- Home
- Business
- తల్లి గాజులు అమ్మి వ్యాపారం మొదలు పెట్టాడు.. నేడు రూ. 11,250 కోట్ల సామాజ్రాన్ని సృష్టించాడు
తల్లి గాజులు అమ్మి వ్యాపారం మొదలు పెట్టాడు.. నేడు రూ. 11,250 కోట్ల సామాజ్రాన్ని సృష్టించాడు
Success Story: వ్యాపారం చేయాలంటే పెద్ద చదువు ఉండాలి.. భారీగా డబ్బు ఉండాలని భావిస్తారు. కానీ కష్టపడే తత్వం, వ్యాపారంపై అవగాహన ఉంటే పరిస్థితులు ఎలా ఉన్నా భారీ విజయాన్ని సాధించవచ్చని నిరూపించారు లలితా జ్యువెలరీ వ్యవస్థాపకుడు కిరణ్ కుమార్.

పేదరికం కారణంగా చిన్న వయసులోనే చదువుకు స్వస్తి
కిరణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో ఒక పెద్ద కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులకు ఎనిమిది మంది పిల్లలు. తండ్రి ఆభరణాల మార్కెట్‌లోని పలువురు జువెలర్ల వద్ద అకౌంటెంట్‌గా పనిచేసేవారు. వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించడం చాలా కష్టంగా ఉండేది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడంతో కిరణ్ కుమార్ ఐదో తరగతి తర్వాత చదువు మానేయాల్సి వచ్చింది. చిన్న వయసులోనే కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. 12 ఏళ్ల వయసులో నెల్లూరులోని ఆభరణాల మార్కెట్‌లో పని చేయడం ప్రారంభించారు. ఆ రోజుల్లో కనీస అవసరాలు కూడా తీర్చుకోవడం కష్టంగా ఉండేది. ఒకసారి బంధువుల పెళ్లికి వెళ్లేందుకు స్నేహితుడి టీషర్ట్ కూడా అప్పుగా తీసుకుని వేసుకున్న పరిస్థితి ఆయనకు ఎదురైంది. అయితే ఈ కష్టాలు ఆయనను వెనక్కి తగ్గించలేదు.
తల్లి ఇచ్చిన నాలుగు గాజులతో వ్యాపారం ప్రారంభం
ఆభరణాల మార్కెట్‌లో పనిచేస్తున్న సమయంలో కిరణ్ కుమార్ ఒక విషయాన్ని గమనించారు. నెల్లూరులో తయారయ్యే బంగారు ఆభరణాలను చెన్నై, హైదరాబాద్ వంటి పెద్ద నగరాలకు పంపేవారు. మధ్యవర్తుల ద్వారా కాకుండా తానే నేరుగా పెద్ద మార్కెట్లలో విక్రయిస్తే ఎక్కువ లాభం పొందవచ్చని ఆయన ఆలోచించారు.
అయితే వ్యాపారం ప్రారంభించేందుకు ఆయన వద్ద డబ్బు లేదు. ఆ సమయంలో తల్లి అండగా నిలిచారు. తన వద్ద ఉన్న బంగారంలో నుంచి నాలుగు గాజులను కిరణ్‌కు ఇచ్చారు. వాటి బరువు సుమారు 48 గ్రాములు. కిరణ్ ఆ గాజులను ఒక స్వర్ణకారుడి వద్దకు తీసుకెళ్లి వాటితో ఆరు చెవి దిద్దులు తయారు చేయించారు. వాటిని తీసుకుని నేరుగా చెన్నైకి వెళ్లారు. చెన్నైలోని టీ.నగర్‌లో అప్పటి లలితా జ్యువెలరీ యజమాని ఎం.ఎస్. కందసామి పిళ్లైను కలిశారు. అప్పటికే రాత్రి కావడంతో దుకాణం మూసే సమయం వచ్చింది. అయినప్పటికీ కిరణ్ తీసుకొచ్చిన ఆభరణాలను పరిశీలించిన పిళ్లై వాటి నాణ్యతను మెచ్చుకున్నారు. మొదట 100 గ్రాముల ఆభరణాలకు ఆర్డర్ ఇచ్చారు. ఆ పని నచ్చడంతో ఆర్డర్ 200 గ్రాములకు పెరిగింది. దీంతో కిరణ్ నెల్లూరు నుంచి చెన్నైకి బస్సులో ప్రయాణిస్తూ ఆభరణాల వ్యాపారం కొనసాగించారు.
1999లో కీలక నిర్ణయం
కిరణ్ కుమార్ వ్యాపారం క్రమంగా విస్తరించింది. చెన్నైతో పాటు విదేశీ మార్కెట్లకు కూడా ఆభరణాలను పంపించే స్థాయికి ఎదిగారు. కెనడా, లండన్, సింగపూర్, దుబాయ్ వంటి మార్కెట్లకు కూడా ఆయన వ్యాపారం విస్తరించింది. అయితే ఆయన జీవితంలో అత్యంత కీలకమైన మలుపు 1999 ఫిబ్రవరి 24న వచ్చింది. తాను తొలినాళ్లలో వ్యాపారం ప్రారంభించేందుకు అవకాశం కల్పించిన కందసామి పిళ్లై అప్పటికి భారీ అప్పుల్లో ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులతో పాత వ్యాపారం మూతపడే పరిస్థితి ఏర్పడింది. పిళ్లైతో ఉన్న మంచి వ్యాపార సంబంధాల కారణంగా కిరణ్ కుమార్ ఆ వ్యాపారాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు, అప్పటి బకాయిలను కూడా తీర్చారు. ఆ తర్వాత ‘లలితా జ్యువెలరీ’ పేరుతో తన సొంత బ్రాండ్‌ను ప్రారంభించారు. అప్పటి వరకు హోల్‌సేల్ వ్యాపారంలో ఉన్న ఆయన రిటైల్ రంగంలోకి అడుగుపెట్టారు. ఇదే నిర్ణయం ఆయన వ్యాపారాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది.
