- Home
- Business
- Gold Price Hike: శ్రావణం ఎఫెక్ట్.. పసిడికి మళ్లీ రెక్కలు..యుద్ధం టెన్షన్‌తో పెరిగిపోతున్న గోల్డ్ రేట్స్
Gold Price Hike: శ్రావణం ఎఫెక్ట్.. పసిడికి మళ్లీ రెక్కలు..యుద్ధం టెన్షన్‌తో పెరిగిపోతున్న గోల్డ్ రేట్స్
Gold Price Hike: బంగారం, వెండి ధరలు మరోసారి వినియోగదారులను షాక్‌కు గురిచేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, మిడిల్ ఈస్ట్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ ధరల కదలికలు పసిడి మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి.

శ్రావణ మాసం ఎఫెక్ట్
దేశీయంగా శ్రావణ మాసం ప్రారంభం కావడంతో పెళ్లిళ్లు, పండుగల సీజన్ ఊపందుకుంది. దీంతో బంగారం కొనుగోళ్లకు డిమాండ్ పెరగడం కూడా ధరలపై ప్రభావం చూపుతోంది. ఆగస్టు 18న దేశీయ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర సుమారు రూ.1,55,590 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,900 స్థాయిలో ఉంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,890గా నమోదైంది. సోమవారంతో పోలిస్తే సుమారు రూ.230 పెరిగింది. 22 క్యారెట్ల ధర రూ.1,42,900గా ఉండగా.. దాదాపు రూ.200 మేర పెరుగుదల కనిపించింది. నగరాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు.
కుదరని శాంతి ఒప్పందం
అయితే బంగారం ధరల పెరుగుదలకు కేవలం దేశీయ డిమాండ్ మాత్రమే కారణం కాదు. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు కూడా కీలకంగా మారాయి. ముఖ్యంగా అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ఇరు దేశాల మధ్య తాత్కాలిక అవగాహన గడువు ముగిసినా శాశ్వత శాంతి ఒప్పందం కుదరకపోవడం ఇన్వెస్టర్లలో ఆందోళన పెంచుతోంది.
ద్రవ్యోల్బణంపై ఒత్తిడి
ముఖ్యంగా హర్మూజ్ జలసంధి పరిస్థితి ఇప్పుడు కీలకంగా మారింది. ప్రపంచ చమురు రవాణాలో ఈ మార్గానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ఇక్కడ రవాణాకు అంతరాయం ఏర్పడితే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెరుగుతోంది.
చమురు ధరలు పెరిగితే రవాణా, ఉత్పత్తి ఖర్చులు పెరిగి ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాలు మళ్లీ పెరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతారు. ఇక అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలు కూడా బంగారం ధరలకు కీలకమే. వడ్డీ రేట్లపై అంచనాలు మారడం, అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ పెరగడం, డాలర్ కదలికలు.. ఇవన్నీ అంతర్జాతీయ గోల్డ్ మార్కెట్‌లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయి.
రాబోయే రోజుల్లోనూ పసిడి ధరల్లో భారీ హెచ్చుతగ్గులు
దేశీయంగా చూస్తే శ్రావణ మాసం, పెళ్లిళ్ల సీజన్ బంగారానికి డిమాండ్ పెంచుతున్నాయి. ధరలు భారీగా ఉన్నప్పటికీ పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం ఆభరణాలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉండటంతో డిమాండ్ పూర్తిగా తగ్గడం లేదు. వెండి విషయంలోనూ పెట్టుబడి, పారిశ్రామిక అవసరాల కారణంగా ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. మొత్తంగా చూస్తే బంగారం, వెండి ధరలపై ప్రస్తుతం అంతర్జాతీయ ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ ధరలు, ద్రవ్యోల్బణం, అమెరికా ఫెడ్ నిర్ణయాలు, డాలర్ కదలికలు, దేశీయ డిమాండ్ వంటి అనేక అంశాలు ప్రభావం చూపుతున్నాయి. దీంతో రాబోయే రోజుల్లోనూ పసిడి ధరల్లో భారీ హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

