంగ్ రైటర్
10. స్కౌట్ ఓపీ (తన్మయ్ సింగ్) - పాపులర్ యూట్యూబర్, గేమర్
11. అరీష్ఫా ఖాన్ - టీవీ నటి, చైల్డ్ ఆర్టిస్ట్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్
12. అమన్ గాంధీ - రియాలిటీ టీవీ స్టార్
13. గుల్లు (కుశాల్ తన్వార్) - రోడీస్, స్ప్లిట్స్విల్లా విన్నర్
14. ఉదితి సింగ్ - నటి ('జానే జాన్' ఫేమ్)
15. రీతి తివారి - సింగర్, మ్యూజిక్ ప్రొడ్యూసర్ (మనోజ్ తివారి కుమార్తె)
16. మాహీ విజ్ - టీవీ నటి (లాగీ తుజ్సే లగన్, బాలికా వధు ఫేమ్)
గేమ్ స్టార్ట్
తొలిరోజే కంటెస్టెంట్లు తమ వ్యక్తిత్వాలను బయటపెట్టడం మొదలుపెట్టారు. రాబోయే రోజుల్లో ఫ్రెండ్‌షిప్‌లు, గొడవలు, డ్రామా ఏ రేంజ్‌లో ఉంటాయో ఈ ప్రీమియర్ ఎపిసోడ్ ప్రూవ్ చేసింది. సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజూ రాత్రి 9 గంటలకు జియో హాట్‌స్టార్‌లో, రాత్రి 10:30 గంటలకు కలర్స్ టీవీలో ఈ షో ప్రసారం కానుంది. శని, ఆదివారాల్లో సల్మాన్ ఖాన్ 'వీకెండ్ కా వార్'తో ఎలిమినేషన్స్ నిర్వహించనున్నారు.