తక్కువ మార్జిన్.. ఎక్కువ మంది కస్టమర్లు
రిటైల్ వ్యాపారంలోకి వచ్చిన తర్వాత కిరణ్ కుమార్ వినియోగదారుల సమస్యలను అర్థం చేసుకున్నారు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే సమయంలో మేకింగ్ ఛార్జీలు, వేస్టేజ్ వంటి అంశాలపై కస్టమర్లు అయోమయానికి గురవుతున్నారని గుర్తించారు. దీంతో పారదర్శక ధరలకు ప్రాధాన్యం ఇచ్చారు. బీఐఎస్ హాల్‌మార్క్ ఉన్న బంగారాన్ని విక్రయించడంపై దృష్టి పెట్టారు. ఒక్క కస్టమర్ నుంచి ఎక్కువ లాభం పొందడం కంటే తక్కువ మార్జిన్‌తో ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించాలనే వ్యూహాన్ని అనుసరించారు. ఆయన మార్కెటింగ్ విధానం కూడా ప్రత్యేకంగా ఉండేది. లలితా జ్యువెలరీలో ఆభరణం కొనుగోలు చేసే ముందు ఇతర షోరూమ్‌లలో ధరలను తెలుసుకోవాలని కస్టమర్లకు సూచించేవారు. ఇతర చోట్ల కంటే ధర తక్కువగా ఉంటేనే తమ వద్ద కొనుగోలు చేయాలని చెప్పే స్థాయిలో ధరలపై నమ్మకాన్ని చూపించారు. ఈ విధానం కస్టమర్లలో నమ్మకాన్ని పెంచింది. క్రమంగా లలితా జ్యువెలరీ దక్షిణ భారతదేశంలో ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్‌గా ఎదిగింది.
61 షోరూమ్‌ల నుంచి వేల కోట్ల టర్నోవర్ వరకు
ప్రస్తుతం లలితా జ్యువెలరీ దక్షిణ భారతదేశంలోని ఐదు రాష్ట్రాల్లో 51 నగరాల్లో 61 షోరూమ్‌లను నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 23 షోరూమ్‌లు, తమిళనాడులో 20 షోరూమ్‌లు, తెలంగాణలో 10 షోరూమ్‌లు, కర్ణాటకలో 7 షోరూమ్‌లు, పుదుచ్చేరిలో 1 షోరూమ్ ఉంది. తమిళనాడులో కంపెనీకి సొంత తయారీ కేంద్రం కూడా ఉంది. కంపెనీ ఆదాయం కూడా భారీగా పెరిగింది. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.16,800.62 కోట్లుగా ఉన్న ఆదాయం, 2025లో రూ.16,907.88 కోట్లకు చేరింది. 2026 ఆర్థిక సంవత్సరంలో అది ఏకంగా రూ.25,039.80 కోట్లకు పెరిగింది. కంపెనీ పన్ను తర్వాత లాభం కూడా 2024లో రూ.359.83 కోట్ల నుంచి 2026లో రూ.1,009.82 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో కంపెనీ మొత్తం ఆస్తుల విలువ రూ.5,182.26 కోట్ల నుంచి రూ.10,945.14 కోట్లకు చేరింది. ప్రస్తుతం కంపెనీ విలువ సుమారు రూ.11,250 కోట్లుగా ఉంది.
రూ.1,700 కోట్ల ఐపీఓతో మరింత విస్తరణ
లలితా జ్యువెలరీ ఇప్పుడు స్టాక్ మార్కెట్‌లో ఐపీఓకు వస్తోంది. ఈ ఐపీఓ పరిమాణం రూ.1,700 కోట్లు. షేర్ ధరను రూ.190 నుంచి రూ.201గా నిర్ణయించారు. ఇందులో రూ.1,200 కోట్ల విలువైన కొత్త షేర్లను జారీ చేయనున్నారు. మరో రూ.500 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా విక్రయించనున్నారు. ఈ OFS ద్వారా వ్యవస్థాపకుడు కిరణ్ కుమార్ జైన్ తన వాటాలో కొంత భాగాన్ని విక్రయించనున్నారు. ఐపీఓ ద్వారా వచ్చే కొత్త నిధుల్లో సుమారు రూ.1,033.2 కోట్లను దక్షిణ భారతదేశంలో 10 కొత్త షోరూమ్‌లను ఏర్పాటు చేసేందుకు ఉపయోగించాలని కంపెనీ భావిస్తోంది. క్రిసిల్ రిపోర్టు ప్రకారం, 2022 నుంచి 2024 ఆర్థిక సంవత్సరాల మధ్య ఆపరేటింగ్ రెవెన్యూ వృద్ధి పరంగా లలితా జ్యువెలరీ దేశంలోని వేగంగా అభివృద్ధి చెందిన ప్రాంతీయ జ్యువెలరీ కంపెనీల్లో రెండో స్థానంలో నిలిచింది. ఒకప్పుడు తల్లి ఇచ్చిన నాలుగు బంగారు గాజులతో వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభించిన కిరణ్ కుమార్.. నేడు వేల కోట్ల విలువైన జ్యువెలరీ సామ్రాజ్యాన్ని నిర్మించారు. చదువు, డబ్బు కంటే పట్టుదల, మార్కెట్‌పై అవగాహన, కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకోవడం వ్యాపార విజయానికి ఎంత ముఖ్యమో ఆయన ప్రయాణం చెబుతోంది.

