- Home
- Business
- షేర్ మార్కెట్లో రిస్క్, వడ్డీకిస్తే భయం.. ఏ టెన్షన్ లేకుండా రూ. 15 లక్షలు పెడితే నెలకు రూ. 9 వేలు వచ్చే స్కీమ్
షేర్ మార్కెట్లో రిస్క్, వడ్డీకిస్తే భయం.. ఏ టెన్షన్ లేకుండా రూ. 15 లక్షలు పెడితే నెలకు రూ. 9 వేలు వచ్చే స్కీమ్
Post office: ప్రతి నెలా స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS) మంచి పెట్టుబడి అవకాశంగా చెప్పొచ్చు. మార్కెట్‌లో ఉండే ఒడిదుడుకులు, రిస్క్‌లకు దూరంగా ఉండాలనుకునే వారు ఈ పథకాన్ని ఎక్కువగా ఎంచుకుంటున్నారు.

పోస్టాఫీస్ MIS స్కీమ్ అంటే ఏమిటి?
పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న చిన్న పొదుపు పథకాలలో ఒకటి. ఇందులో పెట్టుబడి పెట్టిన మొత్తంపై ప్రభుత్వం నిర్ణయించిన వడ్డీ రేటు ప్రకారం ప్రతి నెలా ఆదాయం అందుతుంది. పెట్టుబడిపై భద్రతతో పాటు నెలనెలా నిర్దిష్ట మొత్తంలో వడ్డీ రావడం వల్ల ఈ పథకానికి మంచి ఆదరణ ఉంది. బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల మాదిరిగానే ఇది కూడా సురక్షితమైన పెట్టుబడిగా పరిగణిస్తారు. అయితే ఇందులో ప్రత్యేకత ఏమిటంటే, వడ్డీ మొత్తం ప్రతి నెలా ఖాతాలో జమ అవుతుంది.

గరిష్ఠంగా ఎంత పెట్టుబడి పెట్టవచ్చు?
ఈ పథకంలో పెట్టుబడికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒక వ్యక్తి తన పేరుతో తెరిచే సింగిల్ అకౌంట్‌లో గరిష్ఠంగా రూ.9 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అదే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి జాయింట్ అకౌంట్ తెరిస్తే మొత్తం రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ పథకంపై ప్రభుత్వం ఏడాదికి 7.4 శాతం వడ్డీ అందిస్తోంది. ఈ వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తూ ఉంటుంది. వడ్డీ నేరుగా పెట్టుబడిదారుల ఖాతాలో ప్రతి నెలా జమ అవుతుంది.
రూ.15 లక్షల పెట్టుబడిపై నెలకు ఎంత ఆదాయం వస్తుంది?
జాయింట్ అకౌంట్ ద్వారా గరిష్ఠ పరిమితి అయిన రూ.15 లక్షలు పెట్టుబడి పెడితే ప్రస్తుత 7.4 శాతం వడ్డీ రేటు ప్రకారం ఏడాదికి సుమారు రూ.1.11 లక్షల వడ్డీ లభిస్తుంది. ఈ మొత్తాన్ని నెలవారీగా లెక్కిస్తే దాదాపు రూ.9,249 వరకు ఆదాయం వస్తుంది. అంటే ప్రతి నెలా దాదాపు రూ.9,250 వరకు కచ్చితమైన ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగ విరమణ చేసినవారు లేదా అదనపు ఆదాయం కోసం చూస్తున్నవారికి ఈ మొత్తం నెలవారీ ఖర్చుల్లో కొంత ఉపశమనాన్ని అందిస్తుంది.
5 సంవత్సరాల్లో మొత్తం ఎంత వడ్డీ వస్తుంది?
పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ మెచ్యూరిటీ కాలం ఐదు సంవత్సరాలు. ఈ కాలం మొత్తం పెట్టుబడిదారుడు ప్రతి నెలా వడ్డీ రూపంలో ఆదాయం పొందుతూనే ఉంటాడు. రూ.15 లక్షల పెట్టుబడిపై ఏడాదికి సుమారు రూ.1.11 లక్షల వడ్డీ వస్తే, ఐదు సంవత్సరాల వ్యవధిలో మొత్తం సుమారు రూ.5.55 లక్షల వరకు వడ్డీ ఆదాయం లభిస్తుంది. మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత అసలు పెట్టుబడి అయిన రూ.15 లక్షలు కూడా తిరిగి పొందవచ్చు. అందువల్ల పెట్టుబడి భద్రతతో పాటు స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి ఇది మంచి ఎంపికగా నిలుస్తోంది.
ముందుగానే డబ్బు తీసుకోవచ్చా? పన్ను నిబంధనలు ఏంటి?
ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన తర్వాత ఒక సంవత్సరం పూర్తికాకముందు డబ్బు ఉపసంహరించుకునే అవకాశం ఉండదు. ఒక సంవత్సరం తర్వాత కానీ మూడు సంవత్సరాల లోపు ఖాతాను మూసివేస్తే పెట్టుబడి మొత్తంలో రెండు శాతం కోత విధిస్తారు. మూడు సంవత్సరాల తర్వాత కానీ ఐదు సంవత్సరాల మెచ్యూరిటీకి ముందు ఖాతాను మూసివేస్తే ఒక శాతం కోత విధిస్తారు. పన్నుల విషయానికి వస్తే ఈ పథకంలో పెట్టుబడిపై ఎలాంటి పన్ను మినహాయింపు లభించదు. అలాగే వచ్చే వడ్డీ మొత్తాన్ని పెట్టుబడిదారుడి వార్షిక ఆదాయంలో కలిపి ఆయా ఆదాయపు పన్ను శ్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే పోస్టాఫీస్ ఈ వడ్డీపై టిడిఎస్ కట్ చేయదు. దీంతో వడ్డీ మొత్తం నేరుగా ఖాతాదారుడి చేతికి చేరుతుంది.

