Gold: బంగారాన్ని నగల రూపంలో కాకుండా ఇలా పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు
Gold: బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు చాలా మంది నగల రూపంలో కొనుక్కుంటారు. నిజానికి తరుగు, మజూరీ వంటి అదనపు ఖర్చులు లేకుండా బంగారంలో ఎలా పెట్టుబడి పెట్టాలో వివరంగా తెలుసుకోండి.

బంగారాన్ని నగల రూపంలో కొనాలా వద్దా?
భారతీయులకు బంగారం అంటే ఎంతో ఇష్టం. ఇప్పుడు ఇది పెట్టుబడిగా మారిపోయింది. సంప్రదాయం, భద్రత. పెళ్లిళ్లు, పిల్లల భవిష్యత్తు, పండగల కోసం బంగారు నగలు కొనడం మనకు అలవాటు. కానీ, పెట్టుబడి కోసమే బంగారం కొంటుంటే ఆ బంగారాన్ని నగల రూపంలో కొనవచ్చా? మరి ఇంకెలా కొనాలి? ఇక్కడ తెలుసుకోండి.
బంగారాన్ని నగల రూపంలో కొన్నప్పుడు కేవలం బంగారం విలువ మాత్రమే కాదు. దానిలో తరుగు, మజూరీ, డిజైన్ ఛార్జీలు, పన్నులు.. ఇలా చాలా ఖర్చులు కలిసి ఉంటాయి. నగల డిజైన్, కొనే షాపును బట్టి ఈ అదనపు ఖర్చులు భారీగా మారుతాయి. ఉదాహరణకు మీరు కొంత మొత్తానికి బంగారం కొన్నా, మీరు చెల్లించిన పూర్తి మొత్తం బంగారం విలువగా మారదు. తర్వాత ఆ నగలను అమ్మేటప్పుడు, మీరు అప్పుడు చెల్లించిన మజూరీ, ఇతర ఛార్జీలు పూర్తిగా వెనక్కి రాకపోవచ్చు. అందుకే, పెట్టుబడి కోసం కొనే బంగారానికి నగల రూపం అదనపు ఖర్చును తెచ్చిపెడుతుంది.
24 క్యారెట్ల బంగారంగా కొనండి
పెట్టుబడి కోసం బంగారం కొనాలనుకునేవారు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారు నాణేలు లేదా బిస్కెట్లను కొనడం మంచిది. ముఖ్యంగా నమ్మకమైన అమ్మకందారుల నుంచి నాణ్యతా ధృవీకరణ పత్రంతో (purity certificate) కొనడం చాలా ముఖ్యం. నగల మాదిరిగా డిజైన్ ఖర్చులు ఎక్కువగా ఉండవు కాబట్టి, బంగారం అసలు విలువపై పెట్టుబడి పెట్టడానికి ఇది సహాయపడుతుంది. అయితే, కొనే ధర, అమ్మే ధరకు మధ్య ఉండే తేడాను ముందుగానే గమనించాలి.

